తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న కూటమి సర్కార్‌ 

శ్రీవారి క్షేత్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలా?

అధికారిక ప్రకటనలో సాక్షాత్తు డీఎఫ్‌ఓనే అంగీకరించారు 

దీనిపై విజిలెన్స్, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది?

ప్రశ్నించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

పవిత్రమైన పాపవినాశనం జలాల్లో బోటింగ్ 

నిఘా కోసమా... పర్యటకం కోసమా...?

తిరుమలను పర్యాటక కేంద్రంగా మారుస్తున్న చంద్రబాబు

శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారు

కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన పాపవినాశనం జలాల్లో బోటింగ్ నిర్వహంచడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బోటింగ్ పర్యాటకం కోసం చేశారా? లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కోసం చేశారా అనే దానిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

తిరుమలలో కూటమి ప్రభుత్వం మరో ఘోర అపచారానికి పాల్పడింది. వెంకటేశ్వరస్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తామని ప్రచారం చేసుకుని ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవారి ఆలయ పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారు. నిన్న పాపవినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే తొలిసారిగా బోటింగ్ జరిగింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగడంతో అటవీశాఖ సిబ్బంది బోటింగ్ ట్రైల్ రన్ నిర్వహించినట్లు, పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతోనే ఈ బోటింగ్ ట్రైల్ నిర్వహించారని తెలుగుదేశంకు వంతపాడే ఎల్లోమీడియా పత్రికలు రాశాయి. దీనిపై వివాదం తలెత్తడంతో అటవీశాఖ అధికారి వివేక్ స్పందిస్తూ డ్యాం పరిధిలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో తనిఖీల కోసమే బోటింగ్‌ను నిర్వహించామని ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి అటవీశాఖ పరిధిలోకి వస్తాయి. ఈ వివేక్ అనే అధికారి టీటీడీ పరిధిలోని అటవీశాఖ అధికారి అయితే ఆయనతో కాకుండా ఇటువంటి సీరియస్ అంశంపై టీటీడీ ఈఓ, జేఈఓ స్థాయి అధికారులే వివరణ ఇస్తారు. అలా కాకుండా డీఎఫ్ఓతో వివరణ ఇప్పించడం వెనుక మతలబు ఏమిటీ?

ట్రైల్‌రన్‌లో పాల్గొన్న వారి వివరాలు బయటపెట్టాలి

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమలలో ఎన్నో దురాగతాలు జరుగుతున్నాయనేది డీఎఫ్ఓ వివేక్ అనే అధికారి ప్రకటనతోనే బయటపడ్డాయి. పవిత్ర క్షేత్రంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుంటే విజిలెన్స్, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది? టీటీడీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తిరుమలలో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరగుతున్నాయనే సమాచారంతోనే బోటింగ్ ద్వారా నిఘా నిర్వహించామని అధికారులు అంగీకరిస్తున్నారు. తాజాగా జరిగిన ట్రైల్ రన్‌లో పాల్గొన్న అటవీ సిబ్బంది ఎవరో బయటపెట్టాలి. ఆ బోట్లలో నడిపిన వారు కాకుండా, దానిలో కూర్చున్న వారు అటవీశాఖ సిబ్బందేనా? ఆ ఫోటోలను బట్టి చూస్తే ఈ బోట్లను టూరిజం విభాగం వారే నడిపినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తిరుమలకు సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు రాష్ట్రంలో టూరిజాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే ఆలోచనలో భాగంగా ఆలయాల్లో టూరిజాన్ని ప్రోత్సహిస్తానని ప్రకటించారు. టూరిజం అంటేనే విలాసం, విహారం. ఆధ్యాత్మిక యాత్రలు వేరు, టూరిస్ట్ యాత్రలు వేరు. చంద్రబాబు ప్రకటించిన తరువాత ఈ బోటింగ్‌ జరిగిందంటేనే ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అధ్వాన్న పరిచి, పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారని అర్థమవుతోంది. టూరిజం కోసం ట్రైల్ రన్ అని ఒకరు, కాదూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిఘాకోసం అంటూ అటవీశాఖ అధికారి ప్రకటించడం వెనుక ఉన్న కారణం ఏమిటో చెప్పాలి. ఈ వ్యవహారం టీటీడీకి తెలిసి జరిగిందా? తెలియకుండా జరిగిందా అనే దానిపై స్పష్టత ఇవ్వాలి.

అటవీశాఖ మంత్రి పవన్ స్పందించాలి

ఈ వ్యవహారంపై అటవీశాఖ మంత్రి కాషాయాంబరధారి, పవనానందల స్వామి వివరణ ఇవ్వాలి. గత కొంతకాలంగా తిరుమల పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి ఘటనలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు. సనాతనధర్మాన్ని మౌనంతో సాధించాలని ఆయన భావిస్తున్నారని అనుకోవాలా? అటవీశాఖ పూర్తిగా పవన్‌ కళ్యాణ్ ఆధీనంలోనే ఉంది. తన శాఖ పరిధిలో జరుగుతున్న ఈ ఘటనలపై ఆయన ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? తిరుమలపై ప్రభుత్వం అవకాశం ఇస్తున్నందునే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికే కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందా?

Back to Top