రాజకీయం కోసమే చంద్రబాబు విషప్రచారం

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం మంచిది కాదు

దేవుడిని కూడా బాబు రాజకీయాలకు వాడుకుంటున్నారు

తిరుమలలో ఏ తప్పూ జరగలేదు

దుష్ప్ర‌చారానికి ఇకనైనా ఫుల్‌స్టాఫ్ పెట్టాలి : గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి

హైదరాబాద్‌: సీఎం స్థాయిలో చంద్రబాబు మాటలు బాధ కలిగించాయని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. దేవుడిని కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలను బాబు భయబ్రాంతులకు గురిచేశారని విమర్శలు గుప్పించారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ల ద్వారా నెయ్యి సేకరణ జరుగుతుందని, ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తారని తెలిపారు. 

 టీడీ లడ్డూపై సీఎం చంద్రబాబు చాలా దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారని, అందువల్ల విచారణ జరిపి, వాస్తవాలు వెలుగులోకి తేవాలని వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇలాంటి ఆరోపణ చేశారన్న ఆయన, అందుకు భక్తుల సెంటిమెంట్‌ను వాడుకోవడం తప్పని, అలా స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించడం ఏ మాత్రం సరి కాదని తేల్చి చెప్పారు. 100 రోజుల్లోనే ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోర వైఫల్యం చెందిందని, వాటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ఈ కుట్ర చేస్తున్నారని, డైవర్షన్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట అని అభివర్ణించారు. తిరుమల విషయంలో అనవసర ఆరోపణలు చేసి స్వామివారి ప్రతిష్టను మంటగలపద్దని శ్రీకాంత్‌రెడ్డి కోరారు.
    తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు అవసరమైన అన్ని సరుకుల సేకరణకు పక్కా వ్యవస్థ ఉందన్న మాజీ ఎమ్మెల్యే, లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యి కోసం ఆరు నెలలకు ఒకసారి టెండర్‌ పిలుస్తారని తెలిపారు. టెండర్లలో ఎల్‌–1కు 65 శాతం, ఎల్‌–2కు 35 శాతం వర్క్‌ ఆర్డర్‌ ఇస్తారని, 2013 నుంచి ఇదే పద్దతి కొనసాగుతోందని చెప్పారు. తిరుమల వచ్చిన ప్రతి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసుకుని పరీక్ష చేస్తారని, ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత లేకపోతే, ట్యాంకర్‌ను తిప్పి పంపిస్తారని వెల్లడించారు.
    గత జూలైలో ఇలాగే నెయ్యిని పరీక్షించి, నాణ్యత లేకపోవడంతో నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపామని టీటీడీ ఈఓ ప్రకటించగా, ఆ నెయ్యిని వినియోగించినట్లు సీఎం చంద్రబాబు చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే గుర్తు చేశారు. అంటే, చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన, ఇప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం ఆలయ సంప్రోక్షణ చేయిస్తున్నారని ఆక్షేపించారు.
    గతంలో కూడా వైయస్ఆర్‌ గారిపై తప్పుడు ఆరోపణలు చేశారన్న శ్రీకాంత్‌రెడ్డి.. చంద్రబాబు తన పాలనలో ఎన్నో ఆలయాలు కూల్చారని చెప్పారు. దేవుడి విషయంలో తప్పు చేస్తే తగిన శాస్తి తప్పదని ఆయన హెచ్చరించారు. ఒక పక్క వరదలు, రకరకాల ప్రజా సమస్యలు, స్టీల్‌ ప్లాంట్, కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలు.. 100 రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలు. దాని వల్ల ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్న భయంతో చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.

Back to Top