తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితులను వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హెంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్నవారినే తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా? అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా? అని పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం పేర్నినాని తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకుల తీరు ఎలా ఉండేది, ఎలాంటి ప్రగల్భాలు పలికారు.. ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అనేలా ఉంది. మేం అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని, రాష్ట్రం శ్రీలంకగా మారిపోయే ప్రమాదం ముంచుకొచ్చిందని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు పెద్ద ఆర్థికవేత్త అన్నట్టు, ఆయన రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు అనే రీతిలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 విపరీతంగా ప్రచారం చేశాయి. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు, సంపద సృష్టిస్తారని, జగన్ చేసిన అప్పులు కూడా తీరుస్తారని జాకీలు పెట్టి లేపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మోసపు మాటలు, చెప్పిన అబద్ధాలు నమ్మి ప్రజలు ఓటేస్తే ఏడాది తిరక్కుండానే నిలువునా ముంచేశారు. ఎవరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టారు. అప్పులు చేయడంలో వీరు ఎంత సిద్ధహస్తులంటే 2014లో రాష్ట్రం అప్పులు రూ. 1.40 లక్షల కోట్లుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీల నేతృత్వంలోని ప్రభుత్వం 2019లో దిగిపోయేనాటికి రూ.2.57 లక్షల కోట్ల అప్పులు చేసింది. గతం కన్నా తన ఐదేళ్ల పాలనతో చంద్రబాబు అప్పులు 22.50 శాతం పెరుగుదల నమోదు చేశారు. వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ. 3.32 లక్షల కోట్లు. చంద్రబాబు హయాంలో అప్పుల్లో 22.50 శాతం పెరుగుదల ఉండగా, జగన్ హయాంలో కేవలం 13 శాతం మాత్రమే నమోదైంది. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అప్పుడు రూ. 1.03 లక్షల కోట్లు కాగా, ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు మరో రూ. 44 వేల కోట్ల పైచిలుకుపైనే ఉంది. ఏడాది కూడా పూర్తి కాకుండానే రూ. 1.47 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనమైన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానిది. వైయస్ జగన్ రూ. 3.32 లక్షల కోట్లు అప్పులు చేస్తే అందులో 2.75 లక్షల కోట్లు డీబీటీల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేయడం జరిగింది. మరో రూ. 30 వేల కోట్లు కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఖర్చు చేయడం జరిగింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగింది. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్‌లు నిర్మాణంతోపాటు నాడు-నేడు ద్వారా 40వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లను నవీకరించడం, శరవేగంగా పోర్టుల నిర్మాణం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించడం జరిగింది. వైయస్ జగన్ చేసిన ప్రతి రూపాయి అప్పు కళ్ల ముందే కనిపిస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన రూ. 1.47 లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారో అర్థం కావడం లేదు. ఎవరూ చెప్పడం లేదు. అదేమని అడిగితే పింఛన్లు ఇచ్చామని చెప్పుకోవడం కన్నా సిగ్గుచేటైన విషయం ఉంటుందా? ప్రతినెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది? ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకోమని లోకేష్ చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చాక హామీలు చూస్తే భయమేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పి, గెలిచాక సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పమంటున్నాడు. కూటమి ప్రభుత్వం మరింత బరితెగించి అనైతికంగా ఏప్రిల్ 24న జీవో ఎంస్ నెంబర్ 69 రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1.91 లక్షల కోట్ల విలువైన 436 గనులు ఏపీఎండీసీ(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ)కి దాఖలు పరిచారు. ఈ ఆస్తుల ద్వారా దానికి రూ. 9,500 కోట్లు అప్పులు తెచ్చుకునేలా అనుమతులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరూ అనుమతులు ఇవ్వకుండానే ఆర్బీఐ నుంచి ప్రైవేట్ కంపెనీ నగదు డ్రా చేసుకోవడం అంటే రాజ్యాంగ విరుద్ధం కాదా? ఆర్టికల్ 203 ప్రకారం ఎవరు మంత్రిగా ఉన్నా డిమాండ్ ఫర్ గ్రాంట్‌కి అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టుకుంటారు. రాబోయే ఆదాయాన్ని చూపించి జగన్ అప్పులు చేశాడని నానా యాగీ చేసిన మీడియా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న అడ్డగోలు అప్పులు, అందుకు అనుసరిస్తున్న విధానాలపై నోరు విప్పడం లేదు. నాడు పొద్దస్తమానం డిబేట్లు పెట్టిన ఎల్లో మీడియా ఇప్పుడు నోరెత్తడం లేదు. వైయస్ జగన్ కన్నా మిన్నగా ఏపీ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తాం. అప్పులు చేయకుండా సంపద సృష్టించి సంపదను ప్రజలకు పంచుతాం. అప్పులు తీరుస్తాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తాం. అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన బిల్డప్ రాయుళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వారం వారం అప్పులు తెస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ అంటేనే అమరావతి అనేలా రాజధాని పేరుతో ఇప్పటికే రూ. 50 వేల కోట్లకుపైగా అప్పులు చేశారు. మొత్తం రూ. లక్ష కోట్లు అప్పులు సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది చాలదన్నట్టు అమరావతి కోసం మరో 44 వేల ఎకరాలు సమీకరిస్తామని చెబుతున్నారు. దాని డెవలప్‌మెంట్‌కి డబ్బులెలా తెస్తారో చెప్పరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంపద పెరిగిందే తప్ప, కూటమి పాలనలో సామాన్య ప్రజలకు ఒరిగింది శూన్యం. టీడీపీ, జనసేన కార్యాలయాల్లో భారీ బిల్డింగులు పుట్టుకొస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వారికి ఎక్కినా దిగినా స్పెషల్ ఫ్లైట్లు, హెలిక్యాప్టర్లు కావాలి. చంద్రబాబుకి గన్నవరం నుంచి అమరావతికి రావాలన్నా హెలిక్యాప్టర్ ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్‌కి రాజమండ్రికి ప్రత్యేక విమానం, రాజమండ్రి నుంచి పిఠాపురం వరకు ప్రత్యేక హెలిక్యాప్టర్. జనం కొడతారన్న భయమో అధికారం ఉందన్న అహంకారమో తెలియదు కానీ వీరిద్దరూ నేల మీద నడవడం లేదు. నడిచి జనాల్లోకి వెళ్లే పరిస్థితుల్లోనూ వారు లేరు. అధికారంలోకి వస్తే దేశమంతా పిఠాపురం వైపు తిరిగి చూసేలా చేస్తానని చెప్పిన పవన్ కళ్యాన్ అన్నట్టుగానే పిఠాపురంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనతో దేశం మొత్తం చూసేలా చేశాడు. ప్రభుత్వం తరఫున వారిని పలకరించే దిక్కులేదు. ఎమ్మెల్యే, ఎంపీ, దళిత హోంమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆవైపు కన్నెత్తి చూడలేదు. కానీ వీరయ్య చౌదరి అనే టీడీపీ నాయకుడిని లిక్కర్ లావాదేవీల్లో తలెత్తిన వివాదాల కారణంగా చంపితే హోంమంత్రి అనిత హుటాహుటిన అక్కడ వాలిపోయారు. సీఎం చంద్రబాబు వెళ్లి పరామర్శించాడు. కానీ దళితులను సాంఘిక బహిష్కరణ చేసి వారికి నిత్యవసరాలు అమ్మకుండా సహాయ నిరాకరణ చేస్తే దానికి స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నుంచి స్పందన లేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు.