తాడేపల్లి: చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడల్లా పరీక్షల నిర్వహణ గందరగోళంగా ఉంటుందని, ప్రశ్నాపత్రాలు లీకవుతాయని, మాల్ ప్రాక్టీస్ ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రుజువైందని వైయస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర గుర్తు చేశారు. ఈసారి కూడా చంద్రబాబుగారు సీఎం అయ్యాక గత పది నెలల పాలనలోనూ ఏ మార్పూ కనిపించడం లేదని ఆయన ప్రస్తావించారు. విద్యా శాఖకు సీఎం తనయుడు స్వయంగా మంత్రిగా ఉన్నా, వరసగా జరుగుతున్న పేపర్ లీకేజీల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో రవిచంద్ర ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో రవిచంద్ర ఇంకా ఏం మాట్లాడారంటే..: అధికారుల నిర్లక్ష్యం. అసమర్థ ప్రభుత్వం: పదో తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పరీక్షలు మొదలైన నాటి నుంచి రాష్ట్రంలో పలుచోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. నిన్న (సోమవారం) గణితం పరీక్ష ప్రారంభం కాక మునుపే వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం దర్శనమిచ్చింది. వైయస్‌ఆర్ కడప జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్ష జరుగుతుండగా ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్‌లో వివేకానంద పాఠశాలకు పంపారు. పరీక్ష ప్రారంభం కాక ముందే ప్రైవేటు విద్యాసంస్థలకు పరీక్ష పేపర్లు చేరుతున్నాయంటే అధికారుల నిర్లక్ష్యం, పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వ అసమర్థత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించలేని స్థితిలో ఉన్నారని పదేపదే రుజువు అవుతూనే ఉంది. గతంలోనూ అర్ధవార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలాగే లీకై కలకలం రేపినా ప్రభుత్వం ఇంకా మేల్కొనలేదు. చివరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఇటీవల జరిగిన బీఈడీ పరీక్షల మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం కూడా పరీక్ష ప్రారంభం కాక ముందే వాట్సాప్‌లో బయటకు వచ్చింది. నిందితులపై చర్యలు తీసుకోరు!: ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండగా 1995లో పదో తరగతి ప్రశ్నాపత్రం, 1997లో ఇంటర్ ప్రశ్నాపత్రం లీకేజీలు జరగ్గా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2017లో నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో ఉన్న నారాయణ విద్యాసంస్థల్లో పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. నారాయణ విద్యార్థులకే ఎక్కువ మార్కులు రావాలని ఆ సంస్థలో పని చేసే ప్రన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్‌ఆర్‌ఐ విద్యా సంస్థలతో చేతులు కలిపి అడ్డదారులు తొక్కిన విషయంపై ఆనాడు రాష్ట్రంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. కాగా, అప్పుడు విద్యా శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు.. మంత్రి నారాయణకు వియ్యంకుడు కావడంతో పేపర్ లీకేజీ జరగలేదని చెప్పారు. లీకేజీ జరిగిందని, బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ భార్గవ్ చెప్పారు. ఆ విషయం పేపర్లలోనూ ప్రముఖంగా వచ్చింది. 2019లో కూడా చంద్రబాబు పాలనలో కర్నూలులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో లీకేజీ కట్టడి: 2022లో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా నారాయణ విద్యాసంస్థల నేతృత్వంలో పేపర్ లీక్‌కు ప్రయత్నిస్తే పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. లీకేజీ వెనుకున్న ఆయా విద్యా సంస్థల మీద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి: 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో పేపర్ లీకేజీ ఘటనలు మళ్లీ మొదలయ్యాయి. 6.19 లక్షల మంది పదో తరగతి విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. మార్కుల కోసం, ర్యాంకుల కోసం, తద్వారా అడ్మిషన్లు పెంచుకుని ఆస్తులు కూడబెట్టుకోవాలని నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న అక్రమాలకు ప్రభుత్వం అడ్డు చెప్పడం లేదు. ఫీజుల రూపంలో విద్యార్థులను దోచుకోవడానికి నారాయణ విద్యా సంస్థ చేస్తున్న అరాచకాలకు ప్రభుత్వం వంత పాడుతుంటే సామాన్యులు ఏమైపోవాలి. వైయస్సార్ కడప జిల్లాలో పదో తరగతి గణితం ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలి. అలాగే లీకేజీ వెనుక ఉన్న నిందితులను తక్షణమే పట్టుకుని చట్టపరంగా శిక్షించాలని ఎ.రవిచంద్ర డిమాండ్ చేశారు.