స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరా..?

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది

స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాలతో ఆటలా బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంపూర్ణ సహాయ సహకారాలు

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు కన్ఫ్యూజన్ క్రియేట్‌ చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖకు ఉక్కునగరంగా పేరొచ్చిందంటే స్టీల్‌ప్లాంట్‌ వల్లేనన్నారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అపుతామని సీఎం చంద్రబాబు మాట ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో మాట నిలబెట్టుకుంటారా అని అడిగితే నాకేమీ అర్థం కాలేదు అని మాట్లాడుతున్నారు. మీకు అర్థం కాకుండా ఎలా మాట ఇచ్చారు’’ అంటూ గుడివాడ అమర్‌నాథ్‌ నిలదీశారు.

‘‘స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారా?. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీ ఏమైంది?. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేరా..?. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్‌లు ప్రైవేటీకరణ చేయలేదు. ఒక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మాత్రమే ప్రైవేటీకరణ చేస్తున్నారు. 32 మంది ప్రాణ త్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఇందిర గాంధీ మెడలు వంచి స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నారు. సెయిల్ లో స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేయాలి’’ అని అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు.

‘‘గడిచిన కొన్ని నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. పండగ పూట పస్తులు ఉండే పరిస్థితి కార్మికులకు ఏర్పడింది. వైయ‌స్ఆర్‌సీపీ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించింది. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశాము. కూటమి పాలనలో కార్మికులపై లాఠీ ఛార్జ్ చేస్తున్నారు. చంద్రబాబు మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మద్దతు వెనక్కి తీసుకుంటామని చెప్పండి. ఇద్దరు ఎంపీలు ఉన్న కుమార స్వామి తమ రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నారు. 16 మంది ఎంపీలు ఉన్న చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారు.’’ అని అమర్‌నాథ్‌ దుయ్యబట్టారు.

గతంలో దివంగత మహానేత వైయ‌స్ఆర్‌ 4000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించారని అమర్‌నాథ్‌ గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు బంగాళాఖాతంలో కలిపేశారు. స్టీల్ ప్లాంట్ కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాము. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది’’ అని గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.

Back to Top