చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు

లిక్కర్‌ స్కాం అంటూ లోక్‌సభలో కట్టుకథలు

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం

తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)

లేని లిక్కర్‌ స్కాం పేరుతో ప్రజల దృష్టి మళ్ళించే యత్నం

అధికారులను బెదిరించి తప్పుడు స్టేట్‌మెంట్లు

తప్పుడు కేసులను బనాయించేందుకు కుట్ర

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపాటు

తాడేపల్లి: హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం తన అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు లేని లిక్కర్‌స్కామ్‌ను తెరమీదికి తీసుకువచ్చిందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు డైరెక్షన్‌లో తాజాగా లోక్‌సభలో ఆ పార్టీ పార్లమెంటరీ నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు పచ్చి అబద్దాలను అందంగా వల్లించాడని మండిపడ్డారు. నిన్నటి వరకు వైయస్‌ఆర్‌సీపీలో ఎంపీగా ఉన్న ఆయనకు రాష్ట్రంలో లిక్కర్‌ పాలసీలో ఒకవేళ అవినీతి జరుగుతుంటే ఆ విషయం తెలియలేదా? ఈ రోజు టీడీపీలో చేరి పార్లమెంటరీ నేతగా మారిన తరువాతే లిక్కర్‌స్కాం గురించి తెలిసిందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు లోక్‌సభలో మాట్లాడుతూ ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ, దానిలో పలువురి పేర్లను ఉటంకిస్తూ అర్థంలేని ఊహాజనితమైన ప్రసంగం చేశారు. లేని ఈ స్కామ్‌లో వేలకోట్ల రూపాయలు దేశాలు దాటి వెళ్ళిపోయారంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. చంద్రబాబు గూటిలో చేరిన ఫ్లెమింగో పక్షిలాంటి శ్రీకృష్ణదేవరాయులు చంద్రబాబు డైరెక్షన్‌లోనే లోక్‌సభలో మాట్లాడారు. చంద్రబాబు మెప్పుకోసం ఈ రకంగా విషం చిమ్మే కార్యక్రమం చేపట్టారు. వైయస్ జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి నిరాధార నిందలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగానే లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. 

రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడు నోరు మెదపలేదు 

లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడు నోరు మెదపలేదు. రాష్ట్రంలోని విశాఖ ఉక్కును బతికించేందుకు, పోలవరం ప్రాజెక్ట్‌కు భూసేకరణ నిర్వాసితులకు చెల్లించాల్సిన మొత్తం నిధులను విడుదల చేయాలని, సాగు, తాగునీటి కోసం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై కేఆర్‌ఎంబీ స్టేను ఎత్తివేసేందుకు ఆయన గళం విప్పరు. జనాభా నియంత్రణను దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు చిత్తశుద్దితో ఆచరించడం వల్ల నేడు జనాభా తక్కువగా ఉందని నియోజకవర్గాల డీలిమిటేషన్‌ లో సీట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి వేస్తున్న వైనంను ఆయన నిలదీయరు. ఉత్తర భారతదేశంలోని రెండుమూడు రాష్ట్రాల ఓట్లతోనే దేశంలో మెజారిటీని సాధించాలనుకునే పార్టీల కుట్రను ఆయన ప్రశ్నించరు. పల్నాడులోని వెనకబాటుతనం, నీటిఎద్దడి గురించి మాట్లాడరు. కానీ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం లోక్‌సభలో లిక్కర్‌ స్కాం అంటూ కట్టుకథలను అద్భుతంగా వల్లెవేశారు. 

లిక్కర్ పాలసీలపై విచారణకు సిద్దమా?

2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ పాలసీ, గత వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలోని లిక్కర్‌ పాలసీ, తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఈ పదినెలల్లో లిక్కర్ కార్యకలాపాలపై విచారణకు సిద్దం. తెలుగుదేశం హయాంలోనూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ డిస్టలరీలకు ఎక్కువ మొత్తాలను పెంచి చెల్లిస్తున్నారు. ఈ పెంచిన మొత్తాలను తిరిగి మామూళ్లుగా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు మొత్తం కూటమి నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. వేలంలో దక్కించుకున్న మద్యం దుకాణాలను కూడా బెదిరించి, భయపెట్టి తెలుగుదేశం ఎమ్మెల్యేలు గుంజుకున్నారు. చివరికి గీత కార్మిక సొసైటీలకు ఇచ్చిన దుకాణాలను కూడా లాక్కున్న దుర్మార్గపు పాలన ఈ రాష్ట్రంలో నడుస్తోంది. కిందిస్థాయిలోని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి, ఆయన కుమారుడి వరకు మద్యం ముడుపులు అందుకుంటూనే ఉన్నారనేది వాస్తవం. ఇవ్వన్నీ టీడీపీ పార్లమెంటరీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలకు తెలియవా? 

