రామగిరి ఎస్సై సుధాకర్‌ దౌర్జన్యాలకు అంతే లేదు

ఖాకీ చొక్కా తొడిగిన టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నాడు  

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్‌

పరిటాల సునీత అండతో చట్టాలను లెక్క చేయడం లేదు

ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి తాపత్రయపడ్డాడు

ఎస్పీ ఆదేశాలను బేఖాతరు చేసి పరిధి దాటి ప్రవర్తించాడు

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం

ఎస్సై సుధాకర్‌ వైఫల్యం వల్లనే కురుబ లింగమయ్య హత్య

ఆయన వైఫల్యాలను నిర్ధారించే 11 అంశాలను గుర్తించాం 

కేసును నీరుగార్చేందుకు లింగమయ్య భార్యతో వేలిముద్ర

విద్యావంతుడైన లింగమయ్య కొడుకు వాంగ్మూలం తీసుకోలేదు

నిందితులనే సాక్షులుగా చేర్చి కేసును నీరుగార్చే యత్నం 

ఎస్‌ఐ సుధాకర్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించాలి 

అనంతపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి 

అనంతపురం: రామగిరి ఎస్సై సుధాకర్‌ దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోందని, ఆయన ఖాకీ చొక్కా తొడిగిన టీడీపీ కార్యకర్తలా పని చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. పరిటాల సునీత అండతో చట్టాలను లెక్క చేయని ఎస్‌ఐ, ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి తాపత్రయపడ్డాడని, ఎస్పీ ఆదేశాలను బేఖాతరు చేసి పరిధి దాటి మరీ ప్రవర్తించాడని అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు.

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి  ఏం మాట్లాడారంటే..:

రామగిరి ఎస్‌ఐ వైఫల్యం:
    రామగిరి మండలంలోని శాంతిభద్రతలను పరిటాల సునీత కుటుంబానికి తాకట్టు పెట్టిన ఎస్సై సుధాకర్‌కు మాజీ సీఎం వైయస్‌ జగన్‌ ను విమర్శించే స్థాయి ఎక్కడిది? అతని వైఫల్యం వల్లనే లింగమయ్య హత్య జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎస్సై సుధాకర్‌ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఎస్సై సుధాకర్‌ వైఫల్యం కారణంగా అనంతపురం జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్‌∙విస్తరించబోతోందని గత పదిహేను రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఖాకీ చొక్కాను పరిటాల సునీత కుటుంబానికి తాకట్టు పెట్టి, ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం సుధాకర్‌ తన కులాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు.

వివాదాస్పదంగా ఎస్సై వ్యవహార శైలి:
    రామగిరి మండలంలో ఎస్సై సుధాకర్‌ వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులను నేలపై కూర్చోబెట్టడం, దళితులను కించపరుస్తూ స్టేషన్‌ చుట్టూ తిప్పుకోవడం ఆయన చేయడం తప్పు కాదా? కొందరు అగ్రవర్ణాల దాడిలో తలారి రాజు అనే వ్యక్తి చనిపోతే నిద్రలో గుండెపోటుతో చనిపోయాడని ఎస్సై సుధాకర్‌ మేనేజ్‌ చేసి రాజు భార్యతో సంతకం తీసుకున్నాడు. హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించాడు. ఖాకీ చొక్కాకు ఉన్న పవిత్రతను, బాధ్యతలను పక్కనపెట్టి టీడీపీ నేతల దౌర్జన్యాలకు, ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్లకి వంతపాడి లింగమయ్యకు ఎస్సై సుధాకర్‌ కారకుడయ్యాడు.
    వైయ‌స్ఆర్‌సీపీ విప్, మాజీ పీపీ కురుబ నాగిరెడ్డి మీద దాడి జరిగినప్పుడు ఆయన వాహనంలో కొడవలిని చేర్చి ఆయన మీద అక్రమంగా ఎస్సీ యాక్ట్‌–307. ఆయుధాల చట్టం బనాయించింది సుధాకర్‌ కాదా? దాడికి గురైన వారిపైనే పరిటాల సునీతతో కలిసి కేసులు బనాయించిన నీచ వ్యక్తిత్వం ఆయనది.
    పోలీసుల వైఫల్యం, వారు నిబంధనలు ఉల్లంఘించడం వల్లనే లింగమయ్య హత్య జరిగింది. ఆ హత్య ఘటనకు సంబంధించి ఇప్పటికే 11 అంశాలను గుర్తించాం. చట్టాలను ఉల్లంఘించిన సుధాకర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలి. 

