వైయ‌స్ జగన్‌ సంపద సృష్టిస్తే.. కూటమి నేతలు దోచుకుంటున్నారు

ప్రజల ఆస్తులు అమ్మడంలో చంద్రబాబు దిట్ట

మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య స్పష్టీకరణ

చంద్రబాబు సంపద సృష్టించడం దేవుడెరుగు

సృష్టించిన సంపదను కూడా తెగనమ్ముతున్నారు

ప్రభుత్వ ఆస్తులను దొడ్డిదారిన తనవారికి కట్టబెడుతున్నారు

మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపణ

ప్రైవేటీకరణ పేరుతో పోర్టులు, మెడికల్‌ కాలేజీల అప్పగింత

సంపద సృష్టిస్తానని చెప్పి అడ్డగోలుగా దోచుకు తింటున్నారు

చంద్రబాబు అసమర్థత కారణంగానే డిస్కంలకు భారీ నష్టం

విద్యుత్‌ ఛార్జీలు రూపాయి పెంచినా ఊరుకునేది లేదు 

ధరలు పెరిగినా, ఇసుక దోచుకున్నా మీడియా నోరెత్తడం లేదు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే సంపద సృష్టిస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన చంద్రబాబు వరుస పెట్టి ప్రజల ఆస్తులు అమ్మేయడమే కాకుండా, నాలుగు నెలల్లోనే రూ.47 వేల కోట్లు అప్పు చేశారని వైయ‌స్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆక్షేపించారు. సంపద సష్టిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడమే కాకుండా, ప్రజల ఆస్తులను దొడ్డిదారిన తన అనుచరుల జేబుల్లోకి మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.

పోర్టుల ప్రైవేటీకరణ తప్పుడు నిర్ణయం:
    వైయ‌స్ జగన్ హయాంలో నిధులకు ఇబ్బంది లేకుండా పోర్టుల నిర్మాణాలు మొదలుపెడితే, చంద్రబాబు ఆ పనులు పూర్తి చేయకుండా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులను నాలుగు నెలలుగా అటకెక్కించి, ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారని మాజీ మంత్రి దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు రూ.3,736 కోట్ల వ్యయంతో శరవేగంగా నిర్మాణం జరుపుకున్నా, ఎన్నికల కోడ్‌ వల్ల  ప్రారంభానికి నోచుకోలేదని చెప్పారు. విభజన చట్టంలో ఆ పోర్టును పూర్తి చేయాలని ఉన్నా 2014–19 మధ్య ఇదే బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేశారు.
    మచిలీపట్నం పోర్టును ఆరు నెలల్లో పూర్తి చేసి షిప్‌ తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పని చేయకపోగా, నాలుగు నెలల్లోనే దాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని ఆక్షేపించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.5156 కోట్ల వ్యయ అంచనాతో ఆ పోర్టు పనులు మొదలుపెట్టి, 50 శాతం పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
    ఇక శ్రీకాకుళం జిల్లాకు మణిహారం వంటి మూలపేట పోర్టు పనులు కూడా రూ.4360 కోట్ల వ్యయ అంచనాతో మొదలుపెడితే, చంద్రబాబు ప్రభుత్వం ఆ పనులు కూడా అటకెక్కించిందని పేర్ని నాని చెప్పారు. జగన్‌గారు సృష్టించిన వాటి సంపద పంచుకునేందుకు డెవలప్‌మెంట్‌–ఆపరేషన్‌–మెయింటెనన్స్‌ (డీఓఎం) పేరిట అమ్మకానికి పెట్టారని ఆయన ఆగ్రహించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా చంద్రబాబు 56 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఆ వర్గం మీడియా ఇప్పుడేమైంది?:
    ప్రజల సంపదను చంద్రబాబు దొడ్డిదారిన తన వందిమాగధులకు దోచిపెడుతున్నాడని పేర్ని నాని ఆరోపించారు. పేదలకు మెడికల్‌ విద్యను అందించాలని తపించిన జగన్‌గారు, ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, గత విద్యా సంవత్సరం నాటికి 5 కాలేజీలు పూర్తి చేసి, అడ్మిషన్లు కూడా సాధించారని తెలిపారు. ఈ ఏడాది కూడా మరో 5 కాలేజీల నిర్మాణం పూరై్త, అడ్మిషన్లు జరగాల్సి ఉండగా, చంద్రబాబు వైఖరి వల్ల అవి ప్రారంభం కాలేదని చెప్పారు. పూరై్తన వాటితో పాటు, నిర్మాణంలో ఉన్న మొత్తం కొత్త మెడికల్‌ కాలేజీలను ఇప్పుడు ప్రైవేటుపరం చేస్తున్నారని దుయ్యబట్టారు.
    సంపద సృష్టిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. విశాఖలో ప్రభుత్వ భూములు అమ్ముతున్నా ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి మీడియా సంస్థలు ఎందుకు రాయడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. నాడు వైయస్సార్‌సీపీ హయాంలో బాదుడే బాదుడు అంటూ రోజూ నానా హంగామా చేసిన, ఆ వర్గం మీడియా ఇప్పుడు కూటమి పాలనలో నిత్యావసరాల ధరలు దారుణంగా మండుతున్నా నోరెత్తడం లేదని ఆక్షేపించారు. 
    అయిదేళ్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల మందు హామీ ఇచ్చిన చంద్రబాబు, నాలుగునెలల్లోనే దాన్ని మర్చి విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ వినియోగదార్లపై ఏకంగా రూ.6,073 కోట్ల భారం వేస్తున్నా, ఆ వర్గం మీడియా స్పందించడం లేదని గుర్తు చేశారు. కనీసం నైతిక బాధ్యతగా.. 4 నెలలకే మాట తప్పడం ఏంటని చంద్రబాబును మోస్తున్న ఆ మీడియా ప్రశ్నించాలని సూచించారు. 

బాబు అసమర్థత వల్లే విద్యుత్‌ సంస్థల నష్టాలు:
    చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే 2014–15 నాటికి రెండు డిస్కంల నష్టాలు రూ.6,625.88 కోట్లు కాగా, 2019 నాటికి అవి రూ.28,715 కోట్లకు చేరాయని, ఐదేళ్లలో చంద్రబాబు అసమర్థత వల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థల నష్టాలు 34 శాతం (రూ.22,088.12 కోట్లు) పెరిగాయని పేర్ని నాని వెల్లడించారు.
    అదే విధంగా 2014–15 నాటికి విద్యుత్‌ శాఖ అప్పులు రూ.29,552 కోట్లు కాగా, 2019, మార్చి 31 నాటికి ఆ మొత్తం రూ.86,215 కోట్లకు చేరిందని తెలిపారు. అంటే ఐదేళ్లలో అప్పులు 23.88 శాతం (రూ.56,664 కోట్లు) పెరిగాయని చెప్పారు. అలా చంద్రబాబు అసమర్థత వల్ల విద్యుత్‌ రంగ అప్పులు దాదాపు రూ.80 వేల కోట్లు పెరిగాయని వివరించారు.

చంద్రబాబు–కుట్ర రాజకీయం:
    చంద్రబాబుది ఎప్పుడూ కుట్ర రాజకీయమే అన్న పేర్ని నాని, నాడు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పదవి లాక్కుంది మొదలు.. ఇప్పటి వరకు అదే సాగుతోందని చెప్పారు. ఇప్పుడు కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ, ఆ భారం మోపాలని సుప్రీంకోర్టు నిర్దేశించిందని అసత్య ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. ఒకవేళ నిజంగా సుప్రీంకోర్టు అలా నిర్దేశించి ఉంటే, అదే విషయాన్ని ఆధారాలతో తన అనుకూల మీడియలో ప్రచురించాలని సవాల్‌ చేశారు. చంద్రబాబు పాపాలను పోరాటాలతో ప్రజల్లో ఎండగడతామని స్పష్టం చేశారు.
    తమ ప్రభుత్వ హయాంలో పచ్చ చొక్కా తొడుక్కుని తోపుడు బండ్ల మీద ఇసుక అమ్మిన నిమ్మల రామానాయుడు, ఇప్పుడు ఇసుక అందుబాటులో లేకున్నా స్పందించడం లేదని మాజీ మంత్రి ఆక్షేపించారు. గతంలో కంటే రెండు మూడు రెట్లు ఇచ్చినా ఇప్పుడు ఇసుక దొరకడం లేదని తెలిపారు.
    రేషన్‌ బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతోందంటూ కాకినాడలో హడావుడి చేసిన నాయకులు ఒక్కసారే తనిఖీలు చేసి ఎందుకు ఆపారని పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపు, 3 పోర్టులు, కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ముందు నీ సంగతి చూసుకో:
    వైయ‌స్ఆర్  కుటుంబంలో నెలకొన్న ఆస్తుల వివాదానికి వైఎస్‌ విజయమ్మే తీర్పు చెప్పి ముగింపు పలకాలన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలపై పేర్ని నాని స్పందించారు. ‘ఎవరి రాజకీయాలను వారు వెతుక్కుంటారంటూ’.. ఆయన చురకలంటించారు. ఉచిత సలహాలు ఇవ్వడం మాని, ఒంగోలులో తనపై కూటమి నాయకులు చేస్తున్న అర్చనలు, అష్టోత్తరాలు చక్కబెట్టుకోవాలని బాలినేనికి, పేర్ని నాని హితవు చెప్పారు.

Back to Top