తాడేపల్లి: అసలు జరగని లిక్కర్ స్కాంపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, లోక్‌సభలో టీడీపీ ఎంపీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైయస్ఆర్‌సీపీపై ఆరోపణలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి స్పష్టం చేశారు. అసలు వైయస్ఆర్‌సీపీహయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్న ఆయన, తమ ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు పెంచారని, షాపుల సంఖ్య, మద్యం అమ్మకం వేళలు తగ్గించారని ఆయన వెల్లడించారు. నిజానికి రాష్ట్రంలో కొత్తగా 200 బ్రాండ్లను తీసుకొచ్చింది చంద్రబాబుగారి హయాంలోనే అని గుర్తు చేసిన ఆయన, వాస్తవాలను దాచి వైయస్ఆర్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. చంద్రబాబు స్కిల్ స్కాంపై పార్లమెంట్‌లో మాట్లాడే దమ్ముందా? అని సవాల్ చేశారు. టీడీపీ ఎంపీలకు ధైర్యం ఉంటే చంద్రబాబు అందుకున్న ఈడీ, ఐటీ నోటీసులు చర్చిద్దామని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఎం.గురుమూర్తి సవాల్ చేశారు. ఎంపీ గురుమూర్తి ఇంకా ఏం మాట్లాడారంటే..: బురద చల్లడమే వారి పని: పార్లమెంట్‌లో వైయస్ఆర్‌సీపీ మీద కేవలం బురద జల్లడానికే, చంద్రబాబుగారు తమఎంపీలను ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్దికి నిధులు తీసుకురావడంలో వారి ప్రమేయం శూన్యం. ఇదే విషయం ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి స్పష్టమైంది. లేని లిక్కర్ స్కాంను సృష్టించి రాష్ట్రంలో వైయస్ జగన్‌గారి పాలనలో వేల కోట్ల విలువైన లిక్కర్ స్కాం జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో నిన్న (సోమవారం) పార్లమెంట్‌లో మాట్లాడించారు. పది నెలల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇలాంటి పస లేని విమర్శలు చేస్తోంది. దమ్ముంటే ఆ ఎంపీలు వాటిపై మాట్లాడాలి: స్కిల్ స్కాంలో చంద్రబాబు రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈడీ, ఐటీలు «ధృవీకరించాయి. ఈ కేసుల్లో యోగేశ్ గుప్త, మనోజ్ వాసుదేవన్ ప్రధానపాత్ర పోషించారని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఆయా కేసుల్లో చంద్రబాబుకిచ్చిన సమన్ల మీద టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో మాట్లాడాలి. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా అవినీతి జరిగిందని విచారణలో తేలడంతో నోటీసులిచ్చి విచారణ చేయాలని భావిస్తే ఆయన్ను చంద్రబాబు దేశం దాటించాడు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీనివాస్‌పై సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ ఉద్యోగంలో చేర్చుకుని కమీషన్లు తీసుకునే కార్యక్రమాలు ప్రారంభించారు. దీంతోపాటు టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రేట్లు పెంచేసి చంద్రబాబు పీఏ శ్రీనివాస్ కంపెనీల నుంచి ముడుపులు అందుకున్నారని కేసు నడిచింది. మరి దానిపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేసింది. ఈ కేసుల్లో చంద్రబాబు పాత్ర గురించి పార్లమెంట్‌లో చర్చించే ధైర్యం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుకు ఉందా? లేని కేసుల గురించి కాకుండా ఆల్రెడీ ఉన్న కేసుల గురించి మాట్లాడితే బాగుండేది. టార్గెట్. హరాస్‌మెంట్: బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ, డిప్యూటీ సూపరింటెండెంట్, కొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరించి, కొట్టి, హింసింది వారితో 164 సెక్షన్ కింద స్టేట్‌మెంట్స్ రికార్డు చేస్తున్నారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తే వారు మాత్రం ఏం చేస్తారు. ఎవరి పేరు చెప్పమంటే వారి పేరు చెప్తారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ఇలాంటి తప్పుడు ఆధారాలు çసృష్టించే పనిలో కూటమి నాయకులు బిజీగా ఉన్నారు. సంబంధం లేకపోయినా..!: పాత గొడవలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ పీవీ మిధున్‌రెడ్డికి, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధం లేకపోయినా లిక్కర్ స్కాంను అంటగట్టాలని పథక రచన చేస్తున్నారు. అందుకు తమకు కావాల్సిన విధంగా సాక్ష్యాలు సృష్టించే పనిలో ఉన్నారు. ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి రెండేళ్ల తన పదవీ కాలం పూర్తయిన తర్వాత విజయవాడ వైపు వచ్చింది కూడా లేదు. అయినా ఆయన పేరును కూడా లిక్కర్ స్కాంకు జత చేస్తున్నారు. దానిపై అనేక అనుమానాలున్నాయి: కూటమి ప్రభుత్వం పదే పదే దుష్ప్రచారం చేçస్తున్నర లిక్కర్ స్కాంకి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు, మద్యం ఎక్కువ అమ్మితే లంచాలిస్తారా? తక్కువ అమ్మితే లంచాలిస్తారా? ఇబ్బడి ముబ్బడిగా షాపులు పెంచేసి పర్మిట్ రూమ్‌లు ఇస్తే లంచాలిస్తారా? వాటన్నింటినీ రద్దు చేసి ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తే లంచాలిస్తారా? గత ప్రభుత్వంలో మద్యం మీద ట్యాక్సులు తగ్గించాం. బేసిక్ రేట్లు పెంచితే లంచాలిస్తారా, తగ్గిస్తే ఇస్తారా? వీటన్నింటికీ కూటమి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పగలరా? మద్యం వినియోగాన్ని తగ్గించాం: వైయస్ఆర్‌సీపీ పాలనలో మద్యం దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించారు. 33 శాతం షాపులను తీసేశారు. షాపులలో అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూములను రద్దు చేశారు. లిక్కర్ షాపులకు అనుబంధంగా గతంలో ఉన్న 43వేల బెల్టుషాపులను ఎత్తివేశారు. మద్యం అమ్మే సమయాన్ని కూడా పరిమితం చేశారు. ప్రతి ఊరికీ ఒక మహిళా పోలీసును పెట్టి పర్యవేక్షించారు. ఎక్సైజ్‌కు సంబంధించి నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినతరం చేశారు. మద్యం వినియోగాన్ని తగ్గించాలని ధరలు షాక్ కొట్టేలా పెంచారు. అందుకు లంచాలు ఇస్తారా?: మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4–5 డిస్టలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? లేక అన్ని డిస్టలరీలకు దాదాపుగా సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే ఇస్తే లంచాలు ఇస్తారా? ఇప్పుడున్న డిస్టలరీలకు సింహభాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టలరీకి అనుమతి ఇవ్వని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? మద్యం విక్రయ వేళల్ని తగ్గిస్తే లంచాలు వస్తాయా? లేక వేళాపాలా లేకుండా అమ్మితే లంచాలు వస్తాయా? లిక్కర్ అమ్మే షాపులను పెంచితే లంచాలు ఇస్తారా? లేక షాపులను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అవన్నీ చంద్రబాబుగారి బ్రాండ్లే: వైయస్ఆర్‌సీపీ హయాంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి, కొత్త బ్రాండ్‌కు అనుమని ఇవ్వలేదు. మొత్తంగా ఈ చర్యల కారణంగా అప్పుడు మద్యం అమ్మకాలు, వినియోగం గణనీయంగా తగ్గాయి. దాదాపు 200కు పైగా బ్రాండ్లకు చంద్రబాబుగారి హయాంలోనే అనుమతి లభించింది. 2017 నవంబర్ 22న ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్లకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిచ్చింది. లెఫైర్, నెపోలియన్, గవర్నర్ రిజర్వు, సెవెన్త్ హెవెన్ బ్లూ ఇలాంటి 15 బ్రాండ్లకు 2018 అక్టోబర్‌లో అనుమతులిచ్చారు. హై ఓల్టేజ్, ఓల్టేజ్ గోల్డ్, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియర్, బ్రిటీష్ ఎంపైర్ ఆల్ట్రా ఇలాంటి బ్రాండ్లకు 2017 జూన్7న అనుమతులిచ్చారు. బీరా 91 పేరుతో మూడు రకాల బీర్లకు 2019మే 14న చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిచ్చింది. టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 మే 15న అనుమతినిచ్చారు. పవర్ స్టార్, లెజెండ్ లాంటి బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది కూడా చంద్రబాబే. దురుద్దేశంతో దుష్ప్రచారం: ఇప్పుడు లిక్కర్ స్కాంల పేరిట కట్టు కథలు చెప్పించడానికి చంద్రబాబుగారు కొందరు వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. కొందరు మాజీ ఎంపీలను, కొంతమంది ప్రస్తుత ఎంపీలను, కొంతమంది ప్రతికాధిపతులను.. తన చేతుల్లో పెట్టుకుని లేని మద్యం కుంభకోణంలో ఏదో జరిగిపోయినట్టు సత్యదూరమైన ఆరోపణల చేసి ప్రజల మనస్సలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తప్పుడు వార్తలను ప్రసారం చేసే విషయంలో పత్రికాధిపతులు కూడా సమీక్ష చేసుకోవాలి. తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించడం తప్పు. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మాయమాటలు చెబుతున్న చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన కపట నాటకాలు ఆడుతున్నారని ఎంపీ ఎం.గురుమూర్తి ఆక్షేపించారు.