సోషల్‌ సైకోలకు చంద్రబాబు అండదండలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

టీడీపీ సోషల్‌ మీడియాలో వేలాది మంది

అందరిని పెంచి పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ

ఐటీడీపీ పేరుతో డబ్బులు, బహుమతులు

వాటితో ప్రోత్సహిస్తున్న మంత్రి నారా లోకేష్‌

మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

మార్ఫింగ్‌లు, బూతులు సహించనన్న చంద్రబాబు

కానీ అది అవాస్తవం. ఆయన చెప్పేదంతా అబద్ధం

టీడీపీ అధికారిక సోషల్‌ మీడియాలో దారుణ వ్యవహారం

ఆ ఖాతాల నిండా మార్ఫింగ్‌ ఫొటోలు, బూతులే

సీమ రాజా, కిర్రాక్‌ ఆర్పీ, సూపర్‌ సుబ్బు, చేబ్రోలు కిరణ్‌..

వారు అందరూ టీడీపీ చెట్టు కొమ్మలే

వీడియోలతో సహా చూపిన అంబటి రాంబాబు

తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననమే చంద్రబాబు లక్ష్యం

అందుకే నిరంతరం తప్పుడు పోస్టులు, ప్రచారం

నాడు ఎన్టీఆర్‌ నుంచి నేడు జగన్‌ వరకు అదే తంతు

ప్రత్యర్థులకు డ్యామేజ్‌ చేయడం చంద్రబాబు విధానం

గుర్తు చేసిన అంబటి రాంబాబు

చేబ్రోల్‌ కిరణ్‌ అరెస్ట్‌ చంద్రబాబు ఆడించిన డ్రామా

కూటమి పాలనలో చాలా వేగంగా రిలీజైన వ్యక్తి అతడే

కిరణ్‌ లాంటి వేల మందికి టీడీపీ ఆర్థిక ప్రోత్సాహకాలు

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు స్పష్టీకరణ

తాడేపల్లి: సోషల్‌ మీడియా సైకోలకు చంద్రబాబు అండదండలు కొనసాగుతున్నాయని, తమ సోషల్‌ మీడియాలో వేలాది మందిని టీడీపీ పెంచి పోషిస్తోందని, ఐటీడీపీ పేరుతో డబ్బులు, బహుమతులతో మంత్రి నారా లోకేష్‌ వారిని ప్రోత్సహిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. తమ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననమే టీడీపీ లక్ష్యం అని, అందుకే నిరంతరం తప్పుడు పోస్టులతో దుష్ప్రచారం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు.

అంబటి రాంబాబు ఇంకా ఏం మాట్లాడారంటే..:

చంద్రబాబు మాటలన్నీ ప్రగల్భాలే:
    కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరో నెలకు ఏడాది అవుతుంది. ఈ 11 నెలల కాలంలో చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఏదేదో చేసినట్లు చెప్పుకోవడానికే సరిపోయింది. దానికి ఎల్లో మీడియా తోడై భజన చేసి ప్రజలను ఇంకా మోసం చేయాలని తపన పడుతోంది. ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా చంద్రబాబు విలన్‌లా ప్రవర్తించారే కానీ, మంచి పనులు చేసి ప్రజలతో ఏనాడూ హీరో అనిపించుకోలేదు. 
    ఈసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రగల్భాలు చూస్తే.. మాటలు కోటలు దాటిపోయాయి.
    ‘సోషల్‌ సైకోలకు కోరలు పీకండి. మదమెక్కిన మాట్లాడే వారిని వదిలే ప్రసక్తే లేదు. సోషల్‌ మీడియా సైనికులకు చెక్‌. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్‌ కింద కేసు పెడతాం’.. ఇవీ చంద్రబాబు వీర ప్రగల్భాలు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ కూడా ఒక డ్రామా ఆర్టిస్ట్‌. కొన్ని సోషల్‌ మీడియాపోస్టులు చూసి తన బిడ్డలు కన్నీరు పెట్టుకున్నారంటూ, మంత్రివర్గ సమావేశంలో ఆయన బాధ పడ్డారని ఎల్లో మీడియా అచ్చేసింది. ఇవన్నీ వైయస్ఆర్‌సీపీ వారిని జైల్లో పెట్టడానికి చెప్పిన మాటలే తప్ప, చంద్రబాబు పెంచి పోషించిన సోషల్‌ సైకోలను ఆపడానికి మాత్రం కాదు.

ఏ చర్యలూ లేవు:
    మాజీ సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఆయన కుటుంబం మీద అసభ్యకరమైన పోస్టులు, నీచమైన మాటలు, అభ్యంతరకరమైన మార్ఫింగులు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దానిపైనే మేము ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. కానీ ఎవరి మీదా చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు.  

