శ్రీవారి భక్తుల మృతికి పాలనా వైఫల్యమే కారణం

తొక్కిసలాట ఘటనలో అధికారులపై సీఎం ఆగ్రహం ఆశ్చర్యంగా ఉంది

టీటీడీ ఛైర్మన్, ఈఓ, జెఈఓలను నియమించిందే చంద్రబాబు

అధికారులపై నిందలు మోపి తప్పించుకోవాలని చూస్తున్నారు

మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజం

టీటీడీ ఛైర్మన్ తెలుగుదేశం సేవకే పరిమితమయ్యాడు

పవిత్రమైన తిరుమలను రాజకీయ క్షేత్రంగా మార్చేశాడు

తన ఛానెల్ లో టీడీపీకి విస్తృత ప్రచారం ఇచ్చినందుకే చైర్మన్ పదవి

కూటమి ప్రభుత్వంలో తిరుమలపై ప్రతి అంశాన్ని రాజకీయం చేశారు

సనాతన ధర్మాన్ని కాపాడతానన్న పవన్ ఏమయ్యాడు?

స్వామీజీలు, పీఠాధిపతులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సలహాలు ఇవ్వాలి

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి.

మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు డిమాండ్

తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు శ్రీవారి భక్తుల మృతికి చంద్రబాబు పాలనా వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఎం చంద్ర‌బాబు తిరుపతి పర్యటనలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అన్నారు. చంద్రబాబు వల్లే శ్రీవారి సేవే పరమావధిగా పనిచేయాల్సిన టీటీడీ కాస్తా టీడీపీ సేవలకు పరిమితమయ్యిందని విమర్శించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి:

టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి ఘోర ప్రమాదం జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, పలువురు గాయపడటం బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తిరుమలపై ప్రతి అంశాన్ని వివాదంగా చేస్తున్నారని అన్నారు.  వైయస్ జగన్ గారు తిరుమల దర్శనం కోసం వస్తున్నారని తెలియగానే ఈఓ, జెఈఓలు పెద్ద పెద్ద బోర్డ్ లు కట్టారు. ఆయన పర్యటన రద్దు అనగానే వెంటనే వాటిని తొలగించారు. కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా వారు పనిచేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పనిచేసే వారు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వైయస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తన టీవీ చానెల్ లో పెద్ద ఎత్తున ఇచ్చిన ప్రచారానికి ప్రతిఫలంగా  ఆయనకు ఈ పదవి దక్కింది. టీటీడీ ఛైర్మన్ గా ఉండి కూడా వైయస్ జగన్ గారిపై రాజకీయపరమైన విమర్శలు చేశారు. ఆయనకు శ్రీవారి పట్ల నిజమైన భక్తి లేదు. ప్రతిసారీ తిరుమలపై వివాదాలను సృష్టించి, రాజకీయంగా వైయస్ఆర్ సీపీని అణచివేయడానికి బీఆర్ నాయుడు, ఈఓ, జెఈఓలు ప్రయత్నించారే తప్ప భక్తులకు సేవ చేయాలని ఏనాడు పనిచేయలేదు. వారి దుర్మార్గమైన ఆలోచనల వల్లే ఇటువంటి దుర్ఘటన జరిగింది. తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది. ఈ కేసులో తన వారిని కాపాడుకునేందుకు కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ప‌వ‌న్ ప్ర‌శ్నించాలి క‌దా?

సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఇంత వరకు దీనిపై స్పందించలేదు. ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని కాపాడేవారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారు ఇటువంటి ఘటనలపై స్పందించాలి. ధర్మ పరిక్షణ కోసం ఏం చేయాలో చెప్పాలి. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏం చేయాలో ఈ ప్రభుత్వానికి సూచించాలి. పీఠాధిపతులు, స్వామీజీలు స్పందించాలని అంబ‌టి రాంబాబు విజ్ఞప్తి చేశారు.  

కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాలి

తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున ప్రభుత్వం నుంచి పరిహారం ఇవ్వాలి. క్షతగాత్రులకు కనీసం పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళినటువంటి వైద్యం అందలేదు. గాయపడిన వారి పట్ల కనీసం బాధ్యత తీసుకోలేదు. చంద్రబాబు ఏరి కోరి తెచ్చుకున్న తిరుపతి ఎస్పీ ప్రజల కోసం కాకుండా కేవలం టిడిపి కోసమే పనిచేస్తున్నాడు. వైయస్ఆర్ సీపీపై తప్పుడు కేసులు బనాయించడంలోనే ఆయన మునిగిపోయాడు. ఈ ప్రమాదంపై తక్షణం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల‌ని అంబ‌టి రాంబాబు డిమాండు చేశారు.

Back to Top