తిరుపతి: అంతర్జాతీయ గుర్తింపు ఉన్న తిరుమల పవిత్రత కూటమి ప్రభుత్వంలో మంటగలుస్తోందని మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదినెలల కూటమి పాలనలో తిరుమలలో జరుగుతున్న అనాచారాలు శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నానన్న పవన్ కళ్యాణ్ ఈ దుర్మార్గాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... వైయస్సార్సీపీ అధికారంలో ఉండగా చిన్న అంశాలను కూడా భూతద్దంలో చూపించి తిరుమల పవిత్రతను మంట కలిపేశారని చిలువలువలవులుగా ప్రచారం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు.. అధికారంలోకి వచ్చాక ఇదే తిరుమల కేంద్రంగా వరుసగా అపశృతులు జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తున్నారు. పది నెలల పాలనతో తిరుమలను ఏకంగా గంజాయి కేంద్రంగా మార్చేశారు. మద్యం అమ్మకాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. - అత్యంత పవిత్రమైన పాపవినాశనం జలాశయంలో బోటు షికారు చేయడంపై అధికారులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. పైగా అధికారులు పాపవినాశనంలో బోటు షికారు చేసిన వీడియోలను సరదాగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఆనందం పొందుతున్నారు. - చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న కారణంతో కూంబింగ్ కోసం పాపవినాశనం జలాశయంలో బోట్లను దించడం జరిగిందని వివేక్ అనే అటవీశాఖాధికారి ప్రకటించాడు. ఈ విషయం పత్రికల్లో ప్రచురితం అయ్యింది. ఇది జరిగి ఐదు రోజులైనా ఏరకమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. దీనిపై ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, ఏఈవో కానీ ఇంతవరకు స్పందించలేదు. - అంటే, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వమే అంగీకరించినట్టు అనుకోవాల్సి వస్తుంది. వివేక్ మీద ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంకోపక్క టూరిజం కోసం ట్రయల్ రన్ చేస్తున్నామని అటవీ సిబ్బంది ప్రకటించిన విషయం కూడా అవే పత్రికల్లో వచ్చింది. పవిత్ర జలాశయాన్ని టూరిస్ట్ కేంద్రంగా మార్చాలనే దురాలోచన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిరుమల అపవిత్రతపై పవన్ కళ్యాణ్ స్పందించరా - సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించానని డప్పు కొట్టుకుంటున్న పవన్ కళ్యాణ్, తాను నిర్వహించే అటవీ శాఖ పరిధిలోకి వచ్చే జలాశయంలో బోటు షికార్లు పేరుతో ఆధ్మాత్మికతకు భంగం కలిగిస్తుంటే ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదు? సనాతన ధర్మానికి ముప్పు వాటిల్లితే పరిరక్షించాల్సిన పవన్ కళ్యాణ్, నడుం నొప్పి పేరుతో విశ్రాంతి తీసుకోవడం భావ్యమేనా? - నిషేధం ఉన్నప్పటికీ తిరుమల కొండ మీద మద్యం, మాంసం దొరుకుతున్న ఘటనలు ఇప్పటికే మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యాయి. తాజాగా నిన్న కొండ మీద బాలాజీనగర్‌లో మద్యం పట్టుకున్నామని పోలీసులు మీడియాకు చూపించారు. - ఇటీవలే ఇద్దరు వ్యక్తులు గంజాయి, మద్యం సేవించి హల్ చల్ చేశారు. గెస్ట్ హౌస్‌ల దగ్గర భక్తులను భయభ్రాంతులకు గురిచేశారు. వీరిని పట్టుకోవడానికి ముగ్గురు ఏవీఎస్ఓలు, ఒక సీఐ, నలుగురు పోలీసులు, నలుగురు విజిలెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికి కూడా ప్రభుత్వం వద్ద కానీ, టీటీడీ నుంచి కానీ సరైన సమాధానం రాలేదు. - 15 రోజుల క్రితం ఒక వ్యక్తి తప్పతాగి సాక్షాత్తు వరాహస్వామి ఆలయం ఎదుట నేను