రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు 

రాష్ట్ర ఖజానానే తాకట్టుగా పెడుతున్నారు 

ప్రైవేటు వ్యక్తులు నేరుగా రాష్ట్ర ఖజానానుంచి డబ్బు తీసుకునేలా దుర్మార్గమైన వెసులుబాటు 

మాజీ మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ ఆగ్రహం

హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 

ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను సంపూర్ణంగా తాకట్టుపెడుతున్నారు

రాష్ట్రంలో ఏపీఎండీసీకి చెంది అన్ని గనులనూ తాకట్టుపెడుతున్నారు

ఏపీ చరిత్రలో అప్పులు కోసం రాష్ట్ర ఖజానాల్లోకి అధికారికంగా వెళ్లే అవకాశం ఇస్తున్నారు

సమయానికి కిస్తీలు రాకపోతే ఆ ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఖజానాలోకి వెళ్లి డబ్బు తీసుకోవచ్చు

గతంలో ప్రభుత్వ కార్యాలయాలు తాక్టటు పెడితే చాలా అన్యాయం అంటూ గగ్గోలు పెట్టారు

ఇవాళ ఏపీఎండీసీకి చెందిన గనులను మొత్తం తాకట్టు పెట్టారు

మండిపడ్డ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

బెవరేజెస్‌ కార్పొరేషన్‌పై ఆరోజు అప్పులు తెస్తే.. 

భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టుపెట్టారంటూ ఆరోపణలు చేశారు

ఇవాళ గనులను తాకట్టుపెట్టడమే కాకుండా...

ఏపీఎండీసీ భవిష్యత్తు ఆదాయాలను అన్నింటినీ కూడా తాకట్టుపెట్టారు

ఏపీఎండీసీ రెవిన్యూ అంతా ఒకే ఖాతాలోకి వచ్చేలాగ నిబంధన పెట్టారు

ఆ ఖాతాను సంపూర్ణంగా అప్పులకోసం తాకట్టు పెట్టారు

ఏపీఎండీసీకి వచ్చే ఒక్క రూపాయి కూడా ఇతర పనులకు వాడుకునే అవకాశం లేదు

ఆర్థిక సమర్థత ఉన్న కంపెనీల్లో ఏపీఎండీసీ ఒకటి

ఇప్పుడు దాన్నికూడా సమూలంగా సర్వనాశనం చేస్తున్నారు

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

హైదరాబాద్‌:     దేశంలో ఎప్పుడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో రాజ్యాంగ విరుద్దమైన విధానాలకు తెగబడిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ గా ఉన్న ఏపీఎండీసీ నుంచి రూ.9వేల కోట్ల అప్పులను బాండ్ల రూపంలో సేకరిస్తున్న విధానంలో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆర్బీఐ నుంచే రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా ఆ బాండ్ల కొనుగోలుదార్లకు మళ్ళించేందుకు అనుమతి ఇవ్వడం అత్యంత దారుణమని ఆగ్రహించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ విధానానికి అనుమతించిన అధికారులు కూడా భవిష్యత్తులో దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బుగ్గన రాజేంద్రనాథ్‌ తేల్చి చెప్పారు.

 బుగ్గన రాజేంద్రనాథ్‌ ఏం మాట్లాడారంటే..:   

ఏపీ ఎండీసీ బాండ్లలో అవకతవకలు:
    కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆఫ్‌ బడ్జెడ్‌ బారోయింగ్‌ను ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. అప్పులు విపరీతంగా చేశారు. ఏపీఎండీసీ ద్వారా రూ.9వేల కోట్లకు బాండ్లు విడుదల చేయడం ద్వారా కొత్తగా అప్పులు చేయాలని ఒక స్కీం ప్రారంభించారు. ఏపీఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి, దానిపైన ఈ అప్పులు చేయాలనేదే ఈ స్కీం. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్‌ (ఎన్‌సీడీ) బాండ్స్‌ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
    ఏపీఎండీసీకి ప్రభుత్వ రంగ సంస్థగా ఎక్కడైనా ఖనిజాలు ఉంటే, వాటిని వెలికితీసి, విక్రయించడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం ఈ సంస్థ ముఖ్య కార్యకలాపాలు. దీనిలో ఎక్కువగా అవుట్‌ సోర్సింగ్‌ ద్వారానే ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఏపీఎండీసీ వ్యాపారం అంతా థర్డ్‌పార్టీకి టెండర్లు పిలిచి అవుట్‌ సోర్సింగ్‌ ద్వారానే చేపడుతుంది. కాబట్టి ఏపీఎండీసీకి మూలధన వ్యయం పెద్ద ఎత్తున అవసరం లేదు. కానీ రూ.9 వేల కోట్లు కావాలని ఇప్పుడు బాండ్లు జారీ చేస్తున్నారు.

రాజ్యాంగ విరుద్ధంగా అప్పు. తిరిగి చెల్లించే విధానం:
    ఇంత పెద్ద ఎత్తున నిధులను సేకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్‌ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబైకి చెందిన ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థకు సంప్రదించారు. ఈ సంస్థ ఆయా సంస్థలను పరిశీలించి రేటింగ్‌ను ఖరారు చేసి ప్రకటిస్తుంది. ఈ సంస్థ ఏపీఎండీసీకి ఇచ్చిన రేటింగ్‌ చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఏపీ చరిత్రలో ఎప్పు జరగని విధంగా ఆర్బీఐకి డైరెక్ట్‌ డెబిట్‌ మెకానిజం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తారు. దీని ప్రకారం ఏపీఎండీసీకి సంబంధించిన సంపూర్ణ ఆదాయాలను తాజాగా జారీ చేస్తున్న బాండ్‌ లకు చెల్లించే అసలు, వడ్డీలకు వాడబోతున్నారు. దీనిలో సంస్థకు సంబంధించిన పూర్తి మైనింగ్‌ ఆదాయాలు అప్పు ఇచ్చే సంస్థకు దాఖలు చేస్తున్నారు. రెవెన్యూ కలెక్షన్‌ ఒక ఖాతాలో పెట్టి, దాని మీద నియంత్రణ సదరు బాండ్స్‌ సంస్థకు ఉంటుంది.
    అప్పులు తిరిగి చెల్లించేందుకు బాండ్‌ సర్వీసింగ్‌ పేరుతో ప్రత్యేకమైన రెండో ఖాతా (డెబిట్‌ సర్వీస్‌ రిజర్వ్‌ ఎక్కౌంట్‌–డీఎస్‌ఆర్‌ఏ) తెరుస్తున్నారు. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుగానే ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, ప్రభుత్వాన్ని అడగకుండానే, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ నుంచి ఇచ్చే నిధులను ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు అధికారం ఇవ్వబోతున్నారు. 

గతంలో ఎక్కడా లేని విధానం:
    ఇటువంటి నిబంధనలు, వెసులుబాట్లు చరిత్రలో ఎప్పుడూ ఇలా ఇవ్వలేదు. ఒకవేళ ఏ కారణం వల్ల అయినా ఈ నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసిన వారికి వెళ్ళిపోతాయి. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారికి చేసే చెల్లింపులకు గానూ ముందుగానే నిర్ధేశించిన ఖాతాల్లో మొదటి నెలలోనే ముప్పై శాతం అంటే, మూడో భాగం సదరు ఖాతాలో ఖచ్చితంగా ఉంచాలి. ఇలా ప్రతి నెలా కూడా ముప్పై శాతం నిధులను ఆ ఖాతాలో ఉంచుతూ పోవాలి. ఇది కాకుండా డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ఆరు నెలలకు చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిల్వగా చూపుతూ రావాలి. ఏ కారణాల వల్ల అయినా ఈ నిధులు తగ్గిపోతే నేరుగా ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు బాండ్లు కొనుగోలు చేసిన వారికి వెళ్ళిపోతాయి. 

రాష్ట్ర ఆర్థిక స్థితి బాగు లేదన్న రేటింగ్స్‌ సంస్థ:
    ఇండియా రేటింగ్స్‌ సంస్థ ప్రభుత్వ ఆదాయం గత ఏడాది అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. 1.3 శాతం మాత్రమే వృద్ధి  కనిపిస్తోందని, ద్రవ్యలోటు స్థూల ఉత్పత్తిలో 4.2 శాతం ఉండాల్సి ఉంటే 4.6 శాతంకు పెరిగింది కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగు లేదని చెప్పింది. అయినా కూడా రేటింగ్‌ ఎందుకు ఇచ్చారంటే.. డిబెంచర్‌ కొనుగోలుదార్లకు డీఎస్‌ఆర్‌ఏ ఖాతాలో నిల్వ లేకపోతే నేరుగా ఆర్బీఐ నుంచి నిధులు ఆ ఖాతాకు జమ అయ్యేందుకు అంగీకరించడం వల్లే దీనికి ‘సీఈ’ రేటింగ్‌ ఇచ్చారు. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 
    ఏపీ ఎండీసీ గత ఏడాది వార్షిక నివేదికలో తొమ్మిది నెలలకు గానూ సంస్థ రెవెన్యూ రూ.910 కోట్లుగా ఉంది. అంటే 12 నెలలకు చూస్తే సుమారు రూ.1200 కోట్లు ఆదాయం వస్తుంది. కానీ వీరు చేస్తున్న అప్పులు, డిఎస్‌ఆర్‌ఏ ఖాతాలో ముందుస్తుగా పెట్టే ఆరు నెలల నిల్వలతో కలిపి చూస్తే ఏకంగా రూ.10 వేల కోట్లు. అంటే వీరి ఆదాయంతో పోలిస్తే చేస్తున్న అప్పులు ఎనిమిది రెట్లు ఎక్కువ. ఇది ఏ బ్యాంక్‌ అంగీకరించదు. 

మిసిలేనియస్‌ జనరల్‌ హెడ్‌కు ఇంత భారీ కేటాయింపులా!:
    2025–26 రాష్ట్ర బడ్జెట్‌లో మిసిలేనియస్‌ జనరల్‌ హెడ్‌ – 0075 కింద ప్రభుత్వం రూ.7916 కోట్లు చూపించింది. ఇవి ప్రత్యేకంగా ఏ డిపార్ట్‌మెంట్‌కు కేటాయించని ఖర్చులు. చిన్న చిన్న వ్యయాలకు గానూ ఈ హెడ్‌ నుంచి నిధులను వాడతారు. ఈ హెడ్‌ కింద 2016–17లో రూ.131 కోట్లు, 2017–18లో రూ.307 కోట్లు, 2018–19లో 135 కోట్లుగా ఉండేది. 2023–24లో రూ.153 కోట్లు, 2024–25లో రూ.226 కోట్లు చూపించారు.
    కానీ, మొదటిసారి ఏపీ చరిత్రలో ఈ హెడ్‌ కింద 2025–26కి గానూ రూ.7916 కోట్లుగా చూపించారు. అంటే ముందు పక్కా ప్లాన్‌ ప్రకారం ఇంత పెద్ద మొత్తాన్ని ఆ హెడ్‌లో చూపించి కూటమి ప్రభుత్వ రెవెన్యూ ఖర్చులకు గానూ ఇష్టం వచ్చినట్లు వినియోగించుకునేందుకు సిద్దమయ్యారు.

తాజా అప్పులూ రాష్ట్ర అప్పుల పరిమితి కిందకే:
    ఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్టర్‌ డెబిట్‌ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7శాతం కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ కూటమి ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందే వస్తుంది, కానీ దాదాపు 10 శాతం వడ్డీ పడుతుంది. అంటే దాదాపు మూడు శాతం ఎక్కువ వడ్డీ , దీనికి బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్‌గా తీసుకుని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293(1), 293(3), 203, 204 ఆర్టికల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. అధికారులు దీనిని గుర్తించాలి. గతంలో అసెంబ్లీలో సీఎం, ఆర్థికశాఖ మంత్రి అనేక విషయాలు మాట్లాడారు. 

నాడు తీవ్ర దుష్ప్రచారం:
    గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇలాంటిదే చైనా వంటి దేశాల్లో జరిగితే ఆఫీసర్లను ఉరి తీస్తారని కూడా అన్నారు. ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న పనులకు ఆఫీసర్లకు ఎటువంటి శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. చంద్రబాబు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? మాపైన పదేపదే విధ్వంసం అంటూ మాట్లాడిన చంద్రబాబు, ఇప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న ఆర్థిక విధ్వంసంను ఏమని పిలవాలి? 

లిక్కర్‌ పై ఏఆర్‌ఈటీని సంక్షేమ పథకాలకు ఖర్చు చేశాం:
    ఏపీ ఎండీసీని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వారికి తాకట్టు పెడుతున్నారు. గతంలో వైయస్‌ఆర్‌సీపీ చట్ట ప్రకారం స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసింది. లిక్కర్‌ సిండికేట్‌లతో ప్రైవేటు వ్యక్తులు ఎమ్మార్పీలకు మించి మద్యం విక్రయిస్తు దోపిడీకి పాల్పడుతున్న వైనంను గుర్తించాం. ఇలా ఎమ్మార్పీ కంటే ఎంత ఎక్కువ మొత్తంను సిండికేట్లు వసూలు చేస్తున్నాయో లెక్కించి, ఆ మొత్తాన్ని బేవరేజెస్‌ కార్పోరేషన్‌ ద్వారా చేసే రీటైల్‌ విక్రయాలపై అడిషనల్‌ రీటైల్‌ ఎక్సైజ్‌ టాక్స్‌గా ఖరారు చేశాం. అంటే ఎమ్మార్పీ కంటే ఎక్కువగా మద్యం రేట్లను పెంచి, ఆ సొమ్మును తమ జేబుల్లో వేసుకుంటున్న ప్రైవేటు వ్యక్తుల ఆగడాలను అరికట్టి, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికే పన్ను రూపంలో ఆదాయంగా వచ్చేలా చర్యలు తీసుకున్నాం. ఆ డబ్బుల ద్వారా అప్పులు చేశాం. ఆ అప్పులను కూడా రైతుభరోసా, అమ్మ ఒడి, మహిళల ఆసరా, చేయూత పథకాల కోసం వినియోగించాం. అది కూడా చట్ట ప్రకారమే చేశాం. 
    దీనిపై కూటమి పార్టీలు అనేక విమర్శలు చేశాయి. ఇది తప్పు అంటూ అనేక ఆటంకాలు కల్పించారు. కానీ ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారం తన పనితాను చేసుకుంటూ పోయింది. స్టేట్‌ బేవరేజెస్‌ కార్పోరేషన్‌ కూడా వాట్‌ శాతంను ఆల్టర్‌ చేసి, దానిని ఆదాయంగా చూపి, దీనిని ఈ నాలుగు పథకాలకు వాడటం జరిగింది. కానీ ఇప్పుడు ఏపీఎండీసీ బాండ్ల విషయంలో రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నారు. అప్పులపై గతంలో శ్రీలంక, వెనిజులా, కాంబోడియా అంటూ మాట్లాడిన వారు దీనిని ఎలా సమర్థించుకుంటున్నారు? 

