తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తికావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి మొదలైంది. పెన్షన్, దీపం మినహా మరే ఇతర హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ భూమన అభినయ్‌రెడ్డి వినూత్న ప్రచారాన్ని చేపట్టారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై తిరుపతిలో వీధి నాటకం ప్రదర్శించిన అభినయ్.. తాజాగా చంద్రబాబు ఘరానా మోసం పేరిట ఓ వెబ్ పేజీని స్టార్ట్ చేసి సరికొత్త ప్రచారం చేపడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ.. శనివారం ఉదయం తిరుపతి మూడో డివిజన్‌లోని లెనిన్ నగర్ ప్రాంతంలో భూమన అభినయ్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజల అభిప్రాయాలను సేకరించడం ప్రారంభించారు. చంద్రబాబు ఘరానా మోసం పేరుతో ప్రారంభించిన వెబ్ పేజీ ద్వారా ఇంటి యజమాని పేరు నమోదు చేయించి, కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇస్తామన్న హామీలు అందాయా..? అని మొబైల్ ఫోన్‌లో స్కీమ్‌లకు టిక్ మార్క్ పెట్టిస్తూ.. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి పడిన బకాయిలను చూపిస్తూ.. కూటమి పాలనలో మోసపోయామనే మాటను వారి నోటి నుంచి చెప్పించారు. గతంలో వైయస్ జగన్ పాలనలో అందిన లబ్ధి, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ప్రజలకు అందుతున్న సౌకర్యాల మధ్య తేడాలను ప్రజలే వివరించేలా చేసిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఓ కుటుంబానికి రూ.7,24,000 సాయం ఈ కార్యక్రమంలో ఒక కుటుంబం షాకింగ్ విజయాలను వెల్లడించింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో తన కుటుంబానికి ఏకంగా రూ. 7,24,000 సహాయం అందిందని, కూటమి పాలనలో 11 నెలల్లో ఒక్క రూపాయి కూడా సంక్షేమ పథకాల రూపంలో రాలేదని వాపోయింది. కాగా, జగన్ హయాంలో ఒక్క కుటుంబానికి రూ.7,24,000 అందడం ఆశ్చర్యానికి గురిచేసింది. భూమన అభినయ్ స్వయంగా మూడు ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించగా, కేవలం ఒక్క కుటుంబానికి మాత్రమే పది నెలల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ లభించినట్టు వెల్లడైంది. ఈ సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ, వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నోటి ద్వారానే ఈ విషయాన్ని బహిర్గతం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు ఘరానా మోసం వెబ్‌పేజీలో వివరాలను నమోదు చేసుకొని, తమకు జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవచ్చని అభినయ్‌రెడ్డి వివరించారు.