తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది అని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు . తిరుమలలో స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆర్కే రోజా ట్వీట్ చేశారు. ఎక్స్ వేదికగా రోజా ఏమన్నారంటే.. ‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది!. సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. వైయస్ జగన్ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ, ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60 వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? పవన్, బీజేపీ. ఇది చంద్రబాబు నమూనా ప్రక్షాళన?. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!! అంటూ మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు.