విశాఖపై ఇంకా విషం చిమ్మొద్దు

ఎల్లో మీడియాపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

గత నాలుగున్నర ఏళ్లలో ఎంతో పురోగతి

పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు. ఉపాధి కల్పన

గణాంకాలతో సహా వివరించిన మంత్రి అమర్‌నాథ్‌

గత ప్రభుత్వ హయాంలో కంటే పారిశ్రామిక పురోగతి

దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం

ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ

 విశాఖపట్నం: విశాఖపై ఇంకా విషం చిమ్మొద్దు, అలా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీయొద్దు అని ఎల్లో మీడియాపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్ అయ్యారు. విశాఖపట్నం, సర్క్యూట్‌ హౌజ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి  గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

 గుడివాడ అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే..:

*గతంలో ఎన్నడూ లేని విధంగా..:*
    మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ నాలుగేళ్ల 9 నెలల్లో జరిగిన అభివృద్ధి, పారిశ్రామిక రంగం పురోగతి గతంలో ఏనాడూ జరగలేదు.అంతకు ముందు 5 ఏళ్ల కంటే చాలా బాగా చేశాం. పారిశ్రామికంగా ఎంతో ఎదిగాం. దీనిపై ఎక్కడైనా మేము చర్చకు రెడీ.

*ఈ స్థాయిలో పారిశ్రామిక పురోగతి:*
    చంద్రబాబుగారి హాయంలో రాష్ట్రానికి దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టుబడి మాత్రమే వస్తే, మా ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ. 90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 1.20 లక్షల మందికి ఉపాధి లభించింది.
    ఇక ఎంఎస్‌ఎంఈలు చూస్తే.. చంద్రబాబు హయాంలో ఎలాంటి పురోగతి లేదు. ఆ సమయంలో కేవలం 1.20 లక్షల ఎంఎస్‌ఎంఈలు మాత్రమే ఏర్పాటైతే, మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3.5 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కాగా, దాదాపు 15 లక్షల మందికి ఉపాధి లభించింది. బాబు హయాంలో దాదాపు లక్ష ఎంఎస్‌ఎంఈలు మూతబడే పరిస్థితి రాగా, కోవిడ్‌ కష్టకాలంలో కూడా మేము వాటిని ఆదుకున్నాం. ఎంఎస్‌ఎంఈలకు దాదాపు రూ. 1000 కోట్లు ఇచ్చి ఆదుకున్నాం. ఆ విధంగా ఆ రంగాన్ని ఆదుకున్నాం.
    రాజమండ్రి ప్రాంతంలో గ్రాసిమ్‌ కంపెనీ కాస్టిక్‌ సొడా యూనిట్‌ ఏర్పాటు చేపింది. విశాఖ వేదికగా అచ్చుతాపురంలో అపోలో టైర్స్‌ కానివ్వండి. ఇంకా ఎకొహొమా ఏటీసీ టైర్స్‌ యూనిట్, ఏసీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వేల ఎకరాల భూమి పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తెచ్చాం.
    ఇంకా ప్రతిష్టాత్మకమైన బల్క్‌ డ్రగ్స్‌ పార్క్‌ను సాధించుకున్నాం. దీనికి 17 రాష్ట్రాలు పోటీ పడితే.. మూడు మాత్రమే సాధించుకున్నాయి. దక్షిణాదిలో మనకు మాత్రమే ఆ పార్క్‌ దక్కింది.
    ఎన్టీపీసీ వంటి సంస్థల సహకారంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ వంటివి స్థాపించి, రాబోయే రోజుల్లో దాదాపు లక్ష  మందికి ఉపాధి కల్పించే దిశలో అడుగులు వేశాం.
    మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటి స్థానంలో నిల్చాం. గత ఏడాది ఇక్కడ నిర్వహించిన సదస్సుకు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు హాజరై, పెట్టుబడులకు సిద్ధమయ్యారు. 
    గతంలో ఎన్నడూ లేని విధంగా మూలపేట, రామయ్యపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రామయ్యపట్నం పోర్టు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో అదానీ డేటా సెంటర్‌ కానివ్వండి.. ఇటీవలే సీఎంగారు ప్రారంభించిన ఇన్ఫోసిస్‌ను చూసి.. పెద్ద పెద్ద ఐటీ సంస్థలన్నీ విశాఖ వేదికగా కార్యకలాపాలకు ప్రభుత్వంతో మాట్లాడుతున్నాయి.

*విషం చిమ్మొద్దు..:*
    ఇవన్నీ పక్కనపెట్టి, లేనిపోనివి రాసి, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. మీకు కావాల్సిన వ్యక్తిని సీఎం పదవిలో కూర్చోబెట్టడం కోసం రాష్ట్రంపై విషం చిమ్మొద్దు. రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెట్టొద్దు.
ఎల్లో మీడియాకు మరోసారి చెబుతున్నాం. వాస్తవాలకు దూరంగా వార్తలు రాస్తూ.. ప్రజలను మభ్య పెట్టొద్దు. సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారిని ప్రజలంతా ఆదరిస్తున్నారు. అందుకే వారు సభలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.

*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు జన నీరాజనం:*
    వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి సంబంధించి ఎలా సన్నద్ధం కావాలి, పార్టీ కేడర్‌ ఎలా పని చేయాలన్న దానిపై సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఇటీవలి శంఖారావం సిద్ధం సభల్లో చెబుతున్నారు.  ఇటీవల భీమిలి, దెందులూరు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ప్రజలు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తిరిగి సీఎం కావాలని కోరుకుంటున్నారు. పథకాల కొనసాగింపు ఆయన వల్లే సాధ్యమని అభిమానులు, ప్రజలు అనుకుంటున్నారు. అందుకే సభలకు విశేష స్పందన లభిస్తోంది.

*ఓర్చుకోలేక బురద రాతలు:*
    దీంతో ఓర్చుకోలేకపోతున్న ఎల్లో మీడియా, ప్రజల దృష్టి మళ్లించడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. దాంట్లో భాగంగానే నిన్న ఒక పత్రిక విశాఖ నగరంపై కధనం రాసింది. మరో పత్రిక ఇక్కడి పారిశ్రామిక రంగంపైనా లేనిపోనివి రాసింది. తాము అధికారంలోకి వస్తే సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కంటే ఇంకా ఎక్కువే ఇస్తామని విపక్షం చెబుతోంది. ఎందుకంటే, మా ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పే ధైర్యం వారికి లేదు.

 *బాబుకు నైతికత లేదు:*

    కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబు తోకపార్టీనే కదా? ఆయన కనుసన్నల్లోనే ఆ పార్టీ పని చేస్తోంది కదా? రాష్ట్రంలో ఒక్క వైయస్సార్‌సీపీ మినహా.. ఏ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోలేదు చెప్పండి. ఎప్పటికప్పుడు అవసరాల కోసం పార్టీలతో జత కట్టాడు. అదీ చంద్రబాబు రాజకీయం.

*దానికీ, దీనికి ఏం సంబంధం?:*
    పార్టీ నుంచి ఒకరో, ఇద్దరో వెళ్లిపోతారు. అది వారి అవసరం కావొచ్చు. లేదా మరే ఆపేక్ష కావొచ్చు. అలా వారు వెళ్లిపోవడానికి, ప్రభుత్వం అభివృద్ధి చేయలేదనడానికి ఏమిటి సంబంధం? వారు ఈ నాలుగేళ్ల 9 నెలలు పార్టీతోనే ఉన్నారు కదా? ఇప్పుడు వారు స్వలాభం కోసం పార్టీ మారుతుండొచ్చు. పార్టీలోకి కొత్తవారు రావడంలో తప్పేమిటి? ఏమిటి రాకూడదా?

*పార్టీ నిర్ణయానికి కట్టుబడతాను:*
    పార్టీ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో అభ్యర్థులను మారుస్తోంది. దానిపై మీకెందుకు అభ్యంతరం. నేను అప్పుడూ, ఇప్పుడూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. పార్టీ అధినాయకత్వం ఏం చెబితే, దాన్ని ఆచరిస్తాను.
    నాకు 28 ఏళ్ల వయసుల్లో ఎంపీగా పోటీ చేయించారు. నేను ఓడిపోతే, నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆ తర్వాత 33 ఏళ్లకే ఎమ్మెల్యేగా చేశారు. 38 ఏళ్లకు మంత్రిని చేశారు. మా ఫ్యామిలీ మూడు తరాలుగా రాజకీయాల్లో ఉంది. నా రాజకీయ జీవితంపై జగన్‌గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దాన్ని ఆచరించడానికి నేను సిద్ధం.
కాబట్టి నా గురించి మీరు (ఎల్లో మీడియా) ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

*అది మా బాధ్యత:*
    నా తలరాత జగన్‌గారు రాస్తారు. ఈ రాష్ట్రానికి జగన్‌గారు ఎంతో అవసరం. ఆయన్ను తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మా అందరిపై ఉంది. అందుకోసం మేము చిత్తశుద్ధితో పని చేస్తాం.
    ప్రభుత్వంతో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్‌ అన్నారు. వారిలో నేనూ ఒకడిని. జగన్‌గారి కోసం ఏ త్యాగానికైనా నేను సిద్ధం. జగన్‌గారిని తిరిగి సీఎం చేయడం కోసం చాలా చిత్తశుద్ధితో పని చేస్తాం. జగన్‌గారు తిరిగి సీఎం కావడం, రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరం. ఆయన మళ్లీ సీఎం అయితేనే.. రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అందుకే జగన్‌గారు ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు నేను సిద్ధం.

*ఆ భూమి ఎప్పుడో ఇచ్చాం:*
    రైల్వే జోన్‌ కోసం భూమి కేటాయింపు, కేంద్రానికి అప్పగించడంపై కలెక్టర్‌గారు అన్ని వివరాలు చెప్పారు. జనవరి మొదటి వారంలోనే కేంద్రానికి భూమి ఇచ్చేశాం. అయినా మా ప్రభుత్వం భూమి ఇవ్వలేదని, కేంద్రం చెబితే మేమేం చేస్తాం?
మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఆ దిశలోనే కేంద్రంతో సయోధ్య కొనసాగిస్తున్నాం తప్ప, అందులో మా స్వార్థం ఏమీ లేదు. మేము చంద్రబాబు మాదిరిగా, డబ్బులు ఇస్తూ.. అడ్డంగా దొరికిపోయి, రాత్రికి రాత్రి పారిపోయి రావడం వంటివి చేసే రకం కాదని మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Back to Top