ఏపీలో పోలీసు వ్య‌వ‌స్థ నిర్వీర్యం 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి
 

న్యూఢిల్లీ: ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో రాజకీయ హత్యలు, విధ్వంసాలపై వైయ‌స్ఆర్‌సీపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గళం విప్పింది. ఈ ధర్నాలో పాల్గొన్న  సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో అరాచకం తాండవిస్తోంది. రాష్ట్రంలో 31 హత్యలు జరిగాయి. వెయ్యికిపైగా దాడులు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు కూడా చేశారు ఏపీలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారు.   నిన్న కూడా వైయ‌స్ఆర్‌సీపీ నేతపై దాడి జరిగింది. ఏపీలో టీడీపీ నేతలు అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తున్నారు.. ఈ అరాచకాలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకే ధర్నా చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. 

రాష్ట్ర‌పతి పాల‌న విధించాలి:  మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రతీకార రాజకీయాలు తారాస్థాయికి చేరాయ‌ని, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌రువైంద‌ని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు విమ‌ర్శించారు. ఇటీవ‌ల వినుకొండ‌లో జ‌రిగిన దారుణ హ‌త్య దేశ‌మంతా చూసింద‌ని గుర్తు చేశారు. గతంలో.. ఎన్నడూ ఇలాంటివి జరగలేదు. గత ఐదేళ్లు శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది అవి క్షీణిస్తూ వచ్చాయి. చంద్రబాబు రాష్ట్రంలో చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ కేడర్‌ను ఉసిగొల్పి రాష్ట్రంలో నరమేధాన్ని సృష్టిస్తున్నారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్యకర్తలు, సానుభూతిపరులు.. ఆఖరికి ఓట్లు వేశారన్న కారణంగా కూడా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనపై ఢిల్లీ వేదిక‌గా నిరసన గళం విప్పి ఏపీ ప‌రిస్థితుల‌ను వివ‌రించాల‌ని ఇవాళ ధ‌ర్నా చేస్తున్నాం. రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తేనే ప్ర‌జ‌లు నెమ్మ‌దిగా జీవిస్తార‌ని మాజీ మంత్రి అంబ‌టి పేర్కొన్నారు. 

ఏపీలో 31 హత్యలు జరిగాయి : మాజీ మంత్రి పుష్ప‌శ్రీ‌వాణి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఇప్ప‌టి వ‌ర‌కు 31 హ‌త్య‌లు జ‌రిగాయ‌ని మాజీ మంత్రి పుష్ప‌శ్రీ‌వాణి పేర్కొన్నారు. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ధర్నా చేస్తున్నామ‌ని చెప్పారు. 300 హత్యాయత్నాలు, 560 ప్రైవేట్‌ ఆస్తులు ధ్వంసం చేశారు. 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు,ఏపీ పరిస్థితులు దేశ ప్రజలకు తెలిసేందుకే ధర్నా చేప‌ట్టిన‌ట్లు పుష్పశ్రీవాణి తెలిపారు.

Back to Top