హామీ ఇస్తున్నా.. అండగా ఉంటా 

ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు సెల్యూట్‌ చేస్తున్నా

పార్టీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందో చాటి చెప్పారు

సమావేశంలో  వైయస్‌ జగన్‌ ప్రశంస

రాష్ట్రంలో ప్రజలు యుద్ధవాతావరణంలో బ్రతుకుతున్నారు

దుర్మార్గమైన, రెడ్‌ బుక్‌ పాలన సాగుతోంది

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు

ప్రజా వ్యతిరేకతను గొంతు ³ట్టుకుని నలపలేరు

మేనిఫెస్టోలో హామీలను నిలబెట్టుకోకపోతే తోలుతీస్తాం

గట్టిగా హెచ్చరించే సత్తా వైయ‌స్ఆర్‌సీపీకే ఉంది

కూటమి ప్రభుత్వానికి  వైయస్‌ జగన్‌ వార్నింగ్‌

స్థానిక సంస్ధల ఉప ఎన్నికల్లో టీడీపీకి బలం లేదు

అయినా అధికార దాహంతోనే పోటీకి దిగింది

చంద్రబాబును ఏకంగా చంద్రగిరిలోనే ఓడించారు

ఆ ఓటమితో కుప్పంకు పారిపోయిన చంద్రబాబు

కుప్పంలో బీసీలను తొక్కిపెట్టిన చంద్రబాబు

చంద్రగిరిలో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడింది

అయినా మన పార్టీ ప్రతినిధులు వెనక్కి తగ్గలేదు

గెల్చిన తర్వాత పార్టీకి జై కొట్టినా కేసులు పెట్టారు

చంద్రబాబు పూర్తి దిగజారుడుకి ఇదే నిదర్శనం

అధికార పార్టీ తీరుపై శ్రీ వైయస్‌ జగన్‌ ఆగ్రహం

మేనిఫెస్టో హామీల అమల్లో ప్రభుత్వం ఘోర వైఫల్యం

హామీల అమలుకు ప్రజలు నిలదీస్తారని భయం

అందుకే ప్రజల్లోకి వెళ్లలేని దుస్థితిలో ఆ పార్టీ కార్యకర్తలు

రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ పూర్తిగా విధ్వంసం చేశారు

కూటమి పాలనలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం

అధికారం చేపట్టిన ఏడాదిలో 4 లక్షల పెన్షన్లు కట్‌ 

రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం

గుడి, బడి పక్కనే బెల్టుషాపులు

ఇష్టమొచ్చిన రేట్లకు మద్యం అమ్మకాలు

ప్రభుత్వ తీరుపై శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కన్నా రెట్టింపు ధరల్లో ఇసుక అమ్మకాలు

ప్రతి నియోజకవర్గంలో మట్టి, మైనింగ్‌ మాఫియా

ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు మామూళ్లు

దోపిడీని ప్రశ్నిస్తే వెంటనే డైవర్షన్‌ పాలిటిక్స్‌

వైయస్‌ జగన్‌ వెల్లడి

ఊరూ పేరు లేని కంపెనీలకు వేల కోట్ల భూపందేరం

ఉర్సాకు అడ్డగోలుగా రూ.3 వేల కోట్ల విలువైన భూమి

ఒక్క రూపాయికి కనీసం ఇడ్లీ కూడా వస్తుందో? రాదో?

అలాంటిది ఆ ఒక్క రూపాయికే ఎకరా ఎలా కేటాయిస్తారు?

