తాడేపల్లి: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు సృష్టించిన అరాచకంపై ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి పార్టీల దౌర్జన్యాలను ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎందుకు ఈసీ మౌనంగా ఉందని ప్రశ్నించారు. అక్రమాలకు వంతపాడుతున్న అధికారులను కఠినంగా శిక్షించకపోతే ప్రజాస్వామ్యానికే అర్థం లేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు... రాష్ట్రంలో గత రెండురోజులుగా జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా వ్యవహరించాయి. తమకు బలం లేకపోయినప్పటికీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు, అరాచకాలతో పదవులను దక్కించుకునేందుకు తెగబడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంపై వీడియోలతో సహా మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. వైయస్‌ఆర్‌సీపీగా ఈ దారుణాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. అయినా కూడా చట్టవిరుద్దంగా వ్యవహరించిన అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇటువంటి దాడులు, దౌర్జన్యాలకు ఈసీ ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యంకు రక్షణ. లేకపోతే ప్రజలకు విశ్వాసం సడలిపోతుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సైతం ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. వైయస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచిన వారికి బలవంతంగా టీడీపీ కండువాలను కప్పి, వారిని తమ పార్టీ వారుగా చెప్పుకునే సిగ్గుచేటు చర్యలకు తెగబడ్డారు. స్వేచ్ఛాయుత ఎన్నికలంటే చంద్రబాబుకు భయం చంద్రబాబు గత ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారా? లేక ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారా? కూటమి పాలన చూస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు. చంద్రబాబుకు నిరంతరం అభద్రతాభావం. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తమ బండారం బయటపడుతుందని భయపడుతున్నారు. నాలుగేళ్ళ కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్ల వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది. ఈ స్థానిక సంస్థల్లో వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పదవులకు ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే, ఇప్పుడు మాకు అధికారం ఉందని, తాము ఏం చేసినా అధికారులు ప్రశ్నించరనే ధీమాతో కూటమి పార్టీలు ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ అడ్డగోలుగా ఆ పదవులను చేజిక్కించుకుంటున్నాయి. కొన్నికోట్ల అసలు తెలుగుదేశం పార్టీకి అభ్యర్ధులే లేరు. అక్కడ వైయస్‌ఆర్‌సీపీ నుంచి బయపెట్టి, ప్రలోభపెట్టి ఫిరాయించేలా చేశారు. వారిని తెలుగుదేశం అభ్యర్ధులుగా చూపి, వారికి పదవులను కట్టబెట్టేందుకు చట్టవిరుద్దమైన మార్గాలకు కూడా తెగబడ్డారు. పలుచోట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్ధులపై దాడులు చేశారు, వారి ఆస్తులను ధ్వంసం చేశారు, తప్పుడు కేసులు బనాయించారు. వారి బంధువులపైన కూడా పోలీసులను ప్రయోగించి భయబ్రాంతులకు గురి చేశారు. ఇలాంటి దుశ్చర్యలతో కొన్నిచోట్ల విజయం సాధించారు. రామకుప్పంలో బరితెగించిన టీడీపీ చంద్రబాబు సొంత నియోజకవర్గం రామకుప్పంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల కోసం జరిగే ఉప ఎన్నికలో తెలుగుదేశం దౌర్జన్యాలకు పాల్పడేందుకు సిద్దమైంది. దీనిపై వైయస్‌ఆర్‌సీపీ కోర్ట్ కు వెళ్ళి ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని ఆదేశాలు తీసుకుంది. కర్ణాటక నుంచి వారిని రామకుప్పంకు వాహనాల్లో తీసుకువస్తుంటే, పోలీసులు కావాలనే, ఎన్నికలకు సమయం దాటిపోవాలనే టీడీపీ డైరెక్షన్‌లో భాగంగా వారి వాహనాలను నెమ్మదిగా తీసుకువచ్చారు. మార్గ మధ్యలో తెలుగుదేశం వారు చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేయడం, వారి వాహనాల శ్రేణులపై దాడులకు తెగబడటం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా అన్ని మీడియా చానెళ్ళలో ప్రసారం అయ్యాయి, దీనిని ప్రజలంతా చూశారు. పదహారు మంది ఎంపీటీసీలు వైయస్‌ఆర్‌సీపీ వారే గెలిస్తే వారిని భయపెట్టి, ఎన్నికకు హాజరుకానివ్వకుండా కుట్రచేసి ఆ పదవులను తెలుగుదేశం దక్కించుకుంది. అన్నిచోట్ల దౌర్జన్యాలే రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కూడా ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు పాల్పడింది. అనంతపురం జిల్లా రామగిరికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో విజయం కోసం పోలీసులతో చట్ట విరుద్దంగా వ్యవహరింప చేశారు. సుధాకర్ అనే ఎస్‌ఐని పిలిపించి, ఆయనతో వైయస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలకు వీడియో కాల్ చేయించి, వారిని ఎమ్మెల్య సునీత బెదిరించారు. దీనిని నిరసిస్తూ వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రోడ్డుపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. ఇదేనా చంద్రబాబు చెబుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ? పశ్చిమ గోదావరిజిల్లా అత్తిలిలో కూడా ఇదే విధంగా వైయస్‌ఆర్‌సీపీ వారిని బెదిరించి, భయపెట్టి, ఎన్నికకు దూరం చేయాలని చూస్తే, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు రోడ్డుపై బైటయించి అధికారుల తీరుపై ఆందోళన నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిపురాతకంలో సృజన అనే ఎంపీటీసీ వైయస్‌ఆర్‌సీపీకి ఓటేయడానికి చెయ్యేత్తితే ఆమె చేతిని బలవంతంగా కిందికి దింపి, ఆమెపై సుబ్బారెడ్డి అనే ఎంపీటీసీ దౌర్జన్యానికి పాల్పడ్డారు. పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 17 మంది ఎంపీటీసీలు వైయస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచారు. ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వు అయితే, గెలిచిన వారిలోని మొత్తం ఎస్టీలను తెలుగుదేశం పార్టీ వారు కిడ్నాప్ చేసి, వారిని బెదిరించి, వారి నుంచి ఒకరిని తెలుగుదేశంలోకి చేర్చుకుని అతడికి ఎంపీపీ పదవిని కట్టబెట్టారు. మాదే విజయం అంటూ తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. విడవలూరు, పొద్దుటూరులోనూ ఇదే విధంగా దౌర్జన్యాలు చేశారు. తమకు వీలుకాని చోట ఎన్నికలను వాయిదా వేశారు.