అమరావతి: తోటపల్లి కాలువల ఆధునీకీకరణ పనులపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అసెంబ్లీ సాక్షిగా అబద్దపు మాటలు మాట్లాడటం సమంజసం కాదని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. తోటపల్లి కాలువలపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తోటపల్లి కాలువల బిల్లులు చెల్లించలేదని అసెంబ్లీలో నిమ్మక జయకృష్ణ చెప్పిన మాటలపై ఎమ్మెల్సీ విక్రాంత్ తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన స్వగృహంలో మీడియాతో విక్రాంత్ మాట్లాడారు. 2014-19 మద్య కాలంలో టీడీపీ హయాంలో తోటపల్లి కాలువల ఆధునీకీకరణ పనులు కేవలం 9 శాతం మాత్రమే జరగగా అప్పటి టీడీపీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా బిల్లులు చెల్లించలేదన్నారు.2019లో అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 వరకు 14 శాతం పనులు పూర్తి చేసామన్నారు. ఈ రెండు విడతలకు గాను 2021 మార్చి 31న రూ.15,96,09,820 లను, తర్వాత 2022 మార్చి 31న రూ.7,63,18,832 బిల్లులను రెండు విడతలుగా మొత్తం రూ.23,59,28,652 లను అప్పటి వరకు జరిగిన పనులకు గాను వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించిందన్నారు. ఈ వాస్తవాలను తెలుసుకుని ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు.రైతులపై చిత్తశుద్ధి ఉంటే తోటపల్లి కాలువ పనులు పూర్తి చేసేందుకు కృషి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా సాధించేదేమీ లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసని విక్రాంత్ పేర్కొన్నారు.