పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!

ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు

 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో  పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. 

ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై  వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు  అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.

తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను  జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. 

మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం  కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు  విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై  ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.

2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు  పెట్టారు. 

ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే  వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక  పోలీసు అధికారులు  కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ  విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ  కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న  మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో  విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా  సిట్ బృందం వదలి వేసింది. 

ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు  బెయిల్ పొందిన ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారించారు.  ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్  కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై  ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన  ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు  రాశారు. 

నిజంగానే అలా వెళ్లదలిస్తే  నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా  చెన్నై వెళ్లి  విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న  ప్రశ్నకు జవాబు  దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన  అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. 

అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది.  అంటే  దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు  అండ్ కో ఇచ్చిన  సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు.

 ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన  వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే  భవిష్యత్తులో  తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని  చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!

- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్‌ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Back to Top