గీత దాటిన పోలీసులకు కోర్ట్‌ వ్యాఖ్యలు చెంపపెట్టు

న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా తీరు మారదా?

పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ తో పోలీసులు ప‌నిచేస్తే న‌ష్ట‌పోతారు

 మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్ ఆగ్రహం

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధవారం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సాకె శైల‌జానాథ్‌

తాడేపల్లి: రాష్ట్రంలో చట్టాలను గౌరవించకుండా కూటమి ప్రభుత్వం మెప్పుకోసమే పనిచేస్తున్న పోలీసులకు తాజాగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీస్ యంత్రాంగ అనుసరిస్తున్న విధానాలపై న్యాయస్థానాలు కన్నెర్ర చేసినా వారి తీరు మారడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినట్లుగా పొలిటికల్ గవర్నెన్స్‌ కోసమే పనిచేస్తే పోలీసులే నష్టపోతారని స్పష్టం చేశారు.

ఇంకా ఆయనేమన్నారంటే...

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పోలీస్ యంత్రాంగం మీద న్యాయ‌వ్య‌వ‌స్థ చేస్తున్న వ్యాఖ్య‌లు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను తీవ్రమైన‌ ఆలోచన‌లో ప‌డేశాయి. ప్ర‌జ‌ల‌ను కాపాడాల్సిన పోలీస్‌ వ్య‌వ‌స్థ స‌హ‌జ న్యాయ సూత్రాల‌ను తుంగ‌లో తొక్కి ఇష్టారాజ్యంగా ప్ర‌వ‌ర్తిస్తోంది. స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యక‌ర స‌మాజాన్ని నిర్మించ‌డంలో కీల‌క‌మైన పోలీస్ యంత్రాంగం చంద్రబాబు జేబు సంస్థగా మారిపోవడం బాధాకరం. ఒకే కంటెంట్ ఉన్న కేసుల్లో ఇంప్లీడ్ కావొచ్చేమోకానీ, ప‌లుచోట్ల ఎఫ్ఐఆర్‌లు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు చెప్పిన సూచ‌న‌లు పోలీస్ యత్రాంగం ప‌ట్టించుకోవ‌డం లేదు. అరెస్ట్ చేయొద్ద‌ని చెప్పినా, పీటీ వారెంట్ పేరుతో అరెస్ట్ చేసిన సంద‌ర్భాలున్నాయి. ఒక ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పైనుంచి వ‌చ్చిన నాయ‌కుల సూచ‌న‌ల‌ను పోలీసులు పాటిస్తూ అక్ర‌మ అరెస్టుల‌కు పాల్ప‌డుతున్నారు. ఒకానొక సంద‌ర్భంలో డీజీపీని కూడా కోర్టుకు పిల‌వాల్సి ఉంటుంద‌ని మెజిస్ట్రేట్ వార్నింగ్ ఇచ్చే దాకా తెచ్చుకోవ‌డం పోలీస్ వ్య‌వ‌స్థ‌కు సిగ్గుచేటు. కోర్టు సీసీ టీవీ ఫుటేజీలు అడిగితే కోతులు కొరికేశాయ‌ని చెప్పుకునే ప‌రిస్థితిని ఎందుకు తెచ్చుకోవాల్సి వ‌చ్చిందో పోలీసులు ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి. 

వ్యవస్థీకృత నేరాల పేరుతో వేధింపులు

గుంటూరులో ప్రేమ్ కుమార్ అనే వ్య‌క్తి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూ ఒక రీల్ చేస్తే, అతడిని క‌ర్నూలులో అరెస్ట్ చూపించారు. ఆయ‌న్ను వ్య‌వ‌స్థీకృత నేర‌స్తుడిగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీన్ని కోర్టు ఆక్షేపించింది. మేం క‌ళ్లు మూసుకుని ఉండ‌లేమ‌ని గౌర‌వ హైకోర్టు చెప్పడం పోలీసుల వ్య‌వ‌హార‌శైలికి నిద‌ర్శ‌నం. ఏడేళ్ల క‌న్నా త‌క్కువ శిక్ష‌లు ప‌డే నేరాల‌కు పోలీస్ స్టేష‌న్‌లోనే బెయిల్ ఇవ్వాల‌ని ప‌లుమార్లు సూచించింది. క‌నీసం ముంద‌స్తు నోటీసులు కూడా ఇవ్వాల‌ని చెప్పింది. 41ఏ నోటీసు ఇచ్చాక  స్పందించ‌కుండ పారిపోయే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడే అరెస్ట్ చేయాల‌ని కోర్టులు చెబుతున్నాయి. నరసరావుపేటలో సుబ్బారెడ్డి  అనే వ్య‌క్తి  పెళ్ళిలో ఉంటే పోలీసులు మంగ‌ళ‌గిరిలో ఉన్న‌ట్టు చూపించారు. ఆ కేసులో ఆధారాలు ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఎన్ఎస్ 111 యాక్ట్ ని సోష‌ల్ మీడియా యాక్టీవీస్ట్‌ల  కేసుల్లో ఎలా వర్తింపచేస్తారంటూ కోర్టు పలుమార్లు ఆక్షేపించినా పోలీసుల తీరులో మార్పు రావడం లేదు. 

రాష్ట్రంలో అడుగడుగునా అధికార దుర్వినియోగం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అడుగుడుగునా అధికార దుర్వినియోగం కనిపిస్తోంది. ప‌ల్నాడు జిల్లా అచ్చంపేట‌లో  ఎంపీపీ ఎన్నిక ఉన్న నేప‌థ్యంలో వైయ‌స్సార్సీపీ ఎంపీటీసీల‌ను కిడ్నాప్ చేశారు. గార్ల‌పెంట‌లో ఇన్‌చార్జిగా ఉన్న గంగోజ‌మ్మ తానే స్వ‌యంగా వీడియో పంపినా కూడా అక్క‌డున్న లీడ‌ర్ల‌పై కేసులు పెట్టారు. వైయ‌స్సార్ క‌డ‌ప జిల్లాలో బ‌లం లేక‌పోయినా జెడ్పీ చైర్మ‌న్ పీఠాన్ని కైవ‌సం చేసుకునేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పావులు క‌దుపుతోంది. ఒక ప‌క్క పోటీ చేయ‌డం లేద‌ని చెబుతూనే మ‌రోప‌క్క ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని కోర్టును  టీడీపీ కోర్టును ఆశ్ర‌యించింది. అత్తిలి, య‌ల‌మంచ‌లిలో ఎంపీపీ ఎన్నిక‌లున్నాయి. రెండుచోట్లా వైయ‌స్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నా అడ్డ‌దారులు తొక్కి మండ‌లాధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌ని కూట‌మి నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలా అనైతిక కార్య‌క‌లాపాల ద్వారా గెల‌వాల‌ని చూస్తుంటే ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు ప‌ట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. 

ప‌థ‌కాల అమ‌లుపై దృష్టిసారించండి

రాష్ట్రంలో రైతులు తీవ్ర‌మైన క‌ష్టాల్లో ఉన్నారు. ఒక ప‌క్క మ‌ద్ధ‌తు ధ‌ర ల‌భించిక అప్పుల‌పాల‌వుతున్నారు. మిర్చి రైతులు నెల‌రోజులకుపైగా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తుంటే వారి కష్టాలు ప‌ట్టించుక‌నే వారే లేరు. పీ4 పేరుతో ప్ర‌భుత్వం కాల‌క్షేపం చేసే ప‌నులు ప‌క్క‌న‌పెట్టి ఎస్సీ, ఎస్టీల‌కు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు కేటాయించిన ప‌థ‌కాల‌కు నిధులు స‌క్ర‌మంగా ఖ‌ర్చు చేయాలి.  పీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధులు విడుద‌ల చేసి పేద‌రికంపై యుద్ధం చేయాలి. పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో నాయ‌కులు బెదిరింపుల‌కు దిగుతుంటే వారి ఆదేశాల‌కు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వ‌త్తాసు ప‌ల‌క‌డం స‌బ‌బేనా?

Back to Top