రాష్ట్రాన్ని లెప్ట్‌ రైట్‌ సెంటర్‌ దోచుకుంటున్నారు

వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

అమరావతి నిర్మాణ టెండర్లలోనూ అవినీతే

ఐదేళ్ల కిందట రూ.36 వేల కోట్ల టెండర్లు

ఇప్పుడు అవే టెండర్ల విలువ రూ.78 వేల కోట్లు

స్టీల్, సిమెంటు రేట్లు తగ్గినా అడ్డంగా టెండర్ల పెరుగుదల

అయిన వాళ్లకు అడ్డగోలుగా దోచి పెడుతున్నారు

గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

చంద్రబాబు ఏ మంచీ చేయలేదు

ప్రజలను నిలువునా మోసం చేశాడు

కాబట్టి కూటమి సింగిల్‌ డిజిట్‌కే పరిమితం

మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది

ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తున్నాను

జగన్‌ 2.0లో కార్యకర్తలకే పెద్ద పీట:  వైయ‌స్ జ‌గ‌న్ హామీ

వైయ‌స్ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ స్థానిక సంస్థల్లో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల‌కు అండ‌గా ఉంటాన‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. తెగువ అంటే ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ అంటూ ఇటీవ‌ల ఉప ఎన్నిక‌లో ధైర్య‌స‌హ‌సాలు చూపిన ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. గురువారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ స్థానిక సంస్థల్లో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో  మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. సమావేశంలో ఆయా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు, ఎంపీపీలు, ఎంపీటీసీలు.. ఇంకా ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకుల‌తో క‌లిసి ముందుగా, కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంత‌రం పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.

మాట నిలబెట్టుకోకపోతే తోలుతీస్తాం ..
ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో యుద్ధ వాతావరణంలో ప్రజలు బ్రతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్‌ బుక్‌ పాలన ఆంధ్రరాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నలపడం అంత సులభం కాదు, ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే నీ తోలుతీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైయ‌స్ఆర్‌సీపీకి ఉంది. ప్రతి గ్రామం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త లేచి నిలదీస్తాడని చాటి చెప్పాం. 
    అందులో భాగంగాగనే అన్యాయాలకు వ్యతిరేకంగా నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూర్‌ నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, ఎంపీటీసీలు అలాగే వైయస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, అలాగే గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీటీసీలు, అదే విధంగా తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్‌పర్సన్లు, వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్‌ చేస్తున్నాను. 

టీడీపీకి బలం లేకున్నా..:
    ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా తెలుగుదేశం పార్టీకి బలం లేదు. ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితులు మధ్య.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులును ప్రతి చోటా చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ చేస్తుందో ఎవరికైనా అర్ధం అవుతుంది. 
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్ధానాలు వైయ‌స్ఆర్‌సీపీ గెల్చింది. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడుతుంది?. అయినా అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైయ‌స్ఆర్‌సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.
ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. ఉప సర్పంచ్‌ ఎన్నికలో చంద్రబాబు అక్కడా తన బుద్ధి ప్రదర్శించాడు. 20 మంది వార్డు మెంబర్లు ఉంటే 19 మంది వైయ‌స్ఆర్‌సీపీ చెందిన వారే ఉంటే చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు. అక్కడ కూడా ఎంత దారుణంగా భయపెట్టారో, దాడులు చేయించాడో రాష్ట్ర మంతా చూశారు. చివరకి ఎన్నికలు గొడవలు ద్వారా మొదటిసారి వాయిదా వేసారు. రెండోసారి కూడా వాయిదా వేయడానికి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.
    తిరుపతి రూరల్‌ కి సంబంధించి చంద్రగిరి నియోజవర్గం.. చంద్రబాబు ఇల్లు ఇక్కడే ఉంది. చంద్రబాబు మొదటసారి గెల్చించి ఇక్కడే మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే..  ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం పోయాడు. బీసీలు అత్యధితంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి వారిని పైకి తీసుకురావాలని ఎవరైనా చూస్తారు. ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు.. ఆర్ధికంగా అంత బలంగా ఉండరు కాబట్టి.. వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు.
    ఆ చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి రూరల్‌ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ, 34 మంది వైసీపీ తరపున గెలిపించారు. అక్కడ కూడా నామినేషన్‌ వేసే ధైర్యం చివరకి ఎవరికీ లేకపోయినా ఎన్నికలు జరిపించారు. రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్‌ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైయ‌స్ఆర్‌సీపీ తెగువ చూపించారు. దాన్ని కూడా చంద్రబాబు జీర్ణించుకోలేక అహంకారంతో.. ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైయ‌స్ఆర్‌సీపీ అన్నారని వీళ్ల మీద కేసులు పెట్టించారు.
    వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్‌ ఛైర్మన్‌ను దించేయాలని.. అక్కడ 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ కూడా ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ వెంట నిలబడ్డారు.
    అంతకు ముందు రాష్ట్రంలో 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేశారు. చంద్రబాబుకి ఎక్కడా బలం లేకపోయినా.. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. చంద్రబాబు ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. 

