తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రోజు ఏదో ఒక అబద్ధంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఆర్‌డీఏ భూముల విక్రయంపై తప్పుడు ఆరోపణలు చేసున్నారని ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో 90 శాతంపైగా హామీలను సీఎం వైయస్ జగన్ నెరవేర్చారని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై ఉన్న అక్కస్సుతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి బరితెగించి ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. మూడేళ్లుగా సంక్షేమ పాలన అందిస్తున్నామని చెప్పారు. ఏదో విధంగా ప్రభుత్వంపై ప్రతిపక్షం, ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై బురద జల్లుతుందని మండిపడ్డారు. టీyî పీ అజెండాను ఎల్లోమీడియా సిద్ధం చేస్తుందని చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... టీడీపీది మాయా యుద్ధం అధికారం పోవడంతో పాటు, రాష్ట్ర ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించి రిజెక్ట్ చేయడంతో... ఇక మళ్లీ అధికారంలోకి రాలేమనే స్పష్టమైన వైఖరి కనిపించడంతో తెలుగుదేశం పార్టీ నిరాశ, నిస్పృహతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద అడ్డగోలుగా కుట్రలు, కుతంత్రాలతో కూడిన మారీచ, మాయా యుద్ధం చేస్తోంది. మా పార్టీ పాలనలో ఉన్న ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ విధానాల మీద గత మూడేళ్లుగా విషం చిమ్ముతూనే వస్తోంది. - అందులో భాగంగానే టీడీపీ చేస్తున్న కుట్రలను, వాస్తవాలను ప్రజలకు మేము చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉండటం అంటే ఎవరికైనా అదే ముగింపు కాదు. మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యంలో అది సహజం. అందుకోసం అనుసరించాల్సిన సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. ఓటరు దేవుడు... చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిగారు, టీడీపీ, వైయస్సార్ సీపీ తలరాతను నిర్ణయిస్తాడు. ఓటరుకు అప్పీలు చేసేవిధంగా ఎన్ని పోరాటలు అయినా చేయవచ్చు. అధికారంలో ఉండి ఉంటే వారి హయాంలో చేసిన మంచి చెప్పవచ్చు. లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపవచ్చు. అవి ప్రభుత్వ విధానాలు, నైతిక ప్రవర్తన, ప్రభుత్వ పనితీరు, పారదర్శకత, అవినీతి అన్నీ సబ్జెక్ట్‌లు అవుతాయి. ఏవైతే వాస్తవాలు కావో వాటినే తీసుకువచ్చి, ఒక కుట్ర ప్రకారం టీడీపీ ప్రచారం చేయడమే దుర్మార్గం. టీడీపీ వాళ్లు మాట్లాడేదానిలో ఆధారాలు ఉండవు. అన్నీ అభూతకల్పనలు, అవాస్తవాలు. వాటిని ఒకటికి వందసార్లు, రెండు వందల సార్లు చెప్పుకుంటూ వెళతారు. అవే నిజాలు అనేలా ప్రచారం చేసే ప్రయత్నాల్లో టీడీపీ వాళ్లు రెండు విషయాలు విస్మరిస్తున్నారు. 1. రాజకీయ పార్టీగా చేయాల్సిన పద్ధతుల విషయంలో పూర్తిగా టీడీపీ డీవియేట్ అయింది. 