తాడేపల్లి: చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా సీఎంను చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు . ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైయస్ఆర్ కుటుంబానికి అన్యాయం చేసిందని ఆయన గుర్తు చేశారు. ‘షర్మిల వాడిన భాష, యాస సరికాదు. వైయస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధతతో పనిచేస్తున్నారు. వైయస్ఆర్ వారసుడిగా సీఎం వైయస్ జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వైయస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది. సీఎం వైయస్ జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు. వైయస్ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కాంగ్రెస్సే. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?. షర్మిల.. తెలంగాణ నుంచి ఏపీకి హఠాత్తుగా ఎందుకొచ్చారు. ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షర్మిలను ఎందుకు గుర్తించలేదు?. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే. అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది. చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారు. వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తనను కలిసిన మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: కాంగ్రెస్ పార్టీ ఆమె కుటుంబానికి చేసిన ద్రోహం మరచినట్లున్నారు: – పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా షర్మిలమ్మ మాట్లాడిన భాష కానీ, చేసిన హడావుడి కానీ చూశాక వైయస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా, వైయస్ఆర్ ఆశయాలకు పూర్తిగా పేటెంట్ కలిగిలిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా స్పందిస్తున్నా. – మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాకుండా జగన్మోహన్‌రెడ్డి గారు వైయస్ఆర్ తనయుడిగా, ఆయన రాజకీయ వారసుడిగా కూడా నిరంతరం వైయస్ఆర్ ఆశయాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేశారు. – ప్రజలు, ముఖ్యంగా పేదలు, దళితులు, మైనార్టీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలు..మొత్తం సమాజం అంతా అక్కున చేర్చుకున్న నాయకుడు జగన్ గారు. – ఒక రకంగా షర్మిలను చూస్తే జాలి కలుగుతోంది. హఠాత్తుగా ఊడిపడినట్లు రావడం, నిన్నటి వరకూ తెలంగాణలో ప్రయోగం చేయడం, ఆ తర్వాత ఉన్నట్లుండి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. – అక్కడున్న వారిలో కేవీపీ, రఘువీరారెడ్డి తప్ప ఆమెకు తెలిసిన వారు కూడా ఎవరూ లేరు. – కాంగ్రెస్ పార్టీ గురించి అయినా తెలుసా అంటే అదీ తెలియదు. ఆమెకు తెలిసుంటే కాంగ్రెస్ పార్టీ ఆమె కుటుంబానికి ఎలా ద్రోహం చేసిందో తెలిసి ఉంటుంది. – ఏ వైయస్ రాజశేఖరరెడ్డి గారైతే ఆ పార్టీ కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణమయ్యారో... వైయస్ఆర్ ప్రధాన కారణమని ఆనాడు మన్మోహన్ సింగ్ కూడా చెప్పారు. – ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. – అక్రమ కేసులు బనాయించి నేరుగా వైయస్ఆర్ గారి పేరు చార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. – తన అన్న, నేటి ముఖ్యమంత్రి జగన్ గారిని 16 నెలలు అక్రమంగా జైల్లో పెట్టారు. – ఆనాడు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు, టీడీపీ నుంచి ఎర్రంనాయుడు, అశోక్ గజపతి రాజులు కలిసి కుమ్మక్కై వేసిన కేసు చార్జ్‌షీట్లో వైయస్ఆర్ పేరు పెట్టారు. – సోనియా గాంధీ చెప్తేనే తాను కేసు వేశానని ఆనాడు శంకర్రావు కూడా చెప్పాడు. – ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన గులాం నబీ అజాద్‌కూడా ఆనాడు మాట వినుంటే కేసులు పెట్టేవాళ్లం కాదన్నారు. తెలంగాణలో ఏం చేశారు..? హఠాత్తుగా ఇక్కడకెందుకు ఊడిపడ్డారు..?: – ఆ పార్టీ గురించి చెప్తే పెద్ద పురాణం. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. – ఈ రోజు హఠాత్తుగా, ఆవేశంగా, భాష, యాస కూడా మార్చి చంద్రబాబు చెప్పే డైలాగులే చెప్తుంటే జాలి కలగకుండా ఉంటుందా? – ఆమె వైఎస్సార్ గారి కూతురు కావడం, ముఖ్యమంత్రి గారి సహోదరి కావడం, ఆమె ఇస్తున్న పిలుపులు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉండటం వల్ల మేం స్పందించాల్సి వచ్చింది. – ఒకప్పుడు కుటుంబ సభ్యురాలిగా అన్నకు మద్దతుగా నిలిచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. – సహజంగా ఆమెపై మాట్లాడాలంటే కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. – కానీ ఆమె మాత్రం నేరుగా జగన్ రెడ్డీ అన్నారు..నియంత అన్నారు. – నేను ఒక రాజకీయ వేదికపైకి వెళ్లాక ఏం మాట్లాడాలో అదే మాట్లాడాను అన్నట్లుంది. – ఇవే మాటలు మరోసారి రావచ్చు..అందుకే మేం సమాధానం చెప్పాల్సి వస్తోంది. – షర్మిలమ్మ నిన్నటి వరకూ మూడేళ్లుగా తెలంగాణలో ఏం చేశారు..? అక్కడనుంచి హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? – తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా..అక్కడ ఎందుకు చేయలేకపోయారు..? హఠాత్తుగా డిప్యుటేషన్ ఎందుకు..? ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి? – ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్ల శాతం ఉంది. – నోటాకు 1.28 శాతం వస్తే 1.17 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. – రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో ఇక్కడకు వచ్చి ఆమె చేయలగలిగింది ఏముంది? – ఏదైనా ఆమె చేయగలిగింది ఉంటే తెలంగాణలో చేయవచ్చు. మొన్నటి ఎన్నికల్లో అత్తెసరు సీట్లే వచ్చాయి. రాజశేఖరరెడ్డి గారి పేరు అక్కడి ఎన్నికల్లో యథేచ్ఛగా వాడుకున్నారు. – షర్మిలమ్మ తన పలుకుబడి ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి పనికి వచ్చేదేమో? మరి ఇక్కడకెందుకు వచ్చారు? – ఆమె లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కాదు..చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం ఎలా అనేదే ఉన్నట్లుంది. – చంద్రబాబునాయుడు తన లక్ష్యం కోసం అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆఖరున ఈమెను కూడా తీసుకొస్తే వైయస్ఆర్ అభిమానుల ఓట్లు చీల్చడానికి ఉపయోగపడుతుదేమోనని ఆయన ప్రయత్నం. – మళ్లీ యాంటి ఇంకబెన్సీ ఓటు చీలకూడదు...కేవలం క్రిస్టియన్ మైనార్టీలు, దళితుల ఓట్లు మాత్రమే టార్గెట్ స్పీచ్ తయారు చేసి పంపారు. కాంగ్రెస్ తరఫున హోదాపై షర్మిలమ్మే సంజాయిషీ ఇవ్వాలి: – మేం అడుగుతున్నది ఒక్కటే. అసలు ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే చంద్రబాబుతో కుమ్మక్కై ఆనాడు కాంగ్రెస్ చేసింది. – అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి మనల్ని పక్కకి పంపారు. – మన హక్కులను రక్షించకుండా, స్పెషల్ స్టేటస్ చట్టబద్ధం చేయకుండా అన్యాయం చేసింది. – ఈ రోజు ఆ వేదికపై ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. అసలు చీల్చిందే మీ పార్టీ కదా? ఆ రోజు ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే అసలు పోరాడాల్సిన అవసరమే ఉండదు కదా? – రాజధానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఇస్తామని ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా? – తాను చేసిన తప్పుకు తాను సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పార్టీ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. – ఆ పార్టీ తరఫున షర్మిలమ్మ వకల్తా పుచ్చుకుని జగన్ గారిని అడుగుతోంది. వ్యక్తిగతంగా ఆ పార్టీ తరఫున ఆమె సంజాయిషీ ఇవ్వాలి. – ఆమె మమ్మల్ని ప్రశ్నించడం చిత్రంగా ఉంది. ఆమె వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వాలి. – ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నప్పుడు ఆమె సమాధానం చెప్పాలి. – ఇన్నాళ్లూ తెలంగాణలో ఏం చేశావు..? ఇదే షర్మిలమ్మ తన తండ్రి పేరు అక్రమంగా కేసులో పెట్టారు అని అన్నారు. – ఇంత అన్యాయం చేసిన పార్టీ అని మరి ఈ రోజు అదంతా ఎలా మర్చిపోయారు..? – చివర్లో ఆమె రియలైజ్ అయింది అనుకున్నా కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఈమెను మద్దతు కోరారా? – 119 సీట్లో పోటీ చేస్తున్నా అన్న ఆమె మళ్లీ ఎందుకు చేయలేదు..? – అసలు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్పకుండానే పక్కకు ఎందుకు జరుగుతున్నారు? – ఈ రాష్ట్రంలో మీకు పనేముంది అని తోసేయడానికి తెలంగాణ కాంగ్రెస్ వారు ట్రై చేశారు. – రేవంత్‌రెడ్డి...ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే చంద్రబాబు నేను ఉపయోగించుకుంటాను అని తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. – ఇక్కడకు రావడం రావడమే ఈ పదేళ్లలో ఏం జరిగింది అంటూ మాట్లాడుతూ జగన్ రెడ్డీ అనడం, నియంత అనడం, బాష అన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. – ఆ రోజు తప్పు చేసిన మీ కాంగ్రెస్ పార్టీపై మా విధానం ఈరోజు కూడా ఒక మాటపై కట్టుబడి ఉన్నాం. – పోరాటం ఏఏ పద్దతుల్లో చేయాలో చేయడంతో పాటు..కేంద్రంలో వత్తిడి పెట్టగలిగిన సంఖ్య, కేంద్రం మనపై ఆధారపడే పరిస్థితి వచ్చే వరకూ ఆ అంశాన్ని సజీవంగా ఉంచుతున్నాం. – ఎప్పటికప్పుడు హోదా అంశాన్ని లేవనెత్తుతూ..ఎప్పుడైతే ఆ అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. – అందులో భాగంగా ప్రధాని పక్కనే ఉన్నా విశాఖ సభలో వైయస్ జగన్ గారు హోదా అంశాన్ని లేవనెత్తారు. – దాన్ని చాపకింద తోయలేదు..మర్చిపోలేదు. మా ప్రభుత్వం రాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా స్పష్టంగా చెప్పారు. – మా మీద ఆధారపడే అవసరం మోడీకి లేదు అనేది ఈ పరిస్థితికి కారణమవుతోందని చెప్పారు. – కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆమె తీసుకున్నప్పుడు ఆ రోజు ఆ పార్టీ స్పెషల్ స్టేటస్ చట్టంలో చేర్చలేదు..? – అడ్డగోలుగా కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విభజించింది..ఎందుకు ఏపీకి సరైన గ్యారెంటీలు కల్పించకుండా ఏకపక్షంగా విభజించారో జవాబు ఇవ్వాలి కదా? – అలా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదంటే నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చి ప్రజలు శిక్ష వేశారు. – ఇప్పుడు ఈమె పార్టీని భుజాన ఎత్తుకుని రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాను అంటున్నారు కాబట్టి ఆమె సంజాయిషీ ఇవ్వాల్సి వస్తుంది. – ఈ మూడేళ్లు నేను తెలంగాణ బిడ్డను, అక్కడ ఉంటాను అంటే తెలంగాణ యాసలో మాట్లాడి కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. – నా జీవితం అంతా తెలంగాణలోనే అన్న ఆమె ఎందుకో ఇటు వచ్చారు. – కేవలం వైయస్ జగన్ గారున్నారనే..ఆమెకు ఒక వెపన్ అవుతుందని..ఆ వెపన్ చంద్రబాబుకు ఎలా ఉపయోగపడుతుందో కూడా ప్రజలకు తెలుసు. టీడీపీ వెంటిలేటర్‌పై ఉంటే..కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైంది: – నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి టీడీపీ వెంటిలేటర్ మీద ఉంటే...ఈ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. ఇప్పుడు ఆ పార్టీకి జీవం పోయాలంటే శవానికి జీవం పోయాలనే ప్రయత్నం లాంటిదే. – ఇందలో చంద్రబాబునాయుడి ఎత్తుగడ మాత్రమే ఉంది. అందుకే రేపటి నుంచి ఆ మీడియా ఈమెను విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తారు. – రామోజీరావుకు, రాధాకృష్ణలకు ఈమెపై ఎందుకంత ప్రేమ అంటే కారణం వారి టార్గెట్ జగన్ గారు కాబట్టి. – చంద్రబాబు తన హయాంలో ఏం చేశాడో చెప్పుకోలేక, జగన్ గారు చేసిన దాని నుంచి ప్రజల్ని ఏమార్చాలన్నా ఇలాంటి కుయుక్తులు చేస్తున్నారు. – వైఎస్సార్ అభిమానుల ఓట్లను, దళితులు, మైనార్టీల ఓట్లలో చీలిక తీసుకురావచ్చనే కుట్రలో భాగంగానే ఈమె ఒక అస్త్రం అయ్యారు. – ఎవరైనా కన్ఫ్యూజన్‌కి గురవుతారేమోనని మళ్లీ మళ్లీ చెప్తున్నాం..రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ..అది వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ. – హస్తం గుర్తు కాంగ్రెస్ ఎప్పుడో పోయింది..వైయస్ఆర్ అందరి గుండెల్లో ఉన్నారు..ఆయన తనయుడు వైయస్ జగన్ గారు వారసుడిగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. – ఈ రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు, క్రైస్తవులు, దళితులతో పాటు ఎవరికైనా రక్షణ ఇవ్వగల శక్తి, నిబద్ధత తనకుందని ఈ పన్నెండేళ్ల నుంచి జగన్ గారు రుజువు చేసుకుంటూనే ఉన్నారు. – ఇక వేరే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో అవసరం లేదు..ఆ అవకాశం లేదు. – మతం ఎదైనా వ్యక్తిగతంగానే ఉండాలి కానీ అది రాజకీయంగా, పరిపాలనలో దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించిన వ్యక్తి జగన్‌గారు. – ఏ దేవుడ్ని ఎవరు కొలిచినా అన్నిటి భావం ఒకటే అని నమ్మిన వ్యక్తిగా వాటికి అతీతంగా ఉన్నారు. – ఎవరికి ఏ అన్యాయం జరిగిన వారిని రక్షించడం, అక్కున చేర్చుకోవడం చేస్తున్నారు. – మత ప్రాతిపదికన ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఆయన సహించడు..అలాంటిది జరగనివ్వడని ఐదు కోట్ల మంది ప్రజలు విశ్వసిస్తున్నారు. – ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత విశ్వాసాలు కాకుండా రాష్ట్రం అవసరాలు, ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్ధేశించాలని బలంగా నమ్మే వ్యక్తి జగన్‌గారు. – కేంద్రంలో ఎవరున్నా వారితో సమన్వయం చేసుకుని వీలైనంత వరకూ రాష్ట్రానికి మేలు చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్ గారు. – ఎక్కడో ఏ మూలనో ఏదో జరిగితే ప్రతి దానిపైనా రియాక్ట్ కావడానికి ఆయన సంపాదకీయ వర్గం కాదు..ఒక వ్యక్తి కాదు. – ఈ రాష్ట్రానికి ఏం చేయగలమనేదే ఆలోచించాలి. అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడాలి. – ఆ విషయంలో ఎప్పుడూ రాజీపడే ప్రసక్తే లేదు. అంతేకానీ..మన ప్రభావం చూపలేని వాటి గురించి నోటి దూల తీర్చుకోడానికి ప్రసంగాలు, స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. – అది ప్రజలకు తెలుసు..అందుకే ఆయన్ను అందరూ నమ్ముతున్నారు. – జగన్ గారి చెల్లెలుగా, రాజశేఖరరెడ్డి గారి కూతురుగా ఆమెను అభిమానించే వారు ఉండొచ్చు. – కానీ అది కూడా ఆమె పొగొట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ఆమె మాట తీరు చూస్తుంటే అర్ధం అవుతోంది. ఓ వైపు బీజేపీ కోసం..