చట్టం పరిటాల వారికి చుట్టం:
    వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీటీసీలను పెనుగొండ ఎమ్మార్వో కార్యాలయానికి తరలించాలని ఎస్పీ ఆదేశిస్తే ఎస్సై సుధాకర్‌ తన పరిధి కాకపోయినా రామగిరి దాటి ఆ పోలీస్‌ జీపుల్లో ఎక్కి భారతి అనే ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత, శ్రీరామ్‌తో వీడియో కాల్‌ మాట్లాడించింది వాస్తవం కాదా? యాదవ కులానికి చెందిన ఆదిలక్ష్మిని మేము ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయిస్తే, ఆమెతో పాటు మరో యాదవ కులానికి చెందిన ఎంపీటీసీ కొండయ్య ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేయడం వాస్తవం కాదా?  ఇవన్నీ పోలీసులు విధుల్లో భాగంగా చేయాల్సిన పనులేనా?.
    ఎస్‌ఐ సుధాకర్‌ సరిగా విధులు నిర్వహించి ఉంటే లింగమయ్య హత్య జరిగేదే కాదు. ప్రజలకు రక్షణ కల్పిస్తావని, చట్టాలను పరిరక్షిస్తావని ఖాకీ చొక్కా ఇస్తే వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రామగిరి మండలాన్ని టీడీపీకి ధారాదత్తం చేయమని నీకు శిక్షణలో నేర్పించారా?  

ఇవన్నీ వాస్తవాలు కాదా?:
    కురుబ లింగమయ్య హత్య కేసు నిందితులు మార్చి 27 రాత్రి పాపిరెడ్డిపల్లెలో జయచంద్రారెడ్డి ఇంటి మీద దాడులు చేయలేదా?  ఆ మర్నాడు, మార్చి 28న కూడా దాడులకు పాల్పడలేదా? ఆ దాడులను అడ్డుకునే ప్రయత్నం చేశావా? ఆ దౌర్జన్యానికి ఎదురొడ్డిన కురుబ లింగమయ్య కుమారులను టార్గెట్‌ చేసుకుని వారి మీద దాడులకు పాల్పడలేదా? మార్చి 28న ఇదే నిందితులు పోలేపల్లి ఎంపీటీసీని పిలిచి బెదిరించడం వాస్తవం కాదా? ఈ దాడులను అడ్డుకోకపోవడం వల్లనే కదా మార్చి 30న కురుబ లింగమయ్యను దారుణంగా కొట్టి చంపింది. నువ్వు దంతెమర్రు ఎంపీటీసీ కొండయ్యని బెదిరించడం వాస్తవం కాదా? 

సుధాకర్‌ కలలు. కల్లలు:
    చంద్రబాబుతో మాట్లాడి పరిటాల సునీత తనకు టికెట్‌ ఇప్పిస్తుందని ఎస్‌ఐ సుధాకర్‌ కలలు కంటున్నాడు. అవసరం ఉన్నంత వరకే చంద్రబాబు. అవసరం తీరాక ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం వారి నైజాన్ని ఇకనైనా గుర్తించు. ఆమె భర్త పరిటాల రవి, ఆమె కుమారుడు శ్రీరామ్‌ లు చంద్రబాబుని దారుణంగా తిట్టిన విషయం గుర్తుందా? 
    ఎప్పుడూ నాలుగు గోడల మధ్య చంద్రబాబుని తిట్టడం పరిటాల కుటుంబ నైజం. కొడుక్కి ఎమ్మెల్యే టికెట్‌ కాదు కదా, కనీసం కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కూడా ఇప్పించుకోలేకపోయిన సునీత నీకు టికెట్‌ ఇప్పిస్తుందంటే సుధాకర్‌ ఎలా నమ్మాడో అర్థం కావడం లేదు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంని కాదని నీకు టికెట్‌ ఇస్తారనుకున్నావా? 

హత్యను నీరుగార్చే ప్రయత్నం:
    లింగమయ్య హత్య కేసును నీరుగార్చేందుకు సుధాకర్‌ ఎంతగా తపించాడంటే, పోలీసులు లింగమయ్య ఇంటికి వెళ్లి అప్పటికప్పుడు ఒక కాగితం రాసుకొచ్చారు. చదువుకున్న లింగమయ్య కొడుకు శ్రీనివాస్‌ స్టేట్‌మెంట్‌ తీసుకోకుండా లోకజ్ఞానం లేని లింగమయ్య భార్యతో వేలిముద్ర తీసుకున్నారు. అది కూడా ఇంట్లో ఉన్న కాటుకతో వేలిముద్ర వేయించారు. 
    ఆస్పత్రుల్లో డాక్టర్లు ఇచ్చిన నివేదికలకు, ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నమోదు చేసిన వాటికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. లింగమయ్య కొడుకు తలపైన, ముఖంపైన గాయాలయ్యాయని ఆస్పత్రి వైద్యులు కూడా ధ్రువీకరిస్తే.. ఒకటే గాయమైనట్టు రాశారు. బేస్‌బాల్‌ బ్యాట్‌తో లింగమయ్యను తలపై కొట్టి చంపితే దొమ్మీ జరిగి కర్రలతో దాడి చేసుకుంటే గాయపడి చనిపోయినట్టు రాశారు. 
    కేసును నీరుగార్చేందుకు హంతకులను, హంతకుల బంధువులను సాక్షులుగా చేర్చడం కన్నా విడ్డూరం ఇంకెక్కడైనా ఉంటుందా?  కేసులో నిందితుడైన రమేశ్‌ ఇంటి వద్ద 70 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయడం కన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? హత్య చేసిన వారికి రక్షణ కల్పించడాన్ని సమాజం హర్షిస్తుందా? ఇప్పటివరకు కూడా లింగమయ్య కొడుకు శ్రీనివాస్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయలేదు. పరిటాల సునీత ఎవరి పేర్లు చెబితే సుధాకర్‌ వారిని కేసులో సాక్ష్యులుగా చేర్చుకుంటున్నాడు.

ఎస్సై సుధాకర్‌ అవినీతి:
    ఎస్సై సుధాకర్‌ కూడబెట్టిన ఆస్తులు ఆయన తండ్రి ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బుతో కొన్నాడా? చిలమత్తూరు దగ్గర ఫాం హౌస్‌ ఎవరి డబ్బులతో కొన్నావు. అక్కడే కోళ్ల ఫారం నిర్మాణం చేస్తున్నది నిజమా కాదా? రాంనగర్‌లో ప్రభాకర్‌ చౌదరి ఇంటి వద్ద పెంట్‌ హౌస్‌ ఎలా కొన్నావు? డస్టర్‌ కారు ఎలా వచ్చింది. 
కర్నూలు దగ్గర బంధువుల పేరుతో అపార్ట్‌మెంట్‌కి డబ్బులు ఎలా వచ్చాయి? ఖాకీ నుంచి ఖద్దర్‌ అని సుధాకర్‌ ప్రచారం చేసుకున్నది వాస్తవం కాదా? 
    ఇంకా టికెట్‌ కోసం టీడీపీ నాయకులను కలిసింది నిజం కాదా?  ఆ ఫొటోలు సోషల్‌మీడియలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లో తిరగలేదా? 
(అంటూ ఆ ఫొటోలు చూపారు). ఈ వివరాలను ఇప్పటికే ఎస్పీకి కూడా పంపించడం జరిగింది. 

ఆ పోలీసుల గురించే వైయ‌స్ జగన్‌ చెప్పారు:
    ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ఖాకీ చొక్కాలను టీడీపీకి తాకట్టుపెట్టి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారో వారందర్నీ న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టి ఖాకీ చొక్కాలు లేకుండా చేస్తామని నిన్న మా నాయకులు వైయస్‌ జగన్‌ అన్నారు.  
    మా ప్రభుత్వం వచ్చాక బాధితులందరూ మళ్లీ ఫిర్యాదులు చేస్తారు. తప్పుడు కేసులను పునర్విచారణ చేస్తాం. ఈరోజు నుంచే చార్జిషీట్లు నమోదు చేస్తాం. కారకులైన పోలీసులను విధుల నుంచి తొలగిస్తామని మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం. నిన్న అనంతపురం పర్యటనలో వైయస్‌ జగన్‌ చెప్పింది కూడా ఇదే. 

వైయ‌స్ జగన్‌ పర్యటనపై అడుగడుగునా ఆంక్షలు:
    లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మా అధినేత వైయస్‌ జగన్‌ వస్తుంటే రానివ్వమని ఎమ్మెల్యే పరిటాల సునీత అహంకారంతో మాట్లాడటం, హెలిప్యాడ్‌కి పర్మిషన్‌ లేకుండా చేయడం కుట్ర కాదా? చెన్నేకొత్తపల్లె వద్ద హెలిప్యాడ్‌ కు పర్మిషన్‌ ఇస్తే అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లె వరకు 12 కి.మీల మేర వైయస్‌ జగన్‌ ను అసుసరించి లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు వస్తారని ప్రభుత్వం భయపడిపోయింది. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో తిరిగితే ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అవుతుందనే భయంతో చివరి నిమిషంలో   
హెలిప్యాడ్‌కి అనుమతి నిరాకరించారు.
    చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం బయటపడకుండా చూసేందుకు వైయ‌స్ఆర్‌సీపీ వాహనాలను, ప్రజలను అడ్డుకునేందుకు అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకునే కుట్ర చేశారు. అయినా ఈ నిర్బంధాన్ని దాటుకుని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు వైయస్‌ జగన్‌ కోసం వేలాదిగా తరలి వచ్చారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వివరించారు.

Back to Top