2. రాష్ట్ర ప్రజలను, ఓటర్లను కేవలం తప్పుదోవ పట్టించడం ద్వారా, ఎన్నికల్లో తమకు అనుకూలంగా తీర్పును తెప్పించుకోవచ్చనే భ్రమలో ఆ పార్టీ కొట్టుకుంటోంది. గత కొంతకాలంగా టీడీపీ వాళ్ల ఆరోపణలు చూస్తే ఎవరికైనా ఇదే అర్థం అవుతోంది. బాబుకు ప్రజల పట్ల బాధ్యత లేదు 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, దాన్ని నిలుపుకునేందుకు చంద్రబాబు నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజలకు చేయాల్సిన వాటిలో వంద శాతం కాకపోయినా, కనీసం పదిశాతం పనులు చేసి మళ్లీ తీర్పు కోరతారేమో అనుకున్నాం. ఇచ్చిన హామీలు అన్నీ తుంగలోకి తొక్కి తాను మారని చంద్రబాబు నాయుడేనని మరోసారి రుజువు చేసుకున్నారు. రైతులకు లక్షకోట్ల రుణమాఫీ చేస్తానని ఎప్పటిలానే రైతులను మోసం చేశాడు. . చచ్చీచెడీ అయిదేళ్లలో 14వేల కోట్లు చెల్లించారు. మిగిలిన 600హామీలను తుంగలోకి తొక్కేశారు. చేసిన అప్పులతో పాటు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు రూ.4లక్షల కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళ్లిపోయాడు. ప్రజల పట్ల బాధ్యత లేదని అర్ధం అవుతోంది. - వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 95శాతం పైగా అమలు చేయడంతో, తన నిబద్ధతను నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ప్రకటించడం, భవిష్యత్‌లో అలా ఉండనని చెప్పడం, ఇంతకన్నా భిన్నంగా ఉంటామని చెప్పడం మానేసి... ఈ మూడేళ్లలో తిట్లు, బూతు పురాణాలతో కాలం గడుపుతున్నారు. ఎన్నికలు రావడానికి ఇంకా రెండేళ్లు సమయం ఉంది. దాంతో పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోయి చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నాయకులు రోజుకు ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ... ఎక్కడో మొదలుపెట్టి దాన్ని ఎక్కడికో ముడి పెడుతున్నారు. ఆధారాలతో సహా వస్తారా.. అంటే అదీ లేదు. జగన్ గారి మీద ఉన్న కోపం, ద్వేషంతో ప్రభుత్వాన్ని క్రిమినల్ గా చూపిస్తారా..? సీఆర్‌డీయే మీద అలాగే రాద్ధాంతం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు టీడీపీకి ముద్దుగా అనిపిస్తాయి. మా ప్రభుత్వం అక్కడ రాజధానితో సంబంధం లేకుండా అభివృద్ధి చేసే పనుల్లో భాగంగా, లేఅవుట్లను డెవలప్ చేయడానికి వనరులను సమకూర్చుకునేందుకు అదే పనిచేయబోతే వెంటనే, అక్కడేదో ఘోరాలు జరిగిపోతున్నట్లు, మోసం జరుగుతున్నట్లు రంకెలు వేయడం టీడీపీ అండ్ కో కు పరిపాటిగా మారింది. అమరావతిలో సీఆర్డీఏ ఎకరా 10 కోట్లకు ఎలా అమ్ముతుందని అంటారు.. అమరావతి ప్రాంత అభివృద్ధికి సంబంధించి, బాబు ఇచ్చిన జీవోను ఆధారం చేసుకునే సీఆర్డీఏ ముందుకు వెళితే హాహాకారాలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే.. ఆరోజు మార్టిగేజ్ ముద్దు అయింది. ఈరోజు లే అవుట్లను అభివృద్ధి చేస్తుంటే.. ఇల్లు ఎక్కి గట్టి గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తున్నారు. రాజధాని ఎలాగూ ఇక్కడ ఉండదని లక్షసార్లు చెప్పాం. ఇదేమీ ఆషామాషీ కాదని, పొలిటికల్ విల్‌తో తీసుకున్న నిర్ణయం. కాన్షియస్‌గా ప్రజలందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికార వికేంద్రీకరణపై మేం నిర్ణయం తీసుకున్నాం. అమరావతి ప్రాంత అభివృద్ధిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం ఎక్కువ కమిట్‌మెంట్‌తో ఉంది. అది అణువణువునా రుజువు అవుతుంది. భూములు ఇచ్చిన రైతులు పట్ల కమిట్‌మెంట్‌తో ప్రభుత్వం ఉంది. యాన్యువిటీని 15ఏళ్లకు పెంచాం. ప్రభుత్వం ఏం చేస్తుందనేది అక్కడ ఉన్న రైతులకు, వ్యవసాయ కూలీల కుటుంబాలకు తెలుసు. అభివృద్ధి విషయానికి వస్తే రింగ్‌రోడ్డు వేయడం, కరకట్ట రోడ్ల విస్తరణ, లేఅవుట్ల అభివృద్ధి అనేవి జరుగుతున్నాయి. గత సర్కార్ చేసిన పనుల కంటే మేము మెరుగ్గా చేస్తున్నాం. మేము కొత్తగా జీవో ఏమీ విడుదల చేయలేదే? మీరు ఇచ్చిన జీవోను అమలు చేస్తుంటేనే మాకు తాటాకులు కట్టాలని చూస్తున్నారు. ఇక మద్యం విషయంలో అయితే మరీ దారుణం. మద్యంకు సంబంధించి చంద్రబాబు తలకాయలో ఉన్న విషాన్ని అంతా కుమ‍్మరించారు. మీకు అండగా ఉండే మీడియా దానికి ఆద్యం పోస్తోంది. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు.. చంద్రబాబు, టీడీపీ ప్రాణం ఎల్లో మీడియాలో ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 వాళ్లే అజెండాను ఫిక్స్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.డిస్టలరీల కెపాసిటీ పెంచుతూ అనుమతులు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. కొత్తగా ఒక్క డిస్టలరీ కూడా జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక రాలేదు. అయినా సరే ఏపీలో మద్యంలో విషం తయారు అవుతుందంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అధికారంలోకి రావాలంటే వేరే మార్గాలు ఉంటాయి. ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి రావాలి. అంతే తప్ప వైయస్సార్ సీపీ మీద, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి మీద ఉన్న కోపం, ద్వేషం తీర్చుకునేందుకు ప్రభుత్వాన్ని ఒక క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఇవాళ ఒక పార్టీ ఉంటే, రేపు మరోక పార్టీ రావచ్చు. అయితే ప్రభుత్వం అనేది ఒక నమ్మకం మీద నడుస్తోంది. ఆరోజు ప్రమాణాలు, ఇవాళ ప్రమాణాల్లో తేడా ఏమీ లేదు. మినరల్ వాటర్‌కు అయినా, హెరిటేజ్ పాలకు అయినా, మిగతా వాటికైనా జాతీయ స్థాయి ప్రమాణాలే పాటించాలి. ఒక నమ్మకంతోనే సొసైటీ ముందుకు నడుస్తోంది. బాబు ఆత్రం.. ఎల్లో మీడియా ఆరాటం ఎంతసేపటికీ చంద్రబాబుకు మళ్లీ అధికారంలోకి రావాలనే ఆత్రం. దానికి మీడియా ఆరాటం కలిపి ఎంతవరకూ పోతుందంటే చివరకు వ్యవస్థ మీదే ప్రజలకు భయాందోళనలకు గురి చేసే విధంగా ప్రవర్తించడం బాధాకరం. అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు చెప్పడం చూస్తే బహుశా ప్రపంచంలో ఇలాంటి బరితెగింపు ఎక్కడా ఉండదేమో. బాధ్యతగల రాజకీయ పార్టీ ఇలా వ్యవహరించదు. బాధ్యతారహితంగా ఉండే మంద కూడా ఇంత ఛండాలమైన పని చేయదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వాన్ని ఒక క్రిమినల్‌గా చూపించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఆ వర్గపు ఎల్లో మీడియాకు ఎలాంటి బాధ్యత లేదు. జగన మోహన్ రెడ్డిగార్ని, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి, రంగులు వేసి మసిపూసి మారేడుకాయ చేయాలి అని చూస్తున్నారు. జనం ఎలా పోతే మాకేంటి... చంద్రబాబు నాయుడు అధికారంలో లేరనే విరహం, బాధతో అన్యాయమైన, దుర్మార్గపు దుష్ప్రచారాలను ఇంతవరకూ ఎవరూ, ఎప్పుడూ చూసి ఉండరు. - ల్యాప్‌టాప్‌లు మంగళం అని ఎల్లో మీడియాలో మరో వార్త రాశారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం అనేది ఆప్షన్. నగదు లేదా ల్యాప్‌టాప్ అనే ఆప్షన్ ఇవ్వడం తో వారికి నగదు ఇస్తే ల్యాప్‌టాప్‌లకు మంగళం అని రాస్తారా? కంప్యూటర్లు అడిషనల్‌గా ఇస్తామని ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నిస్తే అర్థం ఉంటుంది. వాళ్లు విషం ఎలా కక్కుతున్నారో ప్రజలకు అర్థం కావడానికి చెబుతున్నాం. ట్యాబ్ లు అడిషనల్‌గా ప్రభుత్వం ఇస్తోంది. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ కోసం, మా ప్రభుత్వం రూ.500కోట్లు అదనంగా ఖర్చు పెడుతోంది. అదే చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా స్పష్టమైన వైఖరితో ఇలాంటి నిర్ణయం ఏనాడైనా తీసుకున్నారా? టీడీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ డొల్లే.. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కాంట్రాక్టర్ ఎక్స్‌టెన్షన్, కాంట్రాక్టర్ కు ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీలు, లోన్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపారు. అలాగే కాంట్రాక్టులు అన్ని క్యాన్సిల్ చేసి జీవో విడుదల చేసి వాళ్ల వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికి జీవోలు విడుదల చేశారు. టీడీపీ ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయాలు అన్నీ ఇలాంటివే తప్ప పేదలకు సంబంధించి కానీ, పేద కుటుంబాలకు సంబంధించినవి కానీ ఏమీలేవు. ఉన్నా అవన్నీ డొల్లనే. - ముఖ్యమంత్రిగారు దావోస్ వెళ్లి వచ్చి నెల తిరక్క ముందే మన పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు వారికి అవసరం అయిన కంటెంట్ అందించేందుకు బైజూస్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ పెట్టుబడిని మన పిల్లల భవిష్యత్ మీద పెట్టుబడిగా భావిస్తూ ముఖ్యమంత్రిగారు వెంటనే ఓకే చేసి అమలు చేస్తున్నాం. ఇది సరైన నిర్ణయం. దాన్ని ఏమీ అనాలో తెలియక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. అమ్మ ఒడి పథకం అమలు మీద కూడా అంతే. మొదలు పెట్టినప్పటి నుంచీ ఇప్పటికీ 75 శాతం హాజరును తప్పనిసరి చేయడంతో ఏదో జరిగిపోయిట్లు టీడీపీవాళ్లు గగ్గోలు పెడుతున్నారు. అంతా చూస్తే 50వేలమందికి తేడా వచ్చింది. ఇన్ని లక్షల మందికి ఇచ్చిన ప్రభుత్వం 50వేలమందికి ఇవ్వకుండా పోవడం వల్లే ఏమి సేవ్ చేసుకుంటుందనే ఆలోచన ప్రజలకు వస్తుంది కాబట్టి సుమారు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.15వేలు నేరుగా వేస్తుంటే ఆ లబ్ధి జగన్ మోహన్ రెడ్డి గారికి వస్తుందనే దుగ్దతో, మొత్తం మోసం అంటూ వేలెత్తి చూపిస్తోంది. ఇలాంటివాళ్లను ఏమనాలి?. అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టింది జగన మోహన్ రెడ్డిగారే. అమలు చేస్తుంది ఆయనే. ఏ అర్హతలు లేకుండా పథకం అమలు చేయలేం కదా. శాచురేషన్ విధానంలో పథకాలు అమలు కోవిడ్ సమయంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఫస్ట్‌టైమ్ ఇంప్లిమెంట్ చేశాం. కొంత తేడా వచ్చింది. సంక్షేమ పథకాల అమలులో అర్హతలకు సంబంధించినంత వరకూ మీ హయాంలో కంటే మేము విస్తృతం చేశాం. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఎలా అందించాలా అని మా ముఖ్యమంత్రిగారు ఆలోచించబట్టే లబ్దిదారులు ఎక్కువమంది వస్తున్నారు. శాచురేషన్ బేసిస్ మీద ఇప్పుడు 62 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం. ఇంత జరుగుతుంటే అమ్మ ఒడిలో 50వేలమందికి అన్యాయం జరిగిదంటూ రెండు రోజుల పాటు ఎల్లో మీడియాలో బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టి ముంచేశాడంటూ అడ్డగోలు రాతలు రాశారు. ఒక విద్యార్థి వంద శాతానికి పరీక్షలు రాస్తే, అతడికి 99 శాతం మార్కులు వస్తే 99శాతం వచ్చిందంటారా? వంద రాలేదు అని అంటారా? చంద్రబాబు కూడా ఆ కోవకు చెందినవాడే. - 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు, టీడీపీ అనుకూల మీడియా మాత్రం మిగిలిపోయిన 5 శాతం ఎందుకు తెచ్చుకోలేదు... ఫెయిల్ అంటూ విమర్శలు చేస్తున్నారు. సున్నా కంటే మైనస్ వచ్చినవాడు పాస్ అట... అతడిని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవాలట. అదే వందకు 99శాతం వచ్చిన అతడిని ఆ ఒక్కశాతం రాలేదని ఫెయిల్ అట. మా మూడేళ్ల పాలనలో 95శాతం మాత్రమే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశామని మేమే చెప్పుకుంటున్నాం. ఆ 95శాతమే ఎందుకు వచ్చిందంటే ప్రాక్టికల్‌గా అమలు చేసే విషయంలో కొన్ని ఇబ్బందులు రావడం వల్లే, కొంత సమయం పట్టవచ్చు. అయిదు శాతం ఇంకా మిగిలిపోయాయి కదా ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ కానీ, వాళ్ల మౌత్ పీస్‌గా తయారు అయిన ఎల్లో మీడియాగానీ.. రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు, లేదా ఫెయిల్ అయింది, మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అధికారం ఉన్నట్లు, ఆయనను అర్జెంట్‌గా అధికారంలోకి తీసుకురావాలంటూ, వారి కోరికను ప్రజల తలల్లోకి ఎక్కించే విష ప్రచారం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ ఇద్దరికీ అదీ తేడా.. రాష్ట్రంలో ఇద్దరు లీడర్లు ఉంటే.. ఒకాయన 70ఏళ్లు దాటిన చంద్రబాబు నాయుడు, ఆయన పరిణితి కలిగినట్లు వ్యవహరించాలే కానీ, మతి చలించినట్లు ప్రవర్తించడం సరికాదు. యువకుడుగా ఉండగానే అన్ని కష్టాలు పడుతూ తండ్రిని మించిన తనయుడిగా కనిపించాలని తొలిసారి ముఖ్యమంత్రి కాగానే దేశమంతా ఏపీని చూసేలా అద్భుతమైన పాలన ఇస్తూ భవిష్యత్‌లో ఒక కొలమానంగా తనకు తాను పరీక్ష పెట్టుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. కోవిడ్ సమయంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ నిబద్ధతతో పని చేస్తున్నారు. టీడీపీ వాళ్లు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తూ ఏదో జరగాలి, తమకు సానుభూతి రావాలనేలా చేస్తున్నారు. వాళ్లు ఎంత రెచ్చగొట్టినా నిబ్బరంతో, నిబద్ధతతో వ్యవహరించాలని మేమున్నాం. టీడీపీ జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయాలని చూస్తే... మా పార్టీ మాత్రం ప్రజలు క్లారిటీతో ఆలోచించాల్సిన ఇన్‌పుట్‌ను వారి ముందు ఉంచాలని మేము చూస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టే ధైర్యంగా గడప గడపకు వెళ్లగలిగాం. అదే మీ హయాంలో టీడీపీ నాయకులు ఎందుకు ప్రజల దగ్గరకు వెళ్లలేకపోయారు? - టీడీపీ చేసే అబద్ధపు, విషప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజల ముందుకు వెళ్లాలి. ప్రజల సమస్యలు ఉంటే తీర్చి ... మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి. ఇంతకు మించిన పరిష్కారం లేదని, ఇంతకు ముందెప్పుడు లేనివిధంగా ఏ పార్టీ అధ్యక్షుడు చెప్పని విధంగా జగన్ మోహన్ రెడ్డిగారు ధైర్యంగా, దీమాగా చెప్పి ప్రజల ముందుకు పంపించారు. సమస్యలు తీర్చడానికే కదా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఉంది. ప్రతిపక్షం ఉంది విమర్శలు చేయడానికి, పిచ్చిక్కినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ తిరస్కరించడం ఖాయం. - గతంలో ఎక్కడా లేనివిధంగా రికార్డు స్థాయిలో అప్పటి ప్రభుత్వం చేసిన బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. డ్వాక్రా రుణాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సున్నా వడ్డీ, పవర్ సబ్సిడీ బకాయిలను మేము చెల్లించడం జరిగింది. పంటల బీమా, నష్టపరిహారం ఇలా అన్నింటిని చంద్రబాబు ఎగ్గొట్టి వెళ్లాడు. అదే మా ప్రభుత్వం సీజన్ ప్రకారం రైతులకు చేర్చాల్సినవన్నీ చేర్చాలనే నిబద్ధతతో పనిచేస్తోంది. పంటల బీమాను రూ.6 వేలకోట్లుకు పైగా విడుదల చేయడం జరిగింది. ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు చేరేలా మేము చేస్తుంటే తాటాకులు కట్టేలా చేస్తున్నారు. - ఆదాయం వస్తుంది, సంక్షేమ పథకాలకు వెళుతోంది. సంక్షేమ పథకాలు ఆగిపోతే జగన్‌గారికి ఊపిరి ఆడకూడదనే దుగ్ధతో టీడీపీ కుట్రలు పన్నుతుంది, ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తుంది. టీడీపీ హయాంలో స్కీమ్‌లను స్కాములుగా మార్చారు. మీరు పేరుకు పది స్కీములు చెప్పినా.. వాటిపై ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా? అన్న క్యాంటీన్లతోనే రాష్ట్రం అంతా నాలుగున్నర కోట్ల మంది బతికినట్లు నారా లోకేష్ చెప్పడం విడ్డూరం. 189 క్యాంటీన్లు పెట్టి 200 కోట్ల స్కాం చేశారు. చంద్రన్న బీమా, తోఫా.. విదేశీ విద్యతో సహా.. టీడీపీ పథకాలన్నీ డొల్ల. ప్రజలకు వాస్తవం తెలుసు. రంగుల మీద మమ్మల్ని విమర్శలు చేయడం కాదు. మీరు టాయ్‌లెట్లు, శ్మశానాలకు కూడా ఎల్లో కలర్ పూశారు. నీరు-చెట్టు పథకంలో ఎన్నివేల కోట్లు అవినీతి జరిగిందో అందరికీ తెలుసు. టీడీపీ హయాంలో రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. అందులో 3 లక్షల కోట్లు కమీషన్లకే పోయి ఉంటాయి. టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం ఎలా ఉందంటే.. చంద్రబాబు అధికారంలో ఉంటే... ప్రపంచం అంతా సుందరంగా ఉంటుంది. ఆయన అధికారంలోకి రాకపోతే.. అసిడిటీ, అల్సర్స్ ఫామ్ అయి కడుపు మంటతో రగిలిపోతుంటారు. జగన్ మోహన్ రెడ్డిగారు రాష్ట్రంలోని అయిదుకోట్ల మంది ప్రజలు సుఖశాంతులతో జీవించేలా పనిచేస్తున్నారు. ఈ తేడాను ప్రజలంతా గమనించాలి. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. - చేసిన పనులకు సంబంధించినంతవరకు కార్యకర్తలకు రావాల్సిన బిల్లులు రాలేదు, పార్టీ సానుభూతిపరులకు బిల్లులు రాలేదంటే అది ఓపెన్ ఫ్యాక్టే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అభివృద్ధి ఫలాలను నేరుగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడులా ఆలోచించినట్లు నా వర్గం, నా సిస్టమ్ అనేలా ఆలోచన చేయనందువల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ వైయస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు కష్టపడుతున్నారు. ప్రజలకు మేలు చేయాలనే తమ నాయకుడి లక్ష్యంలో భాగంగా తాము ఇబ్బందులు పడుతున్నారనే వాస్తవం ప్రజలకు తెలుస్తోంది. అది వాస్తవం కూడా. అందులో దాపరికమేమీ లేదు. - పార్టీ కానీ, జగన్ మోహన్ రెడ్డిగారి విధానం కానీ ప్రజలే అల్టిమేట్. కేవలం రాజకీయం కోసమే అయితే... ఓట్లు కోసం, సీట్లు కోసమే అయితే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. జగన్ గారి సంక్షేమ అభివృద్ధి పరిపాలన వల్ల ఎవరి బతుకు బాగుపడుతుందో వారందరికీ తెలుస్తుంది. జగన్‌గారి వల్ల ఎవరు బాగుపడ్డారో.. అది క్షేత్రస్థాయిలోకి వెళ్లేంతవరకూ పనిచేస్తున్నాం. ఇదే మా విధానం. మాకు మా కార్యకర్తలకు అర్థం అయింది. ఆవిధంగానే నడుస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డిగారి ఆలోచన విధానమే పార్టీ ఫిలాసఫీ. చంద్రబాబుది మీడియా మేనేజ్ మెంటు. చంద్రబాబు బ్యాచ్ మాత్రం అధికారంలో ఉన్నా, లేకపోయినా సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ బాదుతూనే ఉన్నారు. - ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయంపై టెక్నికల్ సమస్య అని నిన్ననే ప్రభుత్వం తరఫున అధికారులు చెప్పడం జరిగింది. అలాగే కాగ్, ఆర్‌బీఐ నుంచి లేఖలు రావడం అనేది ఆనవాయితీ. అయితే చంద్రబాబు అధికారంలో లేరనే దుగ్ధతో వ్యవస్థ పైనే నమ్మకం లేకుండా చేసేలా ప్రచారం చేయడం దురదృష్టకరం. ఉద్యోగులకు సంబంధించి, ఏ ప్రభుత్వం అయినా, 800 కోట్లు అలా తీసుకుని ఎగ్గొట్టగలదా..?. ఇదేమైనా చిట్ ఫండ్ కంపెనీనా..? లేక మార్గదర్శి ఫైనాన్స్ కంపెనీనా.. ?. చంద్రబాబు అధికారంలో లేడనే దుగ్ధతో వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అది టెక్నికల్ ప్రాబ్లమ్. ఉద్యోగుల డబ్బులు రూ. 800 కోట్లు తీసుకుని ఎవరైనా తప్పించుకోగలరా..? అధికారంలో ఎవరు ఉన్నా.. ఇంత పైశాచికత్వం ఎక్కడా ఉండదు. ప్రైవేటు సంస్థలు అయితే బోర్డు తిప్పుతాయి.. ఇది ప్రభుత్వం. - ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేయాలని, రాష్ట్రం ఆర్థికంగా ఎత్తిపోయిందని, ఎమర్జెన్సీ వచ్చిందని నోటికొచ్చినట్లు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని టీడీపీ దుష్ప్రచారం చేస్తుంది. - రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే.. వాటిని జనరలైజ్ చేసి, చంద్రబాబు అధికారంలో లేకపోతే.. రాష్ట్రమంతా అంధకారం అయిపోయిందన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేం వచ్చాక వరుసగా మూడేళ్ళపాటు కంటిన్యూగా వర్షాలు.. దాంతో రోడ్లు బాగు చేయడం కుదరలేదు, ఇప్పుడు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి, రోడ్లు అన్నీ బాగు చేస్తున్నాం. - ఎవరైనా ఫేక్ .. ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తే.. చట్టం తన పని తాను చేస్తుంది. ఇదే టీడీపీ హయాంలో లెక్కలేనన్ని కేసులు పెట్టారు. మీరు చేస్తే కరెక్టు.. మేం చేస్తే తప్పా..? - పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ చంద్రబాబు వల్లే .. కొట్టుకుపోతే ఆ విషయాన్ని కప్పిపెట్టి, ఈనాడు పత్రికలో అన్ని అబద్ధాలు.. కట్టుకథలు అచ్చేశారు. తప్పు చేసిన చంద్రబాబు మీదే అంతా కంప్లైంట్ చేయాల్సి ఉంటే.. ఉల్టాగా ఆయనే కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాడు.. ఇదీ టీడీపీ నీచ రాజకీయం అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు.