ఉపాధి కూలీలకు 11 వారాలుగా వేతనాలు బంద్‌

ఆ నిధులూ మళ్లించిన టీడీపీ కూటమి ప్రభుత్వం

వెన్నపూస రవీంద్రారెడ్డి ధ్వజం

వేతనాలు ఆపేసి పండగ చేసుకోమంటావా పవనూ?

పనుల్లేక వలసలు పోతున్న దుస్థితి కనిపించడం లేదా?

సూటిగా ప్రశ్నించిన వెన్నపూస రవీంద్రారెడ్డి

ఉపాధి హామీ పనుల్లోనూ భారీగా అవినీతి 

మేట్‌ల నియామకాల్లోనూ అడ్డగోలు వసూళ్లు

దాన్ని ఉద్యోగంగా చూపుతున్న కూటమి నేతలు

పనులు చేయకుండానే దొంగ సంతకాలు

కూలీల పేరుతో వేతనాలు డ్రా చేస్తున్నారు

వెన్నుపూస రవీంద్రారెడ్డి వెల్లడి

పంచాయతీరాజ్‌ నిధులూ యథేచ్ఛగా దారి మళ్లింపు

ఏకంగా రూ.1,120 కోట్ల నిధులు దారి మళ్లించారు

కేవలం 20 రోజుల్లో పంచాయతీల ఖాతాలు ఖాళీ

రూ.500 కోట్ల నిధులు తీసేసుకున్న ప్రభుత్వం 

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన వెన్నపూస రవీంద్రారెడ్డి

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 11 వారాలుగా వేతనాలు చెల్లించడం లేదని, పంచాయతీరాజ్‌ శాఖకు కేంద్రం ఇస్తున్న నిధులను టీడీపీ కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా దారి మళ్లిస్తోందని వైయస్ఆర్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు రూ.1,120 కోట్లు దారి మళ్లించిన ప్రభుత్వం, ఆ ఖాతాల్లో ఉన్న మరో రూ.500 కోట్లు కేవలం 20 రోజుల్లోనే వెనక్కు తీసేసుకుందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు.

వెన్నపూస రవీంద్రారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

కూలీ ఇవ్వలేక జిత్తులమారి కబుర్లు:
    పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా, నిన్న (గురువారం) హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ఇక్కడ పెద్ద ఎత్తున పండగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన వెల్లడించారు. మరో అడుగు ముందుకేసి ఉపాధి కూలీలో.. కూలీ అని పిలవడానికి తనకు మనస్కరించడం లేదని, ఆ పదాన్ని తొలగించాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా తాను రాష్ట్రానికి పెద్ద కూలీగా ఉంటానని జిమ్మిక్కు మాటలతో అధికారంలోకి వచ్చిన పవన్‌కళ్యాణ్, ఇప్పుడు కూలీ అనే పేరెత్తడానికే మనస్కరించడం లేదని చెప్పడం, కచ్చితంగా ఉపాధి కూలీలను అవమానించడమే. 
    ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీ నుంచి నేటి వరకు ఉపాధి కూలీ పనులకు హాజరైన వారికి 11 వారాల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి కరువు ప్రాంతాల్లో చేసిన ఉపాధి పనులకు వేతనాలు రాకుండా అల్లాడుతున్న పరిస్థితులుంటే, వారు ఏ విధంగా పండగ చేసుకుంటారో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నారు. టీడీపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. అయినా రాష్ట్రంలో ఉపాధి కూలీలకు వేతనాలు విడుదల చేయడంలో ఎందుకింత జాప్యం చేస్తున్నారో చెప్పాలి. కూలీ ఇప్పించలేని పరిస్థితుల్లో ఉండి పండగ చేసుకోమని సలహా ఇవ్వడం దౌర్భాగ్యం. 

మేట్‌ నియామకం పేరుతో వసూళ్లు:
    టీడీనీ కూటమి పాలనలో ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. చివరకు పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ల కింద పని చేసే మేట్‌ల నియామకాల పేరుతో టీడీపీ నాయకులు రూ.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి 50 మంది ఉపాధి కూలీలకు ఒకరు మేట్‌గా వ్యవహరిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీరు ఉపాధి కూలీల నుంచి కార్డులు సేకరించి వారి దగ్గర పెట్టుకుంటున్నారు. కూలీ పనులకు రాకపోయినా వచ్చినట్టు దొంగ సంతకాలతో వేతనాలను డ్రా చేస్తున్నారు. నిజమైన జాబ్‌ హోల్డర్ల నెత్తిన శఠగోపం పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపుతున్నారు. 

