నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా వేధిస్తున్నారు?

వేధింపులు ఆపకపోతే పిల్లలతో సహా బాబు ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంటా

సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఇంటూరి రవికిరణ్‌ భార్య హెచ్చరిక

రెండున్నర నెలలుగా తన భర్తను పోలీసులు ఎలా వేధిస్తున్నారో చెప్పి, కన్నీరు మున్నీరైన సుజన.

రెండున్నర నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారు

వివిధ పోలీస్‌ స్టేషన్లు, జైళ్లకు తరలిస్తున్నారు

కస్టడీలో ఉన్నా, ఇంటికి వచ్చి నోటీసులంటించారు

పోలీసుల దమననీతిని ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన సుజన

తాడేపల్లి: నా భర్త ఇంటూరి ర‌వికిర‌ణ్‌ ఏం తప్పు చేశాడని ప్ర‌భుత్వం ఇలా వేధిస్తుంద‌ని ఆయ‌న భార్య ఇంటూరి సుజ‌న ప్ర‌శ్నించారు. నా భర్త ఏ తప్పూ చేయలేదు. అయినా ఆయన పట్ల ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేద‌న్నారు. త‌న‌ భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని సుజ‌న హెచ్చ‌రించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ ఇంటూరి రవికిరణ్‌ భార్య సుజన మీడియాతో మాట్లాడారు.

 ఇంటూరి సుజన ఏమ‌న్నారంటే..
– నా భర్తపై ఇప్పటివరకూ 15 కేసులు పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. అసలు ఆయన చేసిన తప్పేమిటి?.
– కూటమి ప్రభుత్వం మా కుటుంబాన్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెడుతోంది. నా భర్తను ఆగస్టు 31న అదుపులోకి తీసుకున్న పోలీసులు, రెండున్నర నెలలుగా రాష్ట్రమంతా తిప్పుతున్నారు.
– విశాఖలోని మా ఇంటి నుంచి తీసుకువెళ్ళి తొలుత గుడివాడ, తర్వాత గుంటూరు అరండల్‌పేట, దువ్వాడలో కేసులు పెట్టారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు ఎక్కడెక్కడో కేసులు పెట్టారు.
– నా భర్తను తీసుకెళ్తున్న పోలీసులతో నేను ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి, మా కారులో గంజాయి పెట్టి సీజ్‌ చేయాలని ప్రయత్నించారు. 
– ఆ తర్వాత విశాఖలోని మహారాణిపేట పీఎస్‌కు పంపి, అక్కణ్నుంచి రాజమండ్రిలో రిమాండ్‌కు పంపారు. అక్కడి నుంచి మాచర్ల, తర్వాత కురుపాం, తర్వాత వైజాగ్‌ సెంట్రల్‌ జైల్‌కు పంపారు. పీటీ వారెంట్‌లు వేసి అక్కడి నుంచి బాపట్ల, ఇంకొల్లు పీఎస్‌కు ఆ తర్వాత సబ్బవరం జైల్‌కు పంపారు. అక్కడి నుంచి శ్రీకాకుళం లావేరు, గాజువాక కోర్టు ఇలా తిప్పి తిప్పి ఇప్పుడు మాచర్ల తీసుకువెళ్ళారు.
– రిమాండ్‌లో ఉన్నారని తెలిసి కూడా పులివెందుల పీఎస్‌ నుంచి పోలీసులు వచ్చి మా ఇంటి గోడకు నోటీసులు అంటించారు.
– నా భర్త హార్ట్‌ పేషెంట్‌. ఆయనకు ఏం మందులు ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. ఏ జైల్లో ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళితే అక్కడ  కలవనీయకుండా పీటీ వారెంట్‌ల పేరుతో ఇంకో చోటకు తరలిస్తున్నారు. 
– మా లాయర్లకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. ఆయనను ఒకేచోట అస్సలు ఉంచకుండా దాదాపు అన్ని జిల్లాల్లోని పోలీస్‌ స్టేషన్లు. జైళ్లు తిప్పుతున్నారు. నా భర్త ఆరోగ్యం బాగోలేదు. అయినా ఆయన్ను కనీసం చూడనివ్వడం లేదు. అర్ధరాత్రిళ్ళు తరలిస్తున్నారు. 
– 12 ఏళ్ళ నుంచి మేం వైయ‌స్ఆర్‌సీపీలో పనిచేస్తున్నాం, నా భర్త ఏ తప్పూ చేయలేదు. అయినా ఆయన పట్ల ఇంత కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదు.
– నా భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటాను.

Back to Top