అగ్రిగోల్డ్ బాధితుల‌ను ఆదుకున్న ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌దే

రాజ్యసభలో  ఎంపీ మేడ ర‌ఘునాథ్‌రెడ్డి

న్యూఢిల్లీ: అగ్రిగోల్డ్ స్కాంలో  బాధితులకు రూ. 667 కోట్లు విడుదల చేసి ఆదుకున్న ఘ‌న‌త నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ మేడ ర‌ఘునాథ్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం రాజ్య‌స‌భ‌లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. `బ్యాంకుల కుంభకోణాలు ఇటీవల కాలంలో 27 శాతం పెరిగాయి . ఏపీలో అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేస్తే గ‌త ప్ర‌భుత్వంలో వైయ‌స్ జ‌గ‌న్  ప్ర‌భుత్వం అసాధారణ స్థాయిలో నేరుగా చొరవ తీసుకొని బాధితులను ఆదుకుని చరిత్ర సృష్టించింది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధితులకు న్యాయం చేసి  ఆదుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం  ఆదుకున్న తరహాలో బ్యాంకు మోసాలకు గురైన వారిని రాష్ట్ర ప్రభుత్వాలే ఆదుకోవాలి. వైయస్ జగన్ హయాంలో రైతులకు, వ్యవసాయ రంగానికి బ్యాంకుల నుంచి  54 శాతం రుణాలు ఇప్పించారు. పెరుగుతున్న ధరలు కనుగుణంగా రైతులకు తగిన రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకింగ్ రంగాన్ని గ‌తంలో వైయస్ జగన్ కోరారు.  కేంద్ర బడ్జెట్లో రైతులకు ఆర్థిక సహాయం, రుణ కల్పనపై ప్రాధాన్యత కల్పించలేదు. బ్యాంకింగ్ ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు.. ఎక్కువ రోజులు పనిచేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు ఇవ్వాలి. పదవి విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగులకు తగ్గిన పెన్షన్లు కూడా ఇవ్వడం లేదు. బ్యాంకింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి` అని ర‌ఘునాథ్‌రెడ్డి రాజ్య‌స‌భ‌లో డిమాండ్ చేశారు.

Back to Top