న్యూఢిల్లీ : ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైయస్ఆర్‌సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం. 👉టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని, మరోవైపు మద్దతిస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. 👉ఏపీలో రూ.2,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని నిలిపివేసింది. మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీని నడపలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మివేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపేలా చర్యలు తీసుకోవాలి. 👉ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది. విభజన చట్టంలోని హామీలను మరిపోయింది. ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, అమరావతిలో మాత్రం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. ఈ గణాంకాల పైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి. 👉వైయస్ఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టారు. కానీ, గడిచిన 11 నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ‘‘మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటాం’’ అని మిథున్ రెడ్డి అన్నారు.