తాడేపల్లి: స్థానిక కాలనీలోని సామాజిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పాపానికి పులి సాగర్ అనే విద్యావంతుడైన దళిత యువకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, పోలీసులు అమానవీయంగా వ్యవహరించిన ఘటన రాజమహేంద్రవరం చోటుచేసుకుంది. సాగర్ ను అర్థనగ్నంగా రాజమండ్రి ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ లోని సెల్ లో పెట్టి, మహిళా కానిస్టేబుళ్ళను కాపలాగా ఉంచిన సీఐ ఎస్ కె బాజీరావు దాష్టీకం వెలుగులోకి రావడంతో ఇది సంచలనంగా మారింది. తనకు జరిగిన అవమానం, కులం పేరుతో చేసిన దుర్భాషలు, చంపుతామంటూ సీఐ చేసిన బెదరింపులు, అర్థనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ళ ముందు నిలుచోబెట్టి ఆత్మగౌరవంను కించపరిచేలా పోలీసులు చేసిన వేధింపులతో మనస్థాపంకు గురైన దళిత యువకుడు వైయస్ఆర్ సిపి నేతలను కలిసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధిత యువకుడు పులి సాగర్ తో కలిసి తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజమండ్రి మాజీ ఎంపి, వైయస్ఆర్సిపి అధికార ప్రతినిధి మార్గాని భరత్, పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి, మాదిగ కార్పోరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావులు నిర్వహించిన మీడియా సమావేశంలో జరిగిన సంఘటనను మీడియా ముందు వెల్లడించారు. ఈ సందర్భంగా బాధిత యువకుడు పులి సాగర్ మాట్లాడారు.. నాపేరు పులి సాగర్, రాజమహేంద్రవరం వాస్తవ్యుడిని. మా ప్రాంతంలో వచ్చిన వరద పరిస్థితి వల్ల ఎర్పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించానంటూ రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అయితే నేను నివాసం ఉండే ప్రాంతంలోని బ్రదరన్ చర్చీ, కృష్ణానగర్ లో ఇంకా వరద నీరు నిలిచివుండటం, సమస్యలు అలాగే ఉండటంపై ఇదేనా మీరు చేసినది అంటూ ఫోటోలతో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టాను. గతనెల 30న రాజమండ్రిలోని ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని కోరారు. ఈనెల 2వ తేదీన పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను. సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన నేరంపై నాపై కేసు నమెదు చేస్తున్నామని, నా పేరు, కులం, విద్యార్థతలు వంటి ఇతర వివరాలను రాసుకున్నారు. తరువాత సీఐ ఎస్ కె బాజీరావు నన్ను నోటికి వచ్చిన బూతులతో తిడుతూ... కొవ్వు పట్టి కొట్టుకుంటున్నావురా నా కొడకా... లం.. కొడకా... పందిలా ఉన్నావు.. నిన్ను కోసి, రైలు పట్టాల మీద పడేస్తే దిక్కెవరు అంటూ ఇష్టం వచ్చినట్లు దూషించాడు. తరువాత నా గొంతుపట్టుకుని సెల్ లోకి నెట్టి తాళం వేశారు. సెల్ లో దుస్తులు విప్పాలంటూ హుకుం జారీ చేశాడు. అర్థనగ్నంగా నన్ను సెల్ లో నిలుచోబెట్టి, మహిళా పోలీస్ కానిస్టేబుళ్ళను కాపలాగా ఉంచాడు. బిఎస్సీ, బిఇడి చదువుకున్నాను, నేను ఎం తప్పు చేశానని ఇలా ఆత్మ గౌరవం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినందుకు నీ గొంతుకోసి గోదావరిలో పడేస్తే... శవం కూడా దొరకదు అంటూ సీఐ ఎస్ కె బాజీరావు బెదిరించాడు. మధ్యాహ్నం సమయంలో స్థానిక టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి, అర్దనగ్నంగా సెల్ లో ఉన్న నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్లారు. ఉదయం నుంచి నన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ విషయాన్ని మా కుటుంబానికి తెలియచేయలేదు. సాయంత్రం పోలీస్ స్టేషన్ కు నాకు తెలిసిన వారు రావడంతో వారికి ఈ విషయం చెప్పాను. తరువాత నా కుటుంబసభ్యులు న్యాయవాదిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. సాయంత్రం ఆరు గంటలకు న్యాయవాది వచ్చినా కూడా రాత్రి 9 గంటల వరకు నన్ను విడిచిపెట్టలేదు. తరువాత కూటమి ప్రభుత్వం గెలిచి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు పైశాచిక ఆనందంతో ఒక సైకోలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టానంటూ రాసిన కాగితాల్లో నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు. ఆ తరువాత 41 నోటీస్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి పోస్ట్ పెడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందంటూ సీఐ ఎస్ కె బాజీరావు నన్ను హెచ్చరించారు. ఇదే స్టేషన్ లో పికె పాకెటింగ్ కేసులో వచ్చిన దొంగను కూడా గౌరవంగానే చూశారు. నన్ను మాత్రం ఆత్మగౌరవం దెబ్బతినేలా వేధించారు. ఇంత జరిగిన తరువాత అసలు బతకాలని కూడా లేదు. నాకు జరిగిన దారుణంను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దృష్టికి తీసుకువచ్చాను. మాజీ ఎంపి మార్గాని భరత్ మాట్లాడుతూ... విద్యావంతుడైన ఒక దళిత యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లో ఏం తప్పు ఉంది? తమ ప్రాంతంలో వరద వల్ల ఏర్పడిన సమస్య పరిష్కారం కాలేదు అంటూ ఫోటోలతో సహా ఒక పోస్ట్ పెట్టాడు. దానికి కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతోంది. 41 నోటీస్ ఇస్తామని పోలీస్ స్టేషన్ కు పిలిపించి, అర్థనగ్నంగా మహిళా కానిస్టేబుళ్ళ ముందు దళిత యువకుడి నిలబెట్టి, అతడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. రాజమండ్రిలోనే పట్టపగలు పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ దారుణంను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నామా? దీనిపై న్యాయం కోసం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. మాజీ ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ... ఈ రాష్ట్రంలో దళితవర్గాలపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా దళితులను అణచివేసే విధానాలను అమలు చేస్తోంది. చివరికి విద్యావంతులైన దళిత యువకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంది. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగంలోని భావ ప్రకటన హక్కు, జీవించే హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తోంది. ఈరోజు పులి సాగర్ కు జరిగిన దాడిపై బాధ్యుడైన పోలీసులపై చర్య తీసుకోవాలి. ఈ రాష్ట్ర డీజీపిపై మాకు నమ్మకం లేదు. జాతీయ సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఈ రాష్ట్రంలోని దళిత వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, మరో అధికారి విజయపాల్ వంటి వారిపై ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందో ప్రజలు గమనిస్తున్నారు. నిత్యం దళితులపై ఈ రకమైన వేధింపులు, దౌర్జన్యాలు జరగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేకతకు ఇది నిదర్శనం. కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ.... పులి సాగర్ పై దారుణంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన తరువాత ఎపిలో దళితులపై అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎవరి కళ్ళలోనో ఆనందం చూడటం కోసం పోలీసులు పనిచేస్తున్నారు. చట్టాన్ని కాపాడటంలో విఫలమయ్యారు. ప్రశ్నించే గొంతులపై కాలు పెట్టి నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తూ... బిసి సామాజికవర్గంకు చెందిన ఆయన డ్రైవర్ ను పోలీసులు కొట్టి, చిత్రహింసల పాలు చేశారు. గతంలో చంద్రబాబు స్వయంగా ఎవరైనా దళితులుగా పుట్టాలని అనుకుంటారా, దళితులు శుభ్రంగా ఉండరు, మీకెందుకురా చదువులు అంటూ మాట్లాడిన మాటలతో దళితులపై ఆయనకు ఉన్న చిన్నచూపు అర్థమవుతోంది. ఆత్మగౌరవం లేని మనుషులు చచ్చినవారితో సమానమని అంబేద్కర్ అన్నారు. ఈ రోజు ఇదే పరిస్థితి ఎపిలో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం ఎస్సీలపైనే వేధింపులు, తప్పడు కేసులు నమోదువుతున్నాయి. కర్నూలు జిల్లాలో గోవిందమ్మ అనే దళిత మహిళ ను ట్రాక్టర్ గుద్ది చంపిన కేసులో దిక్కులేదు. ఇటీవల బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో తాళ్లూరి శ్రీను అనే వ్యక్తి భూమిని టిడిపి వారు లాక్కొని వేధింపులకు గురి చేస్తే, అధికారులు పట్టించుకోకపోవడంతో దిక్కులేదని పురుగుమందు తాగి చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే... అనేక ఘటనలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దళితులు బతకాలా? వద్దా? వారు మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడకు పోయాడు? త్వరలోనే ఎన్డీఏ కూటమికి దళితలు బుద్ది చెబుతారు. పులి సాగర్ కు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.