మరో వైపు కాంగ్రెస్‌కు స్నేహ హస్తం: – చంద్రబాబు వెంటిలేటర్‌పై ఉన్నారు. పొత్తులు పెట్టుకుని ఏదో సాదించాలి అనుకుంటున్నాడు. – ఆయన టార్గెట్ జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంకు అనుకుంటున్నాడో అది కలిసి ఉండాలి...అనుకూలంగా ఉండే ఓటు చీలాలని చంద్రబాబు అనుకుంటున్నాడు. – పవన్ కల్యాణ్ కూడా అక్కడక్కడ ఆయన్ను విమర్శించిన వాడే. కానీ ఇప్పుడు ఆయనతోనే చేరాడు. – ఈ రోజు ఈమె మాట్లాడింది కూడా అదే కోణం. ఎందుకంటే ఆమె మాట్లాడింది అసంబద్ధం. – ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం కూడా వెంపర్లాడుతున్నాడు. ఎంపీలను అక్కడే పెట్టాడు..బీజేపీ అధ్యక్షురాలు నేరుగా ఈయనకు వకాల్తా పుచ్చుకున్నారు. – పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబు. ఆయనకు పోయేదేమీ లేదు. జగన్ గారికి నష్టం కలిగించేందుకు ఈమె ఉపయోగపడుతందని వారి ప్రయత్నం. – అప్పట్లో అద్వానీ గారు, మోడీ గారు కూడా పొత్తుకోసం అడిగారు. – అయినా అప్పటి నుంచీ మేం ఒకటే మాట చెప్తున్నాం. వైఎస్సార్సీపీ డిఎన్‌ఏలోనే దళితులు, మైనార్టీలు, ఎస్టీలు, బీసీల పరిరక్షణ, వారి హక్కులను కాపాడటం మా లక్ష్యాలు. – దీనికి ఒకరి సర్టిఫికెట్ అవసరం లేదు. దీనిపై ఒక చిన్న రాయి వేస్తే ఏమైనా లాభం అందుతుందా అనేది వారి ఆలోచన. – చిన్న పిల్లాడిని అడిగినా నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీ పగ్గాలు చేపడితే ఎవరికి ఉపయోగం..అది టీడీపీకే ఉపయోగం. – తెలంగాణలో ఉన్న యాస ఇక్కడకు వచ్చాక మారింది కానీ..మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. – ఆమె కాంగ్రెస్‌ను తిట్టిన విషయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. – కాంగ్రెస్ పార్టీ ఆమె సేవలు అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేదు..? ఎందకు పక్కన పెట్టారు..? ఎందుకు ఇప్పుడు ఏపీకి తెచ్చారు? – 2019లో అసలు పట్టించుకోని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఇప్పుడు హఠాత్తుగా ఈమెను ఎందుకు పంపారు..? – నెలరోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఆమెను పంపడానికి కారణం చంద్రబాబుకు ఉపయోగపడటమే. – ఓ వైపు బీజేపీ పొత్తు కోసం పురందేశ్వరి ప్రయత్నం చేస్తున్నారు...బీజేపీ పొత్తు ఉంది అని చెప్పుకుంటే లాభం అని వారి భావన. – మరో వైపు సీఎం రమేష్ ఫ్లైట్‌లో వచ్చిన ఆమె భర్త అనిల్ కుమార్ వెనుక బీటెక్ రవి ఉన్నాడు. – బ్యాక్ గ్రౌండ్‌లో ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు మద్దతు ఇస్తున్నారు. – మళ్లీ ఎక్కడ బీజేపీకి కోపం వస్తుందో అని రామమందిరం ప్రతిష్టాపనకు కూడా వెళ్తున్నాడని తెలిసింది. – ఇదంతా చూస్తే క్లియర్‌గా కనిపిస్తున్నది మాత్రం షర్మిలమ్మను ఒక పావులా వాడుకుంటున్నారనేది సుస్పష్టం. – ఎందుకు ఆమె పావులా మారుతున్నారనే దానికి కారణం తెలియడం లేదు. జగన్‌గారిపై ఈర్ష పెంచుకున్నారా అనేది కూడా అర్ధం కావడం లేదు. – ఆనాడు సోనియా గాంధీ వద్దకు వెళ్లిన ముగ్గురిలో ఈమె కూడా ఉన్నారు. ఆమె కఠినంగా బిహేవ్ చేశారని షర్మిలమ్మే అన్నారు. – ఆమె వెళ్లాలనుకున్నది..వెళ్లారు..ఇది చంద్రబాబుకు ఉపయోగపడుతుంది తప్ప మరోటి కాదు. – ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారనేది రానున్న రోజుల్లో కనిపిస్తుంది. – ఇప్పటికీ జనం గుండెల్లో సజీవంగా ఉన్న రాజశేఖరరెడ్డి గారి కుటుంబం గురించి రోడ్డుపై పడి చర్చించుకోవాల్సి రావడం బాధాకరం. – రోజూ టీడీపీ, జనసేన మాట్లాడేవే షర్మిల గారు కూడా మాట్లాడారు. అవే మాట్లాడితే లేని పార్టీకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు.