క్రైస్త‌వుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల మృతిపై నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌ర‌పాలి

వైయ‌స్ఆర్‌సీపీ క్రిస్టియ‌న్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ బొల్ల‌వ‌ర‌పు జాన్‌వెస్లీ

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ(ysrcp) క్రిస్టియ‌న్(Christian) సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ బొల్ల‌వ‌ర‌పు జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధ‌వారం రాజ‌మండ్రి ఆసుప‌త్రి వ‌ద్ద పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌గ‌డాల(Pastor Praveen Pagadala) భౌతిక‌కాయాన్ని ఆయ‌న ప‌రిశీలించారు. ఆయ‌న మ‌ర‌ణానికి కార‌కుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా జాన్‌వెస్లీ(John wesly) మీడియాతో మాట్లాడారు.`రెండు రోజులుగా రెండు రాష్ట్రాల క్రైస్తవులను(Christian Community) కుదిపేసిన పాస్టర్ పగడాల  ప్రవీణ్ హత్య మీద జ్యుడిషియల్ ఎంక్వైయిరీ వేయించి నిజా నిజాలను తేల్చాలని వైయస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవుల సమస్యల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్య భావం ఈ సంఘటనతో బయటపడింది. ఈ వ్యవహారంలో పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు దగ్గర నుంచి ప్రతి చర్య అనుమానాస్ప‌దంగానే ఉంది.  సంఘటన  స్థలం దగ్గర చూసిన పరిస్థితులకు పోస్టుమార్టం జరిపేటప్పుడు ఉన్న పరిస్థితులకు ఎంతో వ్యత్యాసం కనిపించింది. అడుగ‌డుగున పోలీసులు ఇది ఆక్సిడెంట్ అని చెప్పి కుటుంబ సభ్యులను, క్రైస్తవులను క్రైస్తవ సంఘాలను ఒప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. శవ పంచనామా జరిగినప్పుడు కూడా పారదర్శకత లోపించి శవ పంచనామాను క్రైస్తవ సంఘాల నాయకులకు చూపించడంలో సహాయ నిరాకరణ చేయడం చూస్తుంటే పోలీసులకు ఈ కేసులో ఉన్న శ్రద్ధ ఏంటో అర్థం అవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇలాంటి కేసులను ఛాలెంజింగ్‌ చేయవలసిన పోలీసులే అడుగడుగునా నీరు గార్చే ప్రయత్నం చేయడం చూస్తుంటే క్రైస్తవులందరూ ఎంతో నిరుత్సాహానికి గురవడం జరిగింది.  క్రైస్తవుల పట్ల వివక్షను ప్రభుత్వాలే అరికట్టవలసిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వమే క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉంటూ సనాతన భావాలను ప్రజల మీద రుద్దాలని చూస్తుంది. ఈ సమయంలో ప్రజలంతా, క్రైస్తవ సోదరులంతా సంఘటితంగా ఉండి పోస్టుమార్టం నివేదిక వచ్చేవరకు వేచి ఉండి తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరించాలి` అని జాన్‌వెస్లీ కోరారు. 

Back to Top