అమరావతి: రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను భారీ స్థాయిలో నెలకొల్పడం ద్వారా భవిష్యత్‌లో ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఏపీ చేరనుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం వర్చువల్ విధానంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కొత్త యూనిట్ల ప్రారంభం ద్వారా రాష్ట్ర విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్(ఎస్డీఎస్టీపీఎస్) కృష్ణపట్నం రెండో దశలో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి ఈ అక్టోబర్ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్(డాక్టర్ ఎన్టీటీపీఎస్) ఐదో దశలో మరో 800 మెగావాట్ల అదనపు విద్యుదుత్పత్తి వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అందుబాటులోకొస్తుందని మంత్రి వివరించారు. 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక(పవన, సౌర, జల) ఇంధన ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, దేశంలోనే ఇది వినూత్న ప్రయోగమన్నారు. ఇంత భారీ స్థాయిలో విద్యుదుత్పత్తి వల్ల మన రాష్ట్రం నుంచి విద్యుత్‌ను వాణిజ్య పరంగానూ ఎగుమతి చేయవచ్చని మంత్రి వివరించారు. అప్పులు, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చటం, ట్రూ అప్, ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాలపై అసత్య ప్రచారాలను ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భవిష్యత్‌లోనూ పెద్ద ఎత్తున పవన విద్యుదుత్పత్తికి అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటిరోలోజీ ఇచ్చిన నివేదికను మంత్రి స్వాగతించారు.