తాడేపల్లి: ఏపీ పారిశ్రామిక రంగాభివృద్ధిలో.. ఇవాళ మరో కీలక అడుగు పడింది. ఆహార శుద్ధి పరిశ్రమలను క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. మొత్తం 13 ప్రాజెక్టుల ద్వారా దాదాపు రూ.2,851 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే.. 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఏడు ప్రాజెక్టులకు సీఎం వైయస్ జగన్ భూమి పూజతో పాటు మరో ఆరు ప్రాజెక్టులను ప్రారంభించారు. 1. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం. పెట్టుబడి రూ.800 కోట్లు. ఉపాధి... దాదాపు 1050 మందికి ఉద్యోగ అవకాశాలు. ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్ధాపన చేసిన యూనిట్ల వివరాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్. అనంతపురం జిల్లా డి.హీరేలాల్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటు కానున్న ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శ్రావణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్. రూ.225 కోట్ల పెట్టుబడి. 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. శ్రీకాకుళం జిల్లా రణస్ధలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్( ఎన్‌ఏసీఎల్) కంపెనీ. బయో ఫెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ప్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో ఏర్పాటు కానున్న యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి. 6. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. ఈ యూనిట్ ద్వారా సుమారు 1000 మందికి ఉపాధి. 7. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. ఈ యూనిట్ ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రారంభోత్సవం, శంకుస్ధాపన చేసిన సీఎం 2 యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం. 1. తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాకోలేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కోకో బట్టర్, కోకో పౌడర్ ఉత్పత్తులు యూనిట్ ప్రారంభం. రూ. 325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగఅవకాశాలు. ఏడాదికి 40వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. వైయస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్. రూ. 4 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు. బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు మేలు. 3 పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు వర్చువల్‌గా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి, 1 ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ. 1. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం, మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇనిస్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం. 175 మందికి ఉపాధి అవకాశాలు. ఇన్‌స్టంట్ చట్నీలు, పౌడర్లు తయారు చేయనున్న కంపెనీ. రూ. 50 కోట్ల పెట్టుబడి. 175 మందికి ఉద్యోగాలు, ఏడాదికి 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి, 1000 మంది రైతులకు ప్రయోజనం. 2. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం, కొడవటిపూడి గ్రామంలో అరకు కాఫీ తయారీ యూనిట్‌ను ఏర్పాటుకు వర్చువల్‌గా శంకుస్ధాపన చేసిన సీఎం. రూ.20 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు, 200 మందికి ఉద్యోగ అవకాశాలు. దాదాపు 1000 మంది గిరిజన రైతులకు చేకూరనున్న లబ్ధి. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 3. రూ. 65 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు వర్చువల్‌గా శంకుస్ధాపన చేసిన సీఎం. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్ములమడుగు, ఆదోని, నంద్యాల, కదిరిలలో యూనిట్లు ఏర్పాటు. 4. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం, అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు. ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కదుర్చుకున్న 3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈఓ శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ప్యాక్టరీ ద్వారా సుమారు 1500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం. 25వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు ఉపయోగకరం. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే...: ఈ రోజు దాదాపుగా 13 యూనిట్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేసుకున్నాం. ఇందులో ఒకటి ఎంఓయూ కూడా ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో భాగంగా విశాఖపట్నంలో ఆ రోజు పరిశ్రమలు నెలకొల్పేందుకు.. దాదాపు 386 ఎంఓయూలు, రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు, దానిద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అవన్నీ సాకారం కావాలని.. ప్రతినెలా వాటిని కార్యరూపం దాల్చేలా.. అవి అమలు కావాలన్న ఉద్ధేశ్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా ఏర్పాటు చేసి..పారిశ్రామిక వేత్తలను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగా భావించి.. పారిశ్రామిక వేత్తలను చేయిపట్టుకుని నడిపించి ఆఎంఓయూలను కార్యరూపం దాల్చే విధంగా చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన 13 శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇందులో 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్ధాపన చేస్తున్నాం. ఒక ఎంఓయూపై సంతకాలు కూడా చేశాం. దాదాపుగా రూ. 3008 కోట్ల పెట్టుబడితో దాదాపు 7వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే బృహత్తర కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టాం. 14 జిల్లాల్లో వస్తున్న ఈ పరిశ్రమల వల్ల సుమారు 7వేల మందికి పైగా అక్కడ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. 75 శాతం స్ధానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల... స్ధానికులందరూ ఈ పరిశ్రమల ఏర్పాటుకు మద్ధతు పలికి, స్వాగతించే విధంగా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల ఈ పిల్లలకు ఆరునెలల నుంచి గరిష్టంగా 18 నెలలులోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు కూడా రానున్నాయి. అప్పటిలోగా ఈ పరిశ్రమలు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లు ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలిన 9 శంకుస్ధాపన చేశాం. ఇవన్నీ కూడా ఆరునెలల నుంచి ఏడాదిన్నరలోనే పూర్తవుతాయి. ఇవాళ ఎంఓయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నర లోగా అందుబాటులోకి రానుంది. ఈ రోజు జరిగిన అన్ని కార్యక్రమాల వల్ల అందరి యాజమాన్యాలకు, ఉద్యోగులు అందరికీ మనసారా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మద్ధతు ఇచ్చే విధంగా.. నాలుగు మాటలు చెబుతాను. మీకు ఏ సమస్య ఉన్నా...మేం మీకు ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొండి. అధికారయంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. అందరికీ మనస్ఫూర్తిగా చెబుతున్నాం. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తుంది. జిల్లాల కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్నల్ని చేయిపట్టుకుని నడిపించేందుకు మీ పట్ల సానుకూలంగా ఉన్నాం. ఇంతవరకు కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ ఈ పనిలో విశేషంగా కృషి చేసి, వీటిని కార్యరూపం దాల్చేలా చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. పారిశ్రామిక వేత్తల పట్ల అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీ అందరికీ మరోక్కసారి అభినందనలు అని సీఎం ప్రసంగం ముగించారు.