డీబీటీ ద్వారా అబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కాం ఎలా ?

మాజీ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

రాష్ట్ర అప్పులపై కూట‌మి నేత‌లు పూటకో మాట‌

గుంజీలు ఎవరు తీయాలో మీరే ఆలోచించుకోండి

హైదరాబాద్‌: అసెంబ్లీలోనూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గత వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. డీబీటీ ద్వారా అబ్ధిదారులకు లబ్ధి చేకూరితే స్కాం ఎలా జరుగుతుందంటూ చంద్రబాబును ప్రశ్నించారు.

‘‘రాష్ట్ర అప్పులపై గతంలో ఓ మాట, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. అబద్దాన్ని నిజం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. 9.56 లక్షల కోట్లు అప్పులున్నాయని.. తవ్వితే ఇంకెన్ని ఉన్నాయో అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. తవ్వడానికి ఏముంది? ప్రతి కార్పొరేషన్ మీ చేతిలోనే ఉంది ఆడిట్ జరుగుతాయి కదా?. గుంజీలు ఎవరు తీయాలో మీరే ఆలోచించుకోండి’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు.

‘‘2014-15లో ఓపెన్ మార్కెట్‌లో ఎక్కువ వడ్డీ పెట్టీ అప్పు తెచ్చుకున్నారు చంద్రబాబు. మాపై అప్పులు ఎక్కువ అయ్యాయని, ఎక్కువ వడ్డీ తో అప్పులు తీసుకున్నారని వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మాజీ, ప్రస్తుత ఆర్ధిక మంత్రికి లెక్కలు అర్థం కావా?’’ అంటూ బుగ్గన ధ్వజమెత్తారు.

‘‘2014-19లో ట్రూ అప్‌ చార్జీలు రూ.6,625 కోట్ల నుంచి 28,717 కోట్లకు పెరిగింది. మా ప్రభుత్వ హయాంలో 2,300 కోట్ల మాత్రమే వినియోగదారులపై భారం వేశాం. తాజాగా 5 నెలల్లోనే రూ.6,770 కోట్లు వినియోగదారులపై భారం మోపారు. ఇంకా రూ.12 వేల కోట్ల ట్రూ అప్‌ చార్జీల భారం వేసేందుకు ప్రయత్నిస్తున్నార‌ని బుగ్గన నిప్పులు చెరిగారు.

Back to Top