రాష్ట్రంలో పూర్తిగా క్షీణించిన శాంతిభద్రతలు

మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపాటు

వినుకొండ ఘటన దేశాన్నే కుదిపేసింది

నడిరోడ్డుపై ప్రజలు, పోలీసులు చూస్తుండగానే వైయస్ఆర్‌సీపీ కార్యకర్త పాశవిక హత్య

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోంది

కార్యకర్తలకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని భరోసా

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నడిరోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వినుకొండలో జరిగిన ఘటనతో దేశమంతా ఉలిక్కిపడిందన్న ఆయన.. రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో అమర్‌నాథ్ గురువారం మీడియాతో మాట్లాడారు. 

ఫలితాలు వచ్చిన నాటి నుంచే విధ్వంసం
రాష్ట్రంలో జూన్ 4న ఫలితాలు వెలువడిన క్షణం నుంచి నేటి వరకు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారని గుడివాడ అమర్ నాథ్ చెప్పారు. ఎన్నికల ముందు, ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. వారి పార్టీ నాయకులు, కార్యకర్తలను ప్రేరేపించారని, రేపు అధికారంలోకి వస్తే దాడులు చేస్తామనే మెసేజ్ ను ఎన్నికల కంటే ముందే ఇచ్చారన్నారు. 

1,000కిపైగా దాడులు
45 రోజులుగా దాదాపు 1000కి పైగా అనేక రకాల దాడులు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 31 మంది ప్రాణాలు బలిగొన్నారన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించారని, 300కుపైగా హత్యా యత్నాలు చేశారన్నారు. 500కు పైగా ప్రభుత్వ ఆస్తుల మీద, 500పైచిలుకు ప్రయివేటు ఆస్తులపై దాడులు చేశారన్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తున్నామన్నారు. కర్నూలు, రాంబిల్లి, గాజువాక.. ఇలా అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఏపీలో నిర్వీర్యం అయిపోయిందన్నారు. ఏ ఒక్క వ్యక్తికీ ఈ రాష్ట్రంలో బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రాగలమన్న నమ్మకాన్ని కోల్పోయేలా గడచిన 45 రోజులుగా పాలన సాగుతోందన్నారు. 

వినుకొండ ఘటన దేశాన్ని కుదిపేసింది
నిన్న వినుకొండలో జరిగిన ఘటన దేశాన్నే కుదిపేసిందన్నారు. రోడ్ల మీద జనం, పోలీసులు ఉండగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త కత్తితో రెండు చేతులూ అమానుషంగా నరికి ప్రాణాన్ని తీసేశాడో మాటల్లో కాదు, రాష్ట్ర ప్రజలందరూ కళ్లతో చూశారన్నారు. ప్రాణాలు కోల్పోయిన అబ్బాయి కుటుంబాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం పరామర్శిస్తారన్నారు. 

ఎంపీ మిధున్ రెడ్డి గారిపై దాడి హేయం
ఈరోజు ఉదయం మా పార్టీ మాజీ ఎంపీ రెడ్డప్ప.. పార్లమెంటు సభ్యులు మిధున్ రెడ్డి గారిని పుంగనూరులో వారి ఇంటికి కలవడానికి వెళ్తే ఆ ఇంటిపై రాళ్లతో దాడులు చేసి, మిధున్ రెడ్డి గారి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. రెడ్డప్ప గారి వాహనాన్ని తగులబెట్టి అక్కడికి వెళ్లిన పత్రికా విలేకరులపై కూడా దాడులకు పాల్పడ్డారన్నారు. చివరకు ఎంపీ గారిని పోలీసు వాహనంలో తీసుకుని తిరుపతి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఎంత వరకు సమంజసం ఆలోచించాలన్నారు. 

రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు
గడచిన 45 రోజులుగా ఏపీలో భారత రాజ్యాంగాన్ని పాటించడం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే పాటిస్తున్నారన్నారు. పూర్తిగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, కంట్రోల్ చేసే పరిస్థితిలో ముఖ్యమంత్రి, మంత్రులు, కూటమిలో ఉన్న మిగిలిన రాజకీయ పార్టీ నాయకులు లేరన్నారు. అన్ని రకాలుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, కింది స్థాయి కార్యకర్త వరకు బెదిరించి ప్రాణాలు తీయాలనే ఆలోచన ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు కూడా నాయకుడిని భూస్థాపితం చేస్తామన్న మాటలు చూస్తున్నామన్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఈరోజు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వచ్చాయన్నారు. 45 రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఈ దౌర్జన్యాలు, దాడులు, హత్యలు, హత్యాప్రయత్నాల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిన్న, ఈరోజు జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలని, వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇద్దరూ వైయస్ఆర్‌సీపీ అంటూ దుష్ప్రచారం
నిన్న జరిగిన హత్యపై కూడా ఇద్దరూ వైయస్ఆర్ సీపీ కార్యకర్తలేనని ఎల్లో మీడియా ప్రచారం చేసిందన్నారు. చంపిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడని ఫొటోలతో సహా ఆధారాలుంటే ఆ వ్యక్తి వైయస్ఆర్ సీపీకి చెందిన వ్యక్తి అని ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఎవరైనా రావాలన్నా భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రతి 5 ఏళ్లకూ ఎన్నికలు వస్తాయని, జరిగిన ప్రతి పరిణామానికీ ప్రజలుమళ్లీ బుద్ధి చెబుతారన్నారు. 

పార్టీ అండగా ఉంటుంది
రానున్న కాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి గ్రామ స్థాయి నుంచే తోడుగా ఉంటుందని, అరాచకాలు సృష్టించినా మీకు తోడుగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు, పార్టీ నాయకత్వం నిలబడుతుందని భరోసా ఇచ్చారు. మాకు 40 శాతం ఓట్ షేర్ వచ్చి 1.30 కోట్ల మంది ఓట్లేసిన పార్టీగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త, అభిమానులకు అధిష్టానం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.  

ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించుకోవాలి
ఎర్రమట్టి దిబ్బలు జియో హెరిటేజ్ సైట్ గా, దానికి సంబంధించిన దాదాపు 3 వేల ఎకరాలు ఉన్నాయన్నారు. ఐఎన్ఎస్ కలింగకు సంబంధించి వెయ్యి ఎకరాల మేర నేషనల్ సెక్యూరిటీ వారి ఆధీనంలో ఉందని, మిగిలిన భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. దానికి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున అక్కడ రోడ్ల నిర్మాణం, ల్యాండ్ లెవలింగ్, అక్కడున్న మట్టి తరలింపు, ఉన్న ఆర్కియలాజికల్ ప్రాముఖ్యం ఉన్న ప్రాపర్టీని రిమూవల్, లేదా సీఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలు కనిపించాయన్నారు. నిన్న కొంత మంది అధికార పార్టీ నేతలు వెళ్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే చేశారని చెబుతున్నారని, 5 సంవత్సరాలు గడిచిపోయినా ఇదే చెబుతారని ఎద్దేవా చేశారు. మా హయాంలో జరిగితే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేయాలి కదా? అని ప్రశ్నించారు. మట్టిదిబ్బలను కాపాడాల్సిన అవసరం ఉందని, ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతులు లేకుండా జరగడానికి వీల్లేదన్నారు. దానిపై అవసరమైతే వ్యక్తిగతంగా పిల్ కూడా వేయాలన్నది తన అభిప్రాయమన్నారు.

ఎవరికి పడితే వారికి అంటగట్టేస్తారా?
ఎంపీ విజయసాయిరెడ్డి గారిపై వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. గిరిజన మహిళ, అధికారిణికి సంబంధించి ఆమె భర్త ఓ లేఖ రాశారని, అంటే అందులో ప్రముఖంగా పేరు ఉందని ఎవరికి పడితే వారికి అంటగట్టేస్తే కోపం రాదా? అని ప్రశ్నించారు. అధికారిణి వచ్చి క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి నా బిడ్డకు ఫలానా వ్యక్తి తండ్రి అని చెప్పిన తర్వాత కూడా రాద్దాంతం చేయడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయని, ఏది పడితే అది మాట్లాడటం సబబు కాదన్నారు. సెన్సిటివ్ విషయాలను ప్రస్తావించేటప్పుడు గౌరవంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

Back to Top