లోకల్, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎంత మద్యం కావాలన్నా తీసుకొస్తానంటూ రచ్చ రచ్చ చేశాడు. యాత్రికులు బిర్యానీ తెచ్చుకుని కొండ మీద తినడం సంచలనం సృష్టించింది. - ఇవి కాకుండా కొండ మీద యథేచ్చగా గుట్కా, మట్కా, గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని, దొరుకుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఇటీవల చోటుచేసుకున్న ఘటనలే నిదర్శనం. - ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ ఒక్క నెలరోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు జరగడం తిరుమల పవిత్రను ప్రశ్నార్థం చేసేలా ఉన్నాయి. తిరుమల ప్రక్షాళన ఇలాగేనా..? - తిరుమలను ప్రక్షాళన చేస్తున్నామని పదేపదే చెబుతున్న చంద్రబాబు, ఈ పది నెలల కాలంలో చేసిన ప్రక్షాళన ఇదేనా? మద్యం, చికెన్, గుట్కా, గంజాయి, బిర్యానీలు అమ్మడమే చంద్రబాబు చెప్పే తిరుమల ప్రక్షాళన అనుకోవాలా? పాపవినాశనంలో బోటు షికారుపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు? - వైయస్సార్సీపీ హయాంలో కొండ మీద అరాచకాలు జరిగాయని చంద్రబాబు విషప్రచారం చేశాడు. కానీ ఒక్కదానికి కూడా ఆధారం చూపించలేకపోయాడు. కానీ, కూటమి పాలనలో రోజుకో విధంగా తిరుమల పవిత్రతను మంటకలిపేస్తున్నారని ఆధారాలతో సహా దొరికిపోతున్నారు. దానిపైనా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు సరికదా అపవిత్ర సంఘటనలపై భక్తులకు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదు. - తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన ఆరోపణలను ఇంతవరకు ఆధారాలతో నిరూపించలేకపోయారు. ముంతాజ్ హోటల్ కి అనుమతిచ్చిందే చంద్రబాబు. స్వామీజీలు తిరగబడితే తప్ప చంద్రబాబు తన నిర్ణయం వెనక్కి తీసుకోలేదు. దానిపైనా మా ప్రభుత్వంపై బురదజల్లాలని చూశాడు. - పాపవినాశనంలో బోటు షికారుకి సంబంధించి అటవీ శాఖ అధికారిని సస్పెండ్ చేస్తారో, టీటీడీ ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకుంటారో, మౌనంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటారో, జరిగిన తప్పుకి క్షమాపణలే చెబుతారో చంద్రబాబు ప్రకటించాలి. - తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే రోజురోజుకూ దిగజారుస్తున్నారు. ఈ ఘటలన్నీ కూటమి ప్రభుత్వం పతనం అత్యంత వేగవంతంగా జరుగుతోందని చెప్పడానికి సాక్ష్యాలు. - తిరుపతిలో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని పవన్ కళ్యాన్ ఏ క్షణాన వీర ప్రతిజ్ఞ చేశాడో ఆ రోజు నుంచే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇదంతా చూస్తుంటే సనాతన ధర్మం ముసుగులో ఇలాంటి కార్యకలాపాలు చేయిస్తున్నారా అనే అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయంపై టీడీపీ జెండా ఎగరేశారు - టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామంలో పంచాయతీ కార్యాలయం ముందున్న ఉన్న జాతీయ జెండా కోసం ఉంచిన జెండా స్థంభంపై టీడీపీ జెండాను ఎగురవేశారు. పంచాయతీ కార్యాలయంపైన కూడా టీడీపీ జెండాను ఎగురవేశారు. టీడీపీ వికృత చేష్టలకు ఇదే నిదర్శనం. - నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ తో ఎన్ని దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయో చెప్పడానికి నిన్న రాత్రి మురళి ఇంటిపై టీడీపీ నాయకులు జరిపిన దాడి ప్రత్యక్ష సాక్ష్యం. తిరుమతి ఎమ్మెల్యే ఆదేశాలతో పోలీసుల సహకారంతో 30 మంది గూండాలు మురళి ఇంటి మీద దాడి చేసి తలుపులు విరగ్గొట్టి, ఆయనపై ఆయన భార్యపై దాడి చేశారు.