ఇదేనా సంపద సృష్టి అంటే?: 
    రాష్ట్రంలో కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు నుంచి అధికారంలోకి వచ్చిన తరువాత వరకు గత వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై అప్పుల విషయంలో అనేక అబద్దాలు చెప్పారు, ప్రజలను వాటితో మోసం చేశారు. మొదట్లో రూ.14 లక్షల కోట్ల అప్పులన్నారు. తరువాత రోజుకో రకంగా అప్పులపై అంకెలను మారుస్తూ, వాటిని గ్రామాల్లో మట్కా లెక్కల స్థాయికి తీసుకువచ్చారు. వాస్తవాలు ఏమిటా అని చూస్తూ... రాష్ట్ర విభజన తరువాత ఏపీకి ఉన్న అప్పులు రూ.1.40 లక్షల కోట్లు. 2014–19 తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి వాటికి మరో రూ.2.50 లక్షల కోట్లు కలిపారు. ఏడాది మీద ఏడాదికి 22.5 శాతం చొప్పున అప్పు పెరిగింది. మార్చి 2019 నుంచి 2024లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ అయిదేళ్ళ కాలంలో చేసిన అప్పులు చూస్తే కేవలం రూ.3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి 13.5 శాతం మాత్రమే మా హయాంలో అప్పు పెరిగింది. ఇది కూడా రెండేళ్ళ పాటు కోవిడ్‌ సంక్షోభంను ఎదుర్కోవడంలో చేసిన అప్పులు కలిపి. ఫిబ్రవరి 2024 వరకు అంటే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రానికి పన్ను ఆదాయం రూ. 81,400 కోట్లు.
    మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వచ్చిన ఆదాయం రూ.80,760 కోట్లు మాత్రమే. అంటే మా ప్రభుత్వం కన్నా 1 శాతం తక్కువగానే ఆదాయం వచ్చింది. పరిపాలనా అనుభవంలో చాలా దిట్ట అని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆదాయం ఎందుకు తక్కువగా వచ్చింది? ఇదేనా మీరు చేస్తానంటున్న సంపద సృష్టి? కేంద్రం నుంచి వచ్చిన దానితో కలుసుకుని మొత్తం రెవెన్యూ రాబడి చూస్తే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో రూ.1,52,820 కోట్లు. కూటమి ప్రభుత్వంలో వచ్చింది రూ.1,41,370 కోట్లు. అంటే 7.5 శాతం తక్కువ రెవెన్యూ రాబడిని నమోదు చేసుకున్నారు. ఇదేనా చంద్రబాబు పాలనా సామర్థ్యం?
    అప్పుల విషయం చూస్తే గత ఏడాది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో 2024 ఫిబ్రవరి వరకు చేసిన అప్పు రూ.77,208 కోట్లు కాగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ఈ ఫిబ్రవరి వరకు చేసిన అప్పు రూ.90,558 కోట్లు, అంటే మొత్తం 17శాతం అప్పు ఎక్కువగా చేశారు. 

కూటమి పాలనలో అప్పలు పెరిగాయి.ఆదాయం తగ్గింది:
    అన్నీ కలిపి కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు మొత్తం మీద రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేశారు. కూటమి ప్రభుత్వం 11 నెలలకు రూ.90 వేల కోట్ల మేరకు ఆర్బీఐ ద్వారా అప్పుల చేసింది. దాని తరువాత మార్చి 2025లో రూ.8 వేల కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో మరో రూ.5 వేల కోట్ల అప్పు చేశారు. అమరావతి అప్పులు, బాండ్లు, మార్క్‌ఫెడ్, సివిల్‌ సప్లయిస్‌ అప్పులు తదితర అన్నీ కలిపితే రూ.1,47,655 కోట్లు అప్పులు చేశారు. ఈ సొమ్ము ఎక్కడకు వెళ్ళింది?.

పథకాలు అమలు ఊసే లేదు:
    మా హయాంలో పేదల శ్రేయస్సు కోసమే పని చేశాం. ప్రభుత్వం పేదవారికి ఆసరా కల్పించాలనే లక్ష్యంతో పనిచేశాం. దానికి కూడా మాపైన బుదరచల్లారు. వైయస్‌ఆర్‌సీపీ హయాంలో ప్రతి ఏడాది క్యాలెండర్‌ ప్రకారం పేదవారికి ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలను అందించాం. స్కూల్‌కు వెళ్ళే విద్యార్ధులను ప్రోత్సహించేందుక జగనన్న అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశాం. దానికి పేరు మార్చి తల్లికి వందనం అని పథకంను కూటమి పార్టీలు ప్రకటించాయి. కనీసం ఈ పథకాన్ని అయినా అమలు చేస్తున్నారా అంటే అదీ లేదు. విద్యాదీవెన, వసతిదీవెనలను గతంలో మేం పకడ్భందీగా అమలు చేశాం. ఈ ప్రభుత్వంలో ఏమైనా వీటిని అమలు చేస్తున్నారా అంటే ఎక్కడా లేదు. రైతుభరోసా, సున్నావడ్డీ పంటరుణాలు, పంటల ఉచిత బీమా, మత్స్యకార భరోసా, పొదుపు సంఘాల సున్నా వడ్డీ, వైయస్‌ఆర్‌ చేయూత, ఆసరా, కాపునేస్తం వంటి పథకాలకు ఎక్కడా కేటాయింపులు లేవు, అమలు అంతకంటే లేదు. నేతన్న నేస్తం, చేదోడు, లానేస్తం, వాహనమిత్ర, ఈబీసీ నేస్తం, కళ్యాణమస్తు, విద్యాకానుక, పిల్లలకు ఇచ్చే ట్యాబ్‌లు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇచ్చారా అంటే అదీ లేదు. ఒక్క పెన్షన్లు తప్ప ఏ ఒక్క దానిని అమలు చేయడం లేదు. 
    మరి అప్పులు చేసిన సొమ్ములు ఎక్కడకు పోతున్నాయి. కోవిడ్‌ సమయంలో పేదవారికి సంక్షేమ పథకాలను అందిస్తే, కూటమి పార్టీలు దానిని ఆక్షేపించాయి. అలా ఇవ్వకూడదంటూ విమర్శలు చేశాయి. ఎన్నికలు రాగానే మా కంటే ఎక్కువగా పథకాలను పేదలకు ఇస్తామంటూ అబద్దపు హామీలు ఇచ్చి పేదలను మోసం చేశాయి. 

బాబు గ్యారంటీలు. ష్యూరిటీలు ఏమయ్యాయి?:
    రాష్ట్రంలో అన్ని వర్గాలు నేడు సంక్షోభంలో ఉన్నాయి. వ్యాపారాలు నడవడం లేదని చిరు వ్యాపారుల నుంచి అందరూ ఆవేదన చెందుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. బాబు ష్యురీటీ, భవిష్యత్‌ గ్యారెంటీ అన్నారు. దీనికి గ్యారెంటీ నేను అని జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ హామీల ప్రచారంలో ప్రధానమంత్రి ఫోటోలను వాడుకున్నారు. దీనిని చూసిన ప్రజలు ప్రధాని కౌంటర్‌ గ్యారెంటీ కూడా ఈ సూపర్‌ సిక్స్‌ కు ఉందని భ్రమపడ్డారు. నారా లోకేష్‌ ఎన్నికలకు ముందు మాట్లాడుతూ మేం చెప్పినవి అమలు చేయపోతే కాలర్‌ పట్టుకుని ప్రశ్నించాలంటూ వారంటీ ఇచ్చారు. ఇప్పుడు పథకాల అమలు జరగడం లేదు కూటమి పార్టీల గ్యారెంటీ, ష్యూరిటీ, కౌంటర్‌ గ్యారెంటీ, వారెంటీ ఏమయ్యాయి? 

ఉద్యోగుల సొమ్ము వాడుకున్నది తెలుగుదేశం ప్రభుత్వమే:
    అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ఉద్యోగస్తులకు సంబంధించిన డబ్బులను వాడుకున్నారని ఆరోపించారు. కానీ వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి ఉద్యోగులకు సంబంధించి రూ.76,516 కోట్లు వాడుకుంది. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన చిన్న పొదుపు కింద రూ.12,500 కోట్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌ రూ.16,500 కోట్లు, డిపాజిట్లు, రిజర్వులు రూ.47,500 కోట్లు ఉన్నాయి. అదే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగులకు సంబంధించిన మొత్తం ప్రభుత్వం వద్ద ఉన్నది కేవలం రూ.76 వేల కోట్లు మాత్రమే. అంటే తెలుగుదేశం హయాంలో వారు వాడుకున్న దానికన్నా రూ.500 కోట్లు తక్కువగానే ఉంది. దీనిని బట్టి ఉద్యోగుల డబ్బులను వాడుకుంది ఎవరో ఉద్యోగవర్గాలు కూడా అర్థం చేసుకోవాలి.
    2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నిధులు రూ.33 వేల కోట్లు. అయిదేళ్ళ పాలనలో ఉద్యోగులకు సంబంధించిన మొత్తం రూ.76,500 కోట్లుకు చేరుకుంది. అంటే వారికి సంబంధించి రూ. 43,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల పొదుపు, ప్రావిడెంట్‌ ఫండ్‌ను తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంది. వైయస్‌ఆర్‌సీపీ హయాంలో తిరిగి అయిదు వందల కోట్లు కట్టాం. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము వాడలేదు. అలాంటిది టీడీపీ కూటమి ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం హేయమని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చురకలంటించారు.

Back to Top