నెల్లూరు: అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెర తీసిందని వైయస్‌ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన ఎనిమిది సంస్థలకే 59 ప్యాకేజీల కింద మొత్తం రూ.28,210 కోట్ల విలువైన పనులను కట్టబెట్టారని అన్నారు. వీటికి మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద ఇచ్చే రూ.2821 కోట్ల నుంచే 8 శాతం కమిషన్లుగా దండుకుంటున్నారని మండిపడ్డారు. తన అవినీతికి అడ్డం వస్తాయనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను పూర్తిగా తొలగించారని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దోచుకోవడం, దాచుకోవడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రజాధనంను పెద్ద ఎత్తున లూఠీ చేస్తోంది. గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. తాజాగా రాజధాని అమరావతి పనుల్లో వేల కోట్ల రూపాయల దోపిడీకి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన సంస్థలను ఎంపిక చేసుకుని, వాటికి అధిక రేట్లకు టెండర్లను కట్టబెట్టడం, వారికే మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడం, దాని నుంచి తిరిగి కమీషన్లను దండుకోవడంను ఒక వ్యవస్తీకృత విధానంలాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఒకచేత్తో అడ్వాన్‌లను ఇవ్వడం, మరోచేత్తో వారి నుంచి కమీషన్లను అందుకోవడం కూటమి ప్రభుత్వ కొత్త పాలసీగా కనిపిస్తోంది. - దోచుకోవడంపైనే చంద్రబాబు దృష్టి చంద్రబాబు పాలన అంటేనే దోచుకోవడం. ప్రారంభంలో రాష్ట్ర రాజధాని పేరుతో అందరి దృష్టి మళ్ళించి అమరావతి ప్రాంతంలో తాను, తన బినామీలతో కారుచౌకగా భూములను ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూముల విలువ వందరెట్లు పెరిగాయి. చంద్రబాబు, ఆయన బినామీలు అపర కుబేరులుగా మారారు. అలాగే అమరావతి నిర్మాణం అంటూ 2014-19 మధ్యన చంద్రబాబు షాపూర్జీ-పల్లోంజీ సంస్థకు వేల కోట్ల రూపాయల పనులు అప్పగించారు. ఈ సంస్థ నుంచి కమిషన్లు వసూలు చేసిన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా ఆదాయపన్ను అధికారులు పట్టుకున్నారు. ఇప్పుడు అదే వ్యక్తి కూటమి ప్రభుత్వంలో రాజధాని పనుల్లో చక్రం తిప్పుతున్నాడు. - గత టీడీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి గతంలో పట్టిసీమ పనులకు సంబంధించి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టర్‌లతో కుమ్మక్కు అవ్వడం వల్ల దాదాపు రూ.258 కోట్ల మేర కుంభకోణం జరిగింది. దీనిని ఆనాడే అసెంబ్లీలో వైయస్ జగన్‌గారు ప్రశ్నించారు, అంతేకాదు 2017-18 లో కాగ్ కూడా దీనిపై తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ నివేదిక ఇచ్చింది. అలాగే వైకుంఠాపురం బ్యారేజీ కోసం దాదాపు రూ.400 కోట్లు అంచనాలు పెంచి, 13.19 శాతం అధిక రేట్లకు నిబంధనలకు విరుద్దంగా ఆ కాంట్రాక్ట్‌ను ఖరారు చేసి దాని నుంచి చంద్రబాబు లబ్ధిపొందారు. అలాగే పోలవరం హెడ్ వర్క్స్ జలవిద్యుత్ కేంద్రం పనులను నవయుగ కంపెనీకి 4.8శాతం అధిక రేట్లతో రూ. 3216 కోట్ల రూపాయలకు కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో కాంట్రాక్టర్‌లను అడ్డుపెట్టి ఖజానాను దోచుకునేందకు సిద్దపడ్డారు. - పారదర్శక విధానాలకు పాతర వైయస్‌ఆర్‌సీపీ ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రవేశపెట్టిన పారదర్శక విధానాలకు కూటమి ప్రభుత్వం పాతర వేస్తోంది. ఆనాడు రూ.100 కోట్లు దాటిన ప్రతి టెండర్‌పైనా జ్యుడీషియల్ ప్రివ్యూ ఆమోదం తప్పనిసరి. అలాగే రివర్స్ టెండరింగ్ ద్వారా పోటీతత్వం పెంచి తక్కువకే పనులు జరిగేలా వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల ఒక్క పోలవరం పనుల్లో దాదాపు రూ.800 కోట్లు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా జరిగింది. సాగునీటి పనుల్లో రూ. 