విశాఖపట్నం: రేపు విశాఖకు వస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలకబోతున్నామని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. విశాఖలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల అనంతరం సీఎం వైయస్ జగన్ విశాఖ ఉత్సవ్‌లో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ నిర్ణయంతో విశాఖ నగరానికి మహర్దశ పట్టబోతోందని, ఉత్తరాంధ్ర ప్రజలంతా సీఎంకు రుణపడి ఉంటారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తప్పితే మిగతా 7 దశాబ్దాలు ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ భావిస్తున్నారని వివరించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నామని, పరిపాలనా రాజధానిగా మారితే అంతర్జాతీయ నగరంగా విశాఖ ఎదుగుతుందని చెప్పారు. చంద్రబాబుకు అమరావతి పైనే ప్రేమ.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు పట్టవా..? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా కళ్లు తెరిచి మాట్లాడాలన్నారు.