పేదవాడు మళ్లీ అప్పులపాలయ్యే దుస్థితి తేవద్దు

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టే కుట్ర

సంపద సృష్టిస్తానన్న నోటితోనే ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనడం సరికాదు

రైతు భరోసా, అమ్మ ఒడి, మత్స్యకార భరోసా, చేయూత నిధులపై స్పష్టత ఇవ్వాలి

ఆర్బీకేలను ధ్వంసం చేశారు కానీ రైతులకు జరిగిన మేలును చెరపలేరు

ప్రభుత్వ బడుల్లో చదివే వారికే తల్లికి వందనం అంటూ లీకులిస్తున్నారు

వైయ‌స్ జగన్ హయాంలో ఏ పథకం ఎప్పుడిస్తామో క్యాలెండర్ ఇచ్చాం

సూపర్ సిక్స్ పథకాల అమలుపైనా క్యాలెండర్ ఇవ్వాలి

శ్రీకాకుళం:  విద్య, వైద్యం కోసం పేదవాడు మళ్లీ అప్పులపాలయ్యే దుస్థితి తీసుకురావద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాల పేరుతో సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొడతారనే ఆందోళన ప్రజల్లో కలుగుతోందన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని వ్యాఖ్యానించి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని మాట్లాడటం సబబు కాదన్నారు. శ్రీకాకుళంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. 

రైతన్నకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి
జూన్, జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతాయని, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో.. మే, అక్టోబర్, జనవరి మాసాల్లో రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేవారని సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. పెట్టుబడి కోసం రైతులు ఎవరి నుంచీ సాయం ఆశించకుండా నేరుగా ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించేలా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆలస్యం కాకుండా ఆదుకుందన్నారు. 53.50 లక్షల మంది రైతులకు రూ.34,500 కోట్లు వైయస్సార్ రైతు భరోసా కింద సాయం చేశామన్నారు. అదే చంద్రబాబు గారు ప్రతి రైతుకూ రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. పేరు మార్చి, పెంచి ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. 

అన్నదాత సుఖీభవపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో మే నెలలోనే విత్తనాలు పంపిణీ చేసేవారమన్నారు. కానీ గత రెండు వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారని, వైయస్సార్ బొమ్మను తీసేసే ప్రయత్నం చేశారన్నారు. శిలాఫలకాలు ధ్వంసం చేశారన్నారు. అదే ఆర్బీకేల వద్ద విత్తనాలు పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తన పంపిణీజరుగుతోందని, కానీ విత్తనాలు ఇక్కడికి ఎప్పుడు వచ్చాయని ఎవరైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు సంక్షేమం కోసం ఎంతలా పని చేస్తున్నాయో గమనించాలన్నారు. ఆర్బీకేలను ధ్వంసం చేయగలరు కానీ, వాటి ద్వారా రైతులకు అందిన మేలును చెరిపి వేయలేరన్నారు. రైతు భరోసా కేంద్రాల ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల కండువాలు వేసుకుని విత్తనాలు పంచుతుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తున్నాయన్నారు. విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్లకు ఓట్లేసిన వారికే విత్తనాలు ఇస్తారా? మిగతావారికి ఇవ్వరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు
జూన్ రెండో వారం తర్వాత స్కూళ్లు మొదలయ్యాయని, ప్రభుత్వ బడుల్లో 34 లక్షల మంది, ప్రయివేటు బడుల్లో 50 లక్షల మంది ఉన్నారని అప్పలరాజు తెలిపారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో నాలుగైదు లక్షలమంది ప్రయివేటు నుంచి ప్రభుత్వ బడుల్లోకి చేరారన్నారు. మొదట జనవరిలో అమ్మ ఒడి రూ.15 వేలు ఇచ్చేవాళ్లమని, ఆ తర్వాత పేరెంట్స్ కు ఉపయోగపడేలా బడులు ప్రారంభమయ్యే జూన్ లోనే అమ్మ ఒడి డబ్బులు ఇచ్చామన్నారు. ఎవరి దగ్గరా చేయి చాచకుండా ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ ఖాతాల్లో డబ్బులువేస్తుంటే వారికి నచ్చిన బడుల్లో చదివించుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. చంద్రబాబు గారు రూ.15 వేలు ఎంత మంది ఉంటే అంత మందికీ ఇస్తామన్నారని గుర్తు చేశారు. 

ప్రభుత్వ బడుల్లో చదివే వారికే తల్లికి వందనం సొమ్ము ఇవ్వాలనే కొన్ని లీకులు ఇస్తున్నారన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు ఏర్పడ్డాయన్నారు. చేబదులు, వడ్డీకి డబ్బులు తీసుకునే పాత రోజుల్లోకి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ పరిస్థితి కల్పించవద్దని సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్ ను కోరారు. ఆరోగ్యానికి, పిల్లల చదువులకు అప్పులపాలయ్యే పరిస్థితి నుంచి తల్లిదండ్రులను జగన్ గారి ప్రభుత్వం బయటకు తీసుకొచ్చిందన్నారు. అమ్మ ఒడి కింద తమ ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులకు ప్రతి సంవత్సరం యావరేజ్ గా రూ.6,500 కోట్ల చొప్పున రూ.26,000 కోట్లు డిపాజిట్ చేశామన్నారు. దీనిపై నారా లోకేష్ తక్షణమే సీఎంతో మాట్లాడి తల్లిదండ్రులందరికీ స్పష్టత ఇవ్వాలన్నారు. తమ ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రీయింబర్స్ మెంట్ కింద జగనన్న విద్యాదీవెన, హాస్టళ్లలో చదువుకునే వారికి వసతి దీవెన అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఏప్రిల్, మే నెలల్లో విద్యాదీవెన డబ్బులు వేయాల్సి ఉందని, ఎన్నికల ముంగిట డబ్బులు వేయరాదంటూ మీరే కోర్టుకు వెళ్లి ఆపారంటూ గుర్తు చేశారు. ఏప్రిల్ నెలలో జమ కావాల్సిన డబ్బులు విద్యార్థుల ఖాతాల్లో జమ కాక కాలేజీల్లో తర్వాతి సంవత్సరం అడ్మిషన్ల విషయంలో ఇబ్బంది పెడుతున్నారన్నారు. తమ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద 30 లక్షల మంది విద్యార్థులకు రూ.12,600 కోట్లు అందించామన్నారు. వసతి దీవెన కింద 25.20 లక్షల మందికి రూ.4,300 కోట్లు ఇచ్చామన్నారు. విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము ఎన్నికల కోడ్ కారణంగా జమ చేయడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇప్పుడైనా వేయాలి కదా? అని ప్రశ్నించారు. 

చేయూత సొమ్ముపై పవన్ చొరవ తీసుకోవాలి
మహిళలకు సంబంధించి వైయస్సార్ చేయూత సొమ్ము తమ ప్రభుత్వంలో సుమారు రూ.5,065 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.2,900 కోట్లు మహిళల ఖాతాల్లోకి వెళ్లాయన్నారు. ఇంకా రూ.2,200 కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ విభాగాలను పవన్ కల్యాణ్ చూస్తున్నారని, సెర్ప్ ను విడిగా వేరే మంత్రికి ఇచ్చారన్నారు. మరి చేయూత పెండింగ్ నిధుల వ్యవహారంపై ఎవరు దృష్టి పెడతారని అప్పలరాజు ప్రశ్నించారు. 45-60 సంవత్సరాల మహిళలకు జమ కావాల్సిన రూ.2,200 కోట్లను వెంటనే వారి ఖాతాల్లో జమ చేసేలా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని కోరారు. 

మత్స్యకారుల ఎదురు చూపులు
మత్స్యకార భరోసాకు సంబంధించి ఏప్రిల్ 2వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు చేపలవేట నిషేధం అమల్లో ఉంటుందని అప్పలరాజు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారు మే నెలలోనే మత్స్యకార భరోసా అందించేవారని గుర్తు చేశారు. రూ.10 వేల చొప్పున ప్రతి మత్స్యకారుడి కుటుంబానికీ తోడుగా నిలిచామన్నారు. కానీ, మత్స్యకారులకు ఎన్నికల కోడ్ కారణంగా సొమ్ము జమ కాలేదన్నారు. దీనిపై కూడా ఓ ప్రకటన చేయాలన్నారు. 

సంక్షేమ క్యాలెండర్ ఇచ్చిన చరిత్ర జగన్ గారిది
గత ఐదేళ్ల కాలంలో ఏ పథకం ఎప్పుడు వస్తుందో ప్రజలందరికీ తెలిసేదని, మార్చి, ఏప్రిల్ లోనే క్యాలెండర్ విడుదల చేసేవాళ్లమని గుర్తు చేశారు. సూపర్ సిక్స్, సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు కూడా క్యాలెండర్ విడుదల చేయాలని సూచించారు. ఇలా చేస్తే ప్రజలు సంతోషంగా ప్రభుత్వం నుంచి వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాల్ని హక్కుగా తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు. మీరు ఇచ్చిన హామీల్లో ఒక్క పెన్షన్ తప్ప మిగతా హామీల గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. 

శ్వేతపత్రాల పేరుతో సూపర్ సిక్స్ ఎగ్గొట్టే కుట్ర చేయొద్దు
సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి పెను భారంగా మారాయంటూ చర్చ జరగాలని తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అప్పులు చేసిందని మరోపక్క మాట్లాడుతున్నారన్నారు. మొన్న కేబినెట్ లో కూడా ఆయా డిపార్ట్ మెంట్లకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడు అప్పులు అయిపోతాయని, రాష్ట్రం శ్రీలంక, వెనుజులా అయిపోతుందని, ప్రజలందరూ సోమరిపోతులు అయిపోతారన్న మీరే కానీ ఇంతకు మించిన సంక్షేమ పథకాలను సూపర్ సిక్స్ రూపంలో హామీలిచ్చారన్నారు.

 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500, ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, బస్సులో ప్రయాణం ఫ్రీ, రైతులకు రూ.20 వేలు, పెంచిన పెన్షన్ అని హామీలిచ్చారని గుర్తు చేశారు. ఆర్థిక భారం మోపేలా హామీలిచ్చారన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సంవత్సరానికి సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల కోట్లు అవసరం అయితే చంద్రబాబు గారి పథకాలు అమలుచేయడానికి సంవత్సరానికి రూ.1.50 లక్షలకోట్లు అవసరం అవుతాయన్నారు. మరి ఇన్ని డబ్బులు ఎలా తెస్తారంటే తాను అనుభవజ్ఞుడినని, సంపద సృష్టిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు అధికారంలోకి రాగానే విపరీతంగా అప్పులు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఈ మాటలు చూస్తే సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో ప్రజల తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు. 

ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం..
పలాస నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక్క సెంటు లేదా అంగుళం అయినా తాను భూమి ఆక్రమించుకున్నానని నిరూపించాలని అప్పలరాజు సవాల్ విసిరారు. 2017లో తాను రాజకీయాల్లోకి వచ్చానని, 2019 వరకు తనపై 5 ఎఫ్ఐఆర్ లు నమోదు చేయించారన్నారు. కానీ తాను 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పటికీ పలాసలో ప్రతిపక్ష నేతలపై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 15 రోజులు గడవక ముందే మరో ఎఫ్ఐఆర్ తనపై నమోదు చేశారన్నారు. రానున్న ఐదేళ్లలో తనపై ఇంకా ఎన్ని ఎఫ్ఐఆర్ లు వేస్తారో అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన కంటే కక్షలు, కార్పణ్యాలపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ఎన్ని రకాల కేసులు పెట్టినా తాను సిద్ధంగా ఉన్నానని, 2029 ఎన్నికలే లక్ష్యంగా పని మొదలు పెడతామన్నారు. 

Back to Top