విజయనగరం: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులను, గాయపడిన వారి కన్నీళ్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తుడిచి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి వద్ద లోకోపైలెట్ చిరంజీవి తండ్రి సన్యాసిరావును సీఎం వైయస్ జగన్ ఓదార్చారు. మృతుడు చిరంజీవిది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుశాలపురం గ్రామం. విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం – పలాస ప్యాసింజర్‌ను కొద్దినిమిషాల తర్వాత బయలుదేరిన విశాఖ – రాయగడ రైలు వెనకనుంచి ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ బాధితులను విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ పరామర్శించారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో విజయనగరం ఆస్పత్రికి చేరుకున్న ముఖ్యమంత్రి సర్వజన ఆస్పత్రిలోని రెండు వార్డుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న 22 మందిని స్వయంగా పరామర్శించారు. ప్రతి బెడ్డు వద్దకూ వెళ్లి ప్రమాదం జరిగిన తీరును, వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్నిరకాలుగా తోడుగా ఉంటుందని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. గాయపడ్డవారిలో కొంతమంది చిన్నారులను కూడా సీఎం పరామర్శించి వారిని ఆప్యాయంగా పలకరించారు. రైలు ప్రమాద ఘటనలో గాయపడ్డ మహిళలకు ఆయన ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్సలు, వారికి అందుతున్న సేవలపై స్వయంగా వైద్యలను అడిగి తెలుసుకున్నారు. ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిస్థితులపైనా ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఈ సమయంలో అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. రైలు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారు పూర్తిగా కోలుకునేంత వరకూ కూడా వారికి ఆయా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించాలని స్పష్టంచేశారు. తమ ఆరోగ్యం పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాతనే వారిని ఇళ్లకు పంపించాలన్నారు. పూర్తి వైద్యాన్ని ఉచితంగా అందించాలని, ఒక్కపైసాకూడా వారిపై భారం పడకూడదని సీఎం స్పష్టంచేశారు. బాధితులను స్వయంగా పరిశీలించిన తర్వాత వారికి అందించే పరిహారం విషయంలో సీఎం కొన్ని మార్పులు చేశారు. ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించారు. శాశ్వతంగా అంగవైకల్యం పొందితే వారికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నారు. గాయపడ్డవారు కోలుకునేందుకు నెలకన్నా ఎక్కువ సమయం పడితే వారికి రూ.5లక్షలు, నెలలోపు కోలుకున్నవారికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులనూ ఆస్పత్రి వెలుపల సీఎం పరామర్శించారు. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. తర్వాత సీఎం విశాఖపట్నం విమానాశ్రయానికి వెళ్తూ... దారిలో రైలు ప్రమాద ఘటనా స్థలం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఈ ఉదయం రైలు ప్రమాద ఘటన జరిగన ప్రాంతానికి వెళ్లాలని సీఎం నిర్ణయించుకున్నప్పటికీ, ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మతులు కారణంగా ఘటనా స్థలం వద్ద సందర్శనను రద్దుచేసుకోవాలని రైల్వే అధికారులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం నేరుగా ఆస్పత్రికి వెళ్లి రైలు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించారు.