బాబుపై ఈనాడు 'చిన్నచూపు'!!??

టీడీపీ కరపత్రికలు అని బాహాటంగానే తెలిసిన పత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతీ పోటీ పడుతుంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
చంద్రబాబు నాయకుడిగా ఎదిగేందుకు ఇతోధిక సాయం చేసింది ఈనాడైతే, ముఖ్యమంత్రి అయ్యినప్పటి నుంచీ అనుకూలమైన కలంగా పనిచేస్తున్నది ఆంధ్రజ్యోతి అని అంటారు. 
బాబును అన్ని విషయాల్లోనూ ఆకాశంలోకెత్తడమే ఈ రెండు పత్రికల ప్రధాన అజెండా. 
దాదాపుగా టీడీపీకీ, చంద్రబాబుకు భజన పత్రికలుగా ఈ రెండూ పేరుపడ్డాయి. 
బాబు తుమ్మినా దగ్గినా బ్యానర్ ఐటమ్‌ లు రాసి మరీ ప్రాధాన్యత ఇచ్చే ఈ రెండు పత్రికలు అత్యంత ముఖ్యమైన ఒక విషయంలో మాత్రం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.
అమరావతి పేరు రాసేటప్పుడు అమెరికా రాజధాని అంత బిల్డప్ తో గ్రాఫిక్ ఫొటోలూ, అంతులేని తేజస్సుతో బాబు ఫొటోలూ ముద్రించే ఈ పత్రికల్లో చంద్రబాబుకు చెందిన అత్యంత ప్రధాన వార్తకు సింగిల్ కాలమ్ స్పేస్ కూడా దక్కకపోవడం విచిత్రం. 
14 ఏళ్ల నాడు చంద్రబాబు మీద లక్ష్మీపార్వతి వేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు నేటికి మోక్షం కలిగింది. 
14 ఏళ్ల క్రితం బాబు హైకోర్టుకెళ్లి తెచ్చుకున్న స్టే ఇప్పుడు తొలిగింది. ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం సుప్రీం నిర్దేశాలకనుగుణంగా స్టే ని తొలగించి బాబుపై విచారణ చేపడుతున్నట్టు ప్రకటించింది. 
మరి ఇంత పురాతనమైన, ప్రాధాన్యమైన వార్తను మాత్రం ఈనాడు కనీసం నారా చంద్రబాబు నాయుడు ఫొటో కూడా వేయకుండానే ప్రచురించింది. ఈ విషయాన్ని ప్రచురించాల్సిన అవసరం కూడా లేదనుకుంది ఆంధ్రజ్యోతి. 
బాబుకు కంటిమీద కురుపేస్తే కవర్ పేజీ కథనాలు ఇచ్చే ఈ రెండు పత్రికలు బాబు మీద వచ్చే అవినీతి ఆరోపణలు, టీడీపీ అధినాయకుడికి ప్రతికూలంగా ఉండే వార్తలూ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాయి.
రాష్ట్రం అధోగతి పాలౌతుంటే, అప్పుల ఊబిలో మునుగుతుంటే, ఖజానా బాబు ఫ్యామిలీ దుబారాలకు ఖర్చైపోతుంటే, రాజధాని పేర దోపీడీలౌతుంటే, రాష్ట్రంలో ప్రజలకే రక్షణ లేకుండా పోతుంటే కూడా నోరెత్తని పత్రికలివి. 
పైసా పెట్టుబడి రాని సదస్సులను, రూపాయి లాభం లేని విదేశీ ప్రయాణాలను, పూర్తి కాని పోలవరాన్నీ, కట్టని రాజధానిని కూడా ఆహా ఓహో అంటూ ప్రచారం చేసేందుకు పేజీలకు పేజీలు కేటాయించాయి ఈ బాబు బాకా పత్రికలు. 
మోదీతో తాడో పేడో అంటూ బాబును ఓ పెద్ద యోధిడిలా కౌటౌట్లు పెట్టి చిత్రీకరించాయి. ఢిల్లీతో ఢీకొట్టిన వీరుడని పొగిడాయి. 
ఇక వివరం, విజ్ఞానం రెండూ రేని లోకేష్‌ ని సైతం గొప్ప యువనాయకుడిలా నిలబెట్టాలని నానా తిప్పలూ పడ్డాయి. చివరికి ప్రజలు ఈ పత్రికల అక్షరాలపై అపనమ్మకం, రాతలపై రోతతో ఎన్నికల్లో తమ విజనేంటో చూపించనే చూపించారు. 
అయినా సరే సన్నాయి డోలు పత్రికల తీరు మాత్రం మారలేదు. 
అధికారానికి ఆమడదూరంలో పడ్డ కుల నాయకుడి కోసం తాపత్రయ పడుతూనే ఉన్నాయి.
బాబుచేసే పనికి మాలిన పసలేని ఆరోపణలని, విమర్శలనీ వికృతంగా ప్రచారం చేసే బాధ్యతని ఇప్పుడు యజ్ఞంలా నిర్వహిస్తున్నాయి. 
అదే సమయంలో పచ్చపార్టీ నాయకుడి అక్రమాల చిట్టాలపై మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తాయి. బాబు అవినీతి కథనాలను, అన్యాయాల సాక్షాలనూ బహుజాగ్రత్తగా మరుగుపరుస్తాయి. 
ఈ పసుపు పత్రికల అసలు రంగు ఏమిటో ప్రజలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. బాబు అక్రమాల గుట్టుపై ఈ పత్రికల చిన్నచూపు రాష్ట్ర ప్రజల దృష్టిని మాత్రం దాటిపోలేదు. 

 

Read Also: అనారోగ్యం వల్లే అయ్యప్ప దీక్షలో చెప్పులు ధరిస్తున్నా

Back to Top