

















కూటమి పాలనలో రైతుల గోడు అరణ్యరోదన
గిట్టుబాటు రేటు దక్కక అల్లాడుతున్న రైతాంగం
తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి
మండిపడ్డ బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ
మిర్చి రైతులు ధర్నాలు చేస్తుంటే కనిపించడం లేదా?
దెబ్బతిన్న అరటి రైతులను ఆదుకేనే చర్యలే ఏవీ?
పంటను చెరకు రైతులు తగలబెట్టుకుంటుంటే ఏం చేస్తున్నారు?
ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని, లేనిపక్షంగా వైయస్‌ఆర్‌సీపీ నుంచి రైతు పోరును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడినా రైతులకు కడగండ్లు తప్పడం లేదు. కరువు, లేదంటే అతివృష్టి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి పరిణామాలను రైతులు చవిచూస్తున్నారు. దీనికి తగట్టుగా మొదటి నుంచి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు, వ్యవసాయం దండుగ అన్న భావనే ఉంది. దానికి అద్దం పట్టేలా తాజాగా రాష్ట్రంలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ధర్నాలు చేస్తున్నారు. కొనేవారు లేక మిర్చి యార్డుల్లో లక్షల బస్తాల మిర్చీ నిల్వలు పెరుకుపోతున్నాయి. ఇటీవల వైయస్ జగన్ గారు గుంటూరు మిర్చి మార్కెట్‌ను సందర్శించి, వారికి అండగా మాట్లాడారు. వెంటనే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రం ద్వారా కొనుగోళ్ళు చేయిస్తానని ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క బస్తా అయినా కొనుగోలు చేశారా? కూటమి ప్రభుత్వ నిర్వాకంకు విసిగిపోయిన మిర్చి రైతులు రోడ్ల మీదికి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు.
రైతులను ఆదుకునే ఆలోచనే లేదు
రాయలసీమలో ఈదురుగాలులతో అరటిపంట దెబ్బతిన్నది. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కరోనా సమయంలోనూ అరటి పంటకు రేటు లేకపోతే సీఎంగా వైయస్ జగన్ గారు ప్రభుత్వం తరుఫున అరటిని పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలకు పంపి మార్కెట్ కల్పించారు. కానీ చంద్రబాబుకు మాత్రం అరటి రైతుల గోడు కనిపించడం లేదు. వారిని ఆదుకోవాలనే కనీస ఆలోచనే లేదు. ఉత్తరాంధ్రలో చెరకు రైతులు రేటు లేక చివరికి తమ పంటను తామే తగలబెట్టుకుంటుంటే, కూటమి ప్రభుత్వం నిద్రపోతోంది. రైతు కన్నీరు, కష్టాలను పట్టించుకునే తీరిక లేదు. ఉత్తరాంధ్రలోని చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికే 89,000 టన్నులు చెరకు క్రష్ చేసినా ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లింపులు చేయలేదు. పాత బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. రైతులకు కోట్లాధి రూపాయల బకాయిలు పడింది. చెరకు రైతుల పట్ల తక్షణం స్పందించాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. అలాగే టమాట, పొగాకు రైతులు కూడా రేటు లేక నష్టపోతున్నారు. వైయస్‌ఆర్‌సీపీ హయాంలో రూ.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. మార్కెట్ ఇంట్రవెన్షన్‌తో మద్దతు ధరకు కొనుగోళ్ళు చేశాం. ప్రకృతి వైఫరీత్యాల సమయంలో రైతులకు అండగా నిలబడ్డాం. ఇటువంటి ఏ ఒక్క చర్య కూడా కూటమి ప్రభుత్వం నుంచి కనిపిచడం లేదు.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ....
విశాఖపట్నం కార్పోరేషన్ లో మేయర్‌గా ఉన్న యాదవ సమాజికవర్గానికి చెందిన బీసీ మహిళను పదవి నుంచి తొలగించాని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. విశాఖనగరానికి ఒక బీసీ మహిళ ప్రాతినిధ్యం వహించడం వారికి బహుశా ఇష్టం లేకపోవచ్చు. కూటమి ప్రభుత్వంలో బలహీనవర్గాలకు చెందిన మహిళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో పైశాచిక ఆనందాన్ని పొందారు. ఒకరిని కించపరిచేలా వ్యవహరించడం అభ్యంతరకరం. రాజకీయాల్లో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. అన్ని సందర్భాలు ఒకేలా ఉండవని గుర్తించాలి. ఈ రకమైన సంస్కృతిని ప్రోత్సహించకూడదు. అక్కడే ఉన్న పెద్దలు వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి హుందాతనం అందరికీ తెలిసేది.