చంద్రబాబు ఆదాయపన్ను నోటీసులపై మాట్లాడండి

2014-19లో రాజధాని నిర్మాణానికి వచ్చిన కంపెనీల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్న చంద్రబాబు అవినీతిపైనా, ఆయనకు ఆదాయపన్నుశాఖ ఇచ్చిన నోటీసులపైన శ్రీకృష్ణదేవరాయలు స్పందించాలి. ఈ ఆదాయపన్ను నోటీసుల తదుపరి చర్యలను అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారు?  2014-19 మధ్య రాజధాని నిర్మాణం కోసం పనిచేసిన నాలుగైదు కంపెనీల అనామత్తు ఖాతాల నుంచి చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ద్వారా దాదాపు రూ.2000 కోట్లు మీ ఖాతాలకు జమ అయ్యిందని ఈడీ గుర్తించింది. దానిపైన విచారణ ఎందుకు నిలిచిపోయిందో ప్రశ్నించాలి. 

స్కీల్‌ స్కాం నిందితుడిని కాపాడలేదా?   

చంద్రబాబు పీఏ శ్రీనివాస్ స్కిల్ స్కామ్ ప్రారంభం కాగానే అమెరికాకు పారిపోయారు. ఆయన అమెరికాకు వెళ్లేందుకు ఎవరు టిక్కెట్లు కొనుగోలు చేశారు? వైయస్ జగన్ గారి పాలనలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఎందుకు అదృశ్యమయ్యారు? మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఎలా ప్రత్యక్షమయ్యారు? ఇప్పుడు ఆయన పదేపదే దుబాయ్‌కు మూటలు మోసేందుకు చేస్తున్న ప్రయత్నం, ఆ మూటల లెక్కలు చూసుకుందుకు ఎవరు వెంటవెంటనే దుబాయ్‌కు వెడుతున్నారో ప్రజలకు తెలుసు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై సస్సెన్షన్‌ను ఎత్తివేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. ఆయనకు డబ్బు మూటలను దుబాయ్‌కు తీసుకెళ్ళడానికే బాధ్యతలు అప్పగించారు. దాదాపు రూ.371 కోట్ల మేర స్కిల్ స్కామ్‌లో అవినీతి జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. దీనిపై ఈడీ విచారణ మధ్యలోనే ఎందుకు నిలిచిపోయింది. ఎవరెవరైతే కాంట్రాక్ట్‌లు పొందారో వారి వరకే ఈ విచారణను ఈడీ ఎందుకు పరిమితం చేసిందో శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించాలి. 

అధికారులను బెదిరించి స్టేట్‌మెంట్లు

ఎక్సైజ్‌ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి మూడుసార్లు కోర్ట్‌లో పోలీసులు తనను వేధిస్తున్నారంటూ పిటీషన్లు దాఖలు చేశారు. జడ్జ్‌ ముందు తప్పుడు వాగ్మూలం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారంటూ హైకోర్ట్‌ లో పిటీషన్ దాఖలు చేశారు. ఆయనను బెదిరించి 164 స్టేట్‌మెంట్లు తీసుకుని లిక్కర్‌ పాలసీలో స్కామ్‌ జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టి, వైయస్‌ఆర్‌సీపీ నేతలను ఈ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌ అంటూ లోక్‌సభను వాడుకోవడం అంటే దిగజారిన రాజకీయాలు చేయడమే. ఇటువంటి అపహాస్యపు మాటలకు విలువ లేదు. కుట్రలతో వైయస్ జగన్‌ గారిపై విషం చిమ్మాలని, తప్పుడు కేసులు బనాయించాలనే కుట్రలకు భయపడేది లేదు.

Back to Top