2500 కోట్లకు పైగా ఆదా చేశాం. రహదారులు, భవనాల నిర్మాణాలకు గానూ దాదాపు రూ.3,60,448 కోట్లు విలువైన పనులకు టెండర్లు పిలిచాం. దాని ద్వారా దాదాపు 4,36,164 పనులు చేపడితే దానిలో ఆదా చేసినది రూ. 7500 కోట్లు. ప్రజాధనం దోపిడీ కాకుండా చర్యలు తీసుకున్నాం. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డు. నీతిఅయోగ్ వంటి సంస్థలు వైయస్ జగన్ గారు చేపట్టిన ఈ రెండు విధానాలు చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయని ప్రశంసింది. - రివర్స్ టెండరింగ్ అమలు చేస్తే రూ.3000 కోట్లు ఆదా అయ్యేవి ఒక కిలోమీటర్ రోడ్డుకు రూ.53 కోట్లు రూపాయలు ఆమోదించిన రోజులు ఎప్పుడైనా చరిత్రలో ఉన్నాయా? తారుతో వేస్తున్నారా? బంగారంతో వేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు పాలనతో ఏదైనా సాధ్యం అనేందుకు ఇది నిదర్శనం. తాజాగా రాజధాని ముంపు నివారణ, రహదారుల నిర్మాణానికి ఏడీసీఎల్ ద్వారా 37 ప్యాకేజీలకు రూ.10,696 కోట్లకు టెండర్లు పిలిచారు. రూ.16,463 కోట్ల వ్యయంతో 22 ప్యాకేజీల కింద 34 వేల ఎకరాల్లో ప్లాట్ల అభివృద్ధి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జడ్జ్‌ల భవనాల కోసం సీఆర్‌డీఏ ద్వారా టెండర్ లను పిలిచారు. మొత్తం 59 ప్యాకేజీలకు గానూ రూ.27,160 కోట్లు విలువైన పనులకు టెండర్లు పిలిచారు. వీటికి 3.94 నుంచి 4.34 శాతం అధికంగా దాదాపు 1,049 కోట్ల భారం మోపుతూ రూ. 28,210 కోట్లుకు ఆ కాంట్రాక్ట్‌లను ఖరారు చేయడం జరిగింది. రివర్స్ టెండరింగ్‌కు బదులు అధిక రేట్లకు ఈ టెండర్లను ఖరారు చేశారు. అదే రివర్స్ టెండరింగ్ అమలు చేసి ఉంటే గతంలో ఉన్న లెక్కల ప్రకారం సగటున 8 శాతం ఆదా అయ్యేది. అంటే దాదాపు రూ.3000 కోట్లు ఆదా అయ్యేవి. రాజధానిలో రైతుల నుంచి 34 వేల ఎకరాల్లో ప్లాట్ల అభివృద్ధికి 18 ప్యాకేజీల కింద సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. రూ. 14887 కోట్లకు పనులను కాంట్రాక్టర్‌లకు అప్పగించింది. జీఎస్ట్ఈ, సీనరేజీ, న్యాక్ లను అదనంగా చెల్లిస్తామని చెప్పింది. ఈ మూడింటిని కలుపుకుంటే దాదాపు రూ. 17000 కోట్లకు పనుల విలువ పెరుగుతుంది. - ఆ ఎనిమిది సంస్థలకే ఎందుకు చంద్రబాబుకు సన్నిహితమైన ఎనిమిది సంస్థలకే మొత్తం పనులను కట్టబెట్టారు. మెగా కృష్ణారెడ్డి, ఈనాడు పత్రిక అధినేత చెరుకూరి కిరణ్ బంధువు రాయల్ రఘుకు చెందిన ఆర్‌విఆర్ ప్రాజెక్ట్, చంద్రబాబు సన్నిహితుడు బీఎస్ఆర్ ఇన్ఫ్రా వ్యవస్థాపకుడు బలుసు శ్రీనివాస్, ఏవీ రంగరాజుకు చెందిన ఎన్‌సీపీ, మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు కనకమేడ వరప్రసాద్‌కు చెందిన కెఎంయు, ఎల్‌అండ్‌టీ వంటి సంస్థలకే ఈ పనులు కట్టబెట్టారు. వాటిల్లో ఎన్‌సీసీ సంస్థకు రూ.6124 కోట్లు, బీఎస్‌ఆర్ కు రూ.6214 కోట్లు, ఆర్వీఆర్ సంస్థకు రూ.6031 కోట్లు, మెగా సంస్థకు రూ.7022 కోట్లు, ఎంవీఆర్ సంస్థకు రూ.796 కోట్లు, ఎల్‌అండ్‌టీ కి రూ.809 కోట్లు, కెఎంవి సంస్థకు రూ.429 కోట్లు, బిఎస్పిసీఎల్ సంస్థకు రూ.779 కోట్ల విలువైన పనులను అప్పగించారు. - ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టాలి కూటమి ప్రభుత్వ పాలనలో రాజధాని పనుల్లో జరుగుతున్న అవినీతిని సహించేది లేదు. తక్షణం ప్రభుత్వం గతంలో ఉన్న రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ విధానాలను పునరుద్దరించాలి. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని రద్దు చేయాలి. అవినీతిరహితంగా టెండర్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.