వైయ‌స్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్స్‌పై చర్యలు తీసుకోవాలి

లోకేష్, అనిత, అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడుపై కేసు రిజిస్టర్‌ చేయాలి

చట్టాన్ని కొందరికి చుట్టంగా మారుస్తామంటే ఉపేక్షించం

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టీకరణ

అసభ్యకర పోస్టింగ్స్‌పై టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

అనంతపురం: చట్టం అనేది అందరికీ ఒకేలా వర్తించాలి. కానీ ఈ రోజు చట్టాన్ని కొందరికి చుట్టంగా మారుస్తామంటే ఉపేక్షించేది లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చ‌రించారు. వైయ‌స్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టింగ్స్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రైవేట్‌ కేసులు వేయడానికి వెనుకాడమ‌ని  అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా సోషల్‌ మీడియాలో చేసిన పోస్టులపై అనంతపురం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వైయ‌స్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. 

నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడుకు చెందిన ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) ఖాతాల నుంచి చేసిన పోస్టులను సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌కు అనంత వెంకటరామిరెడ్డి వివరించారు. సదరు ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జగన్‌పై చేసిన మార్ఫింగ్‌ పోస్టులు తమ మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత, స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసు రిజిస్టర్‌ చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. 

నారా లోకేష్‌ ఆఫీస్‌లోనే ఈ పోస్టింగ్స్‌లు తయారు చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఎవరైనా సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ చేసిన పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెబుతున్నారని, కానీ అవి మాటలకే పరిమితం అవుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం కాకుండా లోకేష్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. 

అందరికీ సమానంగా చట్టం అమలు అయ్యేలా చూడాలని కోరారు. తాము చేసిన ఫిర్యాదును రిజిస్టర్‌ చేయకపోతే చట్టపరంగా ముందుకెళ్తామని, ప్రైవేట్‌ కేసులకూ వెనుకాడేది లేదని అన్నారు. న్యాయపరంగా ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేశారు. అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌పై అవమానకర రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారని, వీటిని అరికట్టాలన్నారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దోషులను శిక్షించాలన్నారు. ఏఏ సోషల్‌ మీడియా ఖాతాల్లోంచి అసభ్యకర పోస్టింగ్స్‌ చేశారో ఆ వివరాలను సీఐకి అందజేసినట్లు తెలిపారు. 

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సోషల్‌ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని తెలిపారు. వైయ‌స్ జగన్‌ను కించపరిచేలా ఐ టీడీపీ సోషల్‌ మీడియా ఖాతా నుంచి అసభ్య పోస్టింగ్స్‌ పెడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు ఉమాపతి మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌పై పెట్టిన అసభ్యపోస్టింగ్స్‌పై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కేసు రిజిస్టర్‌ చేయని పక్షంలో న్యాయపరంగా కోర్టును ఆశ్రయించి కేసు రిజిస్టర్‌ అయ్యేలా చూస్తామన్నారు.

Back to Top