ఆ విచారణపై జడ్జీ విస్మయం:
    మాజీ సీఎం వైయస్‌ జగన్‌ మీద, ఆయన సతీమణి గురించి చేబ్రోలు కిరణ్‌ అనే ఒక ఐటీడీపీ కార్యకర్త అసభ్యకరమైన భాషలో మాట్లాడటం రాష్ట్రమంతా చూసింది. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అతడ్ని అరెస్ట్‌ చేసినట్టు సీఎం చంద్రబాబు ఒక డ్రామా నడిపారు. ఇది డ్రామా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కిరణ్‌ రిలీజైనంత వేగంగా ఏ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ కూడా విడుదలైంది లేదు. ఏప్రిల్‌ 11న అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిస్తే 23వ తేదీన రిలీజ్‌ కూడా అయ్యాడు.
వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరు అరెస్ట్‌ అయినా విచారణ పేరుతో పోలీస్‌ కస్టడీ కోరుతున్నారు. కానీ కిరణ్‌ విషయంలో మాత్రం అదేదీ జరగలేదు. చంద్రబాబు నాయుడే స్వయంగా కిరణ్‌ని పిలిచి ప్రోత్సహించాడు కాబట్టే ఆయన్ను జైలు నుంచి వేగంగా ఇంటికి పంపించారు.
(అంటూ.. చంద్రబాబు తనను ప్రోత్సహించాడనే విషయాన్ని కిరణ్‌ చెప్పినట్టు వీడియోను ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు).
    కిరణ్‌ కేసులో మంగళగిరి పోలీసులు ఇంత వేగంగా పని చేశారేంటి అని సాక్షాత్తు జడ్జీ అడిగినట్టు కూడా నాకు కొందరు చెప్పారు.

ఇలా ఐటీడీపీ సైకోలు:
    తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ గొడుగు కింద వేల మంది చేబ్రోలు కిరణ్‌లు సోషల్‌ మీడియాలో పని చేస్తున్నారు. అలాంటి 71 ఎక్స్‌ ఐడీలు నా దగ్గరున్నాయి. చంద్రబాబు ముఠా పైశాచికాల గురించి రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. 
(అంటూ..యష్‌ బొద్దులూరి, సీమ రాజా, ఘర్షణ మీడియా, స్వాతి చౌదరి, కిరాక్‌ ఆర్పీ, సూపర్‌ సుబ్బు వంటి ఐటీడీపీ కార్యకర్తలు పెట్టిన అసభ్యకరమైన పోస్టులను ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు). 

వ్యక్తిత్వ హననంలో చంద్రబాబు దిట్ట:
    ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచే ముందు, ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసిన నీచుడు చంద్రబాబు. ముందుగా తన రెండు అనుకూల పత్రికల్లో తప్పుడు వార్తలు అచ్చేయించడం.. దానిపై ఐటీడీపీ కార్యకర్తల చేత పోస్టులు పెట్టించడం, వీడియోలు చేయించడం ఆయన ఫాలో అవుతున్న విధానం.
    వైయస్సార్సీపీ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కొందరికి డబ్బులిచ్చి సోషల్‌ మీడియాలో   తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేసేలా డబ్బులిచ్చి ప్రోత్సహించి వికృతానందం పొందుతూనే ఇంకోపక్క నీతిమంతుడిలా సోషల్‌ సైకోలను అరెస్టులు చేయిస్తానని అబద్ధాలు చెబుతున్నారు. 
    కరోనా సమయంలో జూమ్‌ మీటింగ్‌లు పెట్టి సోషల్‌ మీడియాలో పని చేసిన వారికి పేమెంట్‌ చేస్తానని చంద్రబాబు స్వయంగా చెప్పారు. కంటెంట్‌ కాంపిటేషన్‌ పెట్టి ఎక్కువ రీచ్, వ్యూస్‌ వచ్చిన వారికి గిఫ్టులు, డబ్బులు ఇస్తానని కూడా ఆయన ప్రోత్సహించారు.
(అంటూ.. దానిపై నాడు చంద్రబాబు మాటల వీడియోతో పాటు, ఎల్లో ఛానల్స్‌లో వికృతంగా ప్రదర్శించిన వీడియోల థంబ్‌ నెయిల్స్‌ను ప్రెస్‌మీట్‌లో చూపారు).
    మార్ఫింగ్‌ పెద్ద నేరం అంటూనే తెలుగుదేశం అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచే మార్ఫింగ్‌ ఫొటోలు, పోస్టులు పెడుతున్నారు.  

విమర్శలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి:
    తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వ పరిస్థితి ఎంతవరకు దిగజారి పోయిందంటే మేమేదైనా విమర్శలు చేస్తే వాటికి చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ సమాధానం చెప్పడం లేదు. కిర్రాక్‌ ఆర్పీ, సీమ రాజా వంటి సోషల్‌ సైకోలతో రాజకీయంగా సమాధానాలు చెప్పిస్తున్నారు. అంటే అలాంటి వారి మీద ఆధారపడి రాజకీయాలు చేసే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు దిగజారారు.
    కానీ ఇలాంటివి రాజకీయాల్లో ఎల్లకాలం సాగవన్న విషయం వారు గుర్తుంచుకోవాలి. ఇకనైనా సోషల్‌ మీడియాలో టీడీపీ సైకోలు అనుసరిస్తున్న భాషను మానుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక, చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు పోలీసులు సహకరించకపోయినా న్యాయస్థానాల్లో పోరాడతాం. వారిపై చర్యలు తీసుకునేదాకా వదిలిపెట్టం. 

ఫిర్యాదు చేసినప్పుడు తప్పకుండా రసీదు: 
    ఎవరైనా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పుడు కచ్చితంగా రసీదు తీసుకోవాలి. మన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోతే.. ఆ రసీదులు మన దగ్గర ఉంటేనే, కోర్టులను ఆశ్రయించగలం. న్యాయ పోరాటం చేయగలం. అలాగే, ఎక్కడైనా మనం చేసిన కంప్లైంట్‌కు పోలీసులు రసీదు ఇవ్వడానికి నిరాకరిస్తే.. వెంటనే తనకు తెలియజేయాలని అంబటి రాంబాబు కోరారు.

Back to Top