ఉపాధి కూలీల వలసలు:
    ఏటా మార్చి 30 నాటికి పాత పనులన్నీ పూర్తి చేయడంతో పాటు బిల్లులన్నీ చెల్లించడం, ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పనులు ప్రారంభించడం దేశమంతా ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ రోజుకి కూడా పాత పనులకు పేమెంట్‌ లేదు. కొత్త పనులు ప్రారంభించడం లేదు. రాష్ట్రంలో దాదాపు 74 లక్షల మంది జాబ్‌ కార్డుదార్లు ఉంటే వారిలో 47 లక్షల మందికి యాక్టివ్‌ జాబ్‌ కార్డులున్నాయి. ఇప్పుడు వారంతా ఇక్కడ పనులు లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు చేసిన పనులకు వేతనాలు ఇవ్వడం లేదు. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా పథకాలు అమలు కావడం లేదు. పెరిగిన ధరలతో పేద,  మధ్య తరగతి వర్గాలు బతకడం కష్టమైపోయింది. 

అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థ నిర్వీర్యం:
    ఉపాధి హామీ పథకంలో అవినీతి జరుగుతోందని, దాన్ని నిరోధించే అంబుడ్స్‌మెన్‌ ఉన్నట్టా? లేనట్టా? అని ఎల్లో మీడియాలోనే రాశారు. రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాల్లో అంబుడ్స్‌మెన్‌ పదవీ కాలం ముగిసి 9 నెలలవుతున్నా వారిని రెన్యువల్‌ చేయడం కానీ, తొలగించడం కానీ చేయలేదు. మరి దీనికి పవన్‌కళ్యాణ్‌ ఏం సమాధానం చెబుతారు?  అవినీతిని ప్రశ్నించే అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కూటమి ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. 

పంచాయతీరాజ్‌ నిధుల మళ్లింపు:
    పంచాయతీల నిర్వహణకు నిధులిచ్చి వాటిని బలోపేతం చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా గతంలో కేంద్రం విడుదల చేసిన రూ.500 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం దారి మళ్లించింది. జిల్లా పరిషత్‌లో, మండల పరిషత్‌లో ఉండాల్సిన నిధులను కేవలం 20 రోజుల్లోనే సీఎఫ్‌ఎంస్‌ ద్వారా బదిలీ చేసి ఖాతాలు ఖాళీ చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు నెలల కిందట 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 1,120 కోట్ల నిధులను విడుదల చేస్తే, చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను కూడా యథేచ్ఛగా దారి మళ్లించింది.  

మంత్రి ఆదేశాలతో సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు:
    గ్రామాల్లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్‌ల మీద భౌతిక దాడులు చేయడంతో పాటు, వారి చెక్‌ పవర్‌ను రద్దు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి మండంలోని చెన్నముక్కపల్లిలో సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేశారు. ఏదైనా తప్పు చేసి ఉంటేనో అవినీతికి పాల్పడి ఉంటేనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. కానీ మంత్రి ఆదేశించారని నిర్లజ్జగా, సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేయడం టీడీపీ నాయకులు చేస్తున్న దురాగతాలకు నిదర్శనం. మంత్రి ఆదేశించడంతోనే సర్పంచ్‌ చెక్‌ పవర్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారులు ఆదేశాలివ్వడం చూస్తుంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా?   

జడ్పీ ఛైర్మన్లకు గన్‌మెన్ల తొలగింపు:
    చంద్రబాబు కేవలం టీడీపీ వారికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నాడు వైయస్‌ జగన్‌ సీఎంగా ఉండగా ప్రొటోకాల్‌తో సంబంధం లేకుండా టీడీపీ నాయకులకు కూడా గన్‌మెన్లతో రక్షణ కల్పిస్తే చంద్రబాబు మాత్రం వైయస్ఆర్‌సీపీ నాయకుల భద్రత విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్లను మంత్రులతో సమాన హోదాతో గుర్తించి గన్‌మెన్లు కేటాయిస్తూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 1997లో జీవో ఎంస్‌ నెం:431 జారీ చేశారు. 
    కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జడ్పీ ఛైర్మన్ల గన్‌మెన్లను తొలగించారు. అంటే ఆనాడు తాను ఇచ్చిన ఆదేశాలనే సీఎం చంద్రబాబు ఉల్లంఘించారు. రాష్ట్రంలో జడ్పీ ఛైర్మన్లంతా వైయస్ఆర్‌సీపీకి చెందిన వారే ఉండడంతో, సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణమని వెన్నపూస రవీంద్రారెడ్డి ఆక్షేపించారు. జడ్పీ ఛైర్మన్లకు వెంటనే గన్‌మెన్లను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top