ప్రజల్లోకి వెళ్లగలరా? ధైర్యం ఉందా?:
    ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ల గ్రామాల్లో ఉన్న ప్రజల ఇళ్లకు వెళ్లి, బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబుకు చెందిన ఏ కార్యకర్తకు లేదు. కారణం చంద్రబాబుకు సంబంధించిన  కార్యకర్తలు ప్రజల ఇంటికి వెళ్తే, ప్రతి ఒక్కరికీ వెన్నులో భయమే. ఏ ఇంటికి వెళ్లినా  చిన్న పిల్లల నుంచి నా రూ.15వేలు ఏమయ్యాయని ప్రశ్నించడం మొదలు పెడతారు. అక్కడ నుంచి ఆ పిల్లల అమ్మ, చిన్నమ్మ నా రూ.18 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఆ తర్వాత వారి అమ్మలు మాకు 50 ఏళ్లు వస్తే రూ.48 వేలు ఇస్తామన్నారు దాని సంగతేంటని నిలదీస్తారు. ఉద్యోగం కోసం ఉన్న పిల్లవాడు నా రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. అదే ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నా రూ.26 వేల సంగతేమైందని అడుగుతారు. అందుకనే చంద్రబాబుకు చెందిన ఏ కార్యకర్త ప్రజల ఇళ్లల్లోకి వెళ్లి మీరు బాగున్నారా అని అడగే ధైర్యం లేదు. 

 హామీల అమలు లేక ఎదురుచూపు:
    ఇంతటితో ఆగిపోదు. చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో కూడా ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి ఇచ్చి.. బాండ్లు కూడా రాసిచ్చారు. వాళ్ల కార్యకర్తలతో చంద్రబాబు జగన్‌ ఇచ్చినవన్నీ ఇస్తాడు. అదనంగా కూడా ఇస్తాడని బాండ్లు ఇచ్చారు. ఇంకా మేనిఫెస్టోలో 143 హామీలు ఇచ్చాడు. 
    చివరకి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం ఉచిత బస్సు మీద వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. 

వ్యవస్థల విధ్వంసం:
విద్యా రంగం:

    మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులల్లో మన పిల్లలు చదవుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు దగ్గరనుంచి ఇప్పుడు ప్రభుత్వ బడులకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న పరిస్థితికి తీసుకొచ్చారు. స్కూల్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషు మీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశాడు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకం అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడి గాలికెగిరి పోయింది. 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్ధితి ఉండేది. అవి కూడా ఆపేశారు. బడి పిల్లలకు బడులు పోవడం ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చే కార్యక్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్‌ చదువుతున్న పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.

వైద్య–ఆరోగ్య రంగం:
    వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే.. ఉచితంగా ఏ పెద్ద ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకుని చిరునవ్వుతో చికిత్స చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు  ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో  ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టారు. ఇవాళ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని.. అప్పులు పాలైతే తప్ప పేదవాడు బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. 

వ్యవసాయ రంగం:
    ఇక వ్యవసాయం గురించి చూస్తే.. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఇ–క్రాప్‌ ఎక్కడుందో తెలియని పరిస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. రూ.13,500 పెట్టుబడి సాయం కింద జగన్‌ ఇచ్చే పరిస్థితి పోయింది. రూ.26 వేలు చంద్రబాబు ఇస్తానన్నాడు. అది కూడా గాలికెగిరిపోయిందని ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు.

అన్నీ కోతలు. అవకతవకలే:
    వ్యవస్ధలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారి పోయాయి. ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు 66.60 లక్షల పెన్షన్లు ఉంటే.. 12 నెలల కాలంలో జరిగిందేమిటంటే.. 4 లక్షల పెన్షన్లు ఊడగొట్టారు. ఒక్క కొత్త పెన్షన్‌ ఇవ్వకుండా ఉన్న పెన్షన్లు తీసేశారు. ఇదీ చంద్రబాబు నాయుడు సాధించిన ఘనత. 
    అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు షాపు చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువే అమ్ముతున్నపరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. 
    ఇసుక మన హయాంలో కన్నా రెండింతలు రేటుకు అమ్ముతున్నారు. మన  హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మన హయాం కన్నా రెండింతలు  ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముచ్చజెప్పాలి. ఆయన ముఖ్యమంత్రికి అంతో ఇంతో ముట్టజెప్పాలి. నాకింత నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్ర మంతా కనిపిస్తుంది. దీన్నుంచి డైవర్షన్‌ చేయడానికి రోజుకొక డైవర్షన్‌ టాపిక్‌ ఎంచుకుంటున్నారు. 
 
అడ్డగోలు భూపందేరాలు:
    విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీకి రూ.3వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. వాళ్ల పరిస్థితి ఏంటంటే, ఒక చిన్న ఇంట్లో రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇళ్లు.  ఊరూపేరు లేని కంపెనీకి రూ.3వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెట్టారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో, లేదో తెలియదు కానీ, చంద్రబాబునాయుడు హయాంలో  ఉర్సా లాంటి ఊరూ పేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇచ్చి.. నీకింత నాకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతోంది. ఇంకా విశాఖలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500 కోట్ల నుంచి 2 వేల కోట్ల విలువైన భూములు ఇచ్చి, అక్కడ కూడా నాకింత, నీకింత అని పంచుకుంటున్నారు. లెఫ్ట్‌ రైట్‌ సెంటర్‌ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. 

అంచనాల్లో దారుణ పెరుగుదల:
    అమరావతిలో నిర్మాణాలకు 2018లో చంద్రబాబు హయాంలో పిల్చిన టెండర్ల విలువ రూ.36 వేల కోట్లు కాగా, అప్పటి కంటే ఇప్పుడు స్టీలు, సిమెంటు రేట్లు తగ్గినా, ఆ పనుల అంచనాను ఏకంగా రూ.78వేల కోట్లకు పెంచారు. టెండర్లు రింగ్‌ ఫార్మ్‌ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. అంతే కాకుండా గతంలో మొబలైజేషన్‌ అడ్వాన్వులు లేవు. పని చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత మొబలైజేషన్‌ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. అంటే 10 శాతం  మొబలైజేషన్‌ అడ్వాన్వు ముందే ఇస్తాడు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం ఈయన తీసుకుంటాడు. అలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. 

అప్పు మొత్తం ఏమై పోతోంది?:
    మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి?. ఎందుకు సూపర్‌ సిక్స్‌లు లేవు? సూపర్‌ సెవెన్‌లు లేవు?. గతంలో ఎందుకు జగన్‌ చేయగలిగాడు. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం.. గతంలో ఎన్నికలప్పుడే చెప్పాను. జగన్‌ నేరుగా బటన్‌ నొక్కుతాడు. అక్కచెల్లమ్మెల ఖాతాల్లోకి పోతుంది. అదే చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పాను. 
    చంద్రబాబునాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది మీరు మరలా వెంటే జగన్‌ కరెక్టుగా చెప్పాడు మనమే మోసపోయామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది.

ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    ప్రతి రోజూ డైవర్షనే. జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్‌ ఆధికార్ల అరెస్టులు అంటాడు. కరెంటు బిల్లులు షాక్‌ కొట్టేలా పెంచి దాని గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్‌ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్‌ క్రియేట్‌ చేసి దాన్నుంచి టాపిక్‌ డైవర్షన్‌ చేయడం పరిపాటిగా మారింది.
    ఇంతకుముందు రోమన్‌ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ అని గేమ్స్‌ పెట్టేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్‌ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మానిప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ప్రతి రోజూ ఒక డైవర్షన్‌ టాపిక్, ప్రతి రోజూ ఒక డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. 

కచ్చితంగా గెలుస్తాం:
    నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్‌ డిజిట్‌ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది.
    మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్‌ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. గతంలో మీరు అనుకున్నంత స్ధాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్‌ వచ్చింది. రెండు సంవత్సరాలు కోవిడ్‌ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగుల మీద, వారి ఆరోగ్యం మీదనే పూర్తిగా ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. 
    ఈరోజు నేను నా కళ్లతో చూస్తున్నాను. కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను. పాలన ఎలా దిగజారిపోయిందో కూడా నాకళ్లతోనే చూస్తున్నాను. ఇవన్నీ చూసిన నేపధ్యంలో నేను ప్రతి కార్యకర్తకు చెబుతున్నాను. వచ్చే దఫా.. మన హయాంలో జగనన్న మీకు తోడుగా, అండగా గట్టిగా నిలబడతాడు అని మీకు హామీ ఇస్తున్నాను అని సమావేశంలో పార్టీ శ్రేణులకు వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

Back to Top