‘ఉర్సా’కు భూ కేటాయింపుల వెనుక నారా లోకేష్‌

వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి.

గత ఏడాది సెప్టెంబరులో అమెరికాలో ఉర్సా రిజిస్టర్‌

అక్టోబరులో అమెరికాలో పర్యటించిన నారా లోకేష్‌

అమెరికాలో లోకేష్‌ను కలిసిన ఉర్సా ప్రతినిధులు

ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఉర్సా ప్రారంభం

అదే నెలలో ఉర్సా ఇండియా విభాగం రిజిస్ట్రేషన్‌

ఈనెల 10న చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ మీట్‌

15వ తేదీన సీఎం నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం

ఉర్సాకు భూకేటాయింపుపై క్యాబినెట్‌ నిర్ణయం

సీక్వెన్స్‌ వెల్లడించిన పుత్తా శివశంకర్‌రెడ్డి

ఎకరా 99 పైసల చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమి

అప్పనంగా ఉర్సా కంపెనీకి ఇచ్చేశారు 

ఈనెల 19న వెలుగులోకి వచ్చిన అక్రమ వ్యవహారం

ఇప్పటికీ నోరు మెదపని చంద్రబాబు, నారా లోకేష్‌

:గుర్తు చేసిన పుత్తా శివశంకర్‌రెడ్డి

డీపీఆర్‌ పరిశీలించకుండానే ఎస్‌ఐపీబీ, ఎస్‌ఐపీసీ ఆమోదమా?  

డేటా సెంటర్‌ కడతామనగానే విశాఖలో 60 ఎకరాల భూమి 

రూ.10 లక్షల పెట్టుబడికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి!

దీనిపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి

ప్రెస్‌మీట్‌లో పుత్తా శివశంకర్‌రెడ్డి డిమాండ్‌

 తాడేపల్లి: ఉర్సా కంపెనీకి అప్పనంగా భూ కేటాయింపు వెనక మంత్రి నారా లోకేష్‌ ప్రమేయం ఉందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. అందుకే కంపెనీ రిజిస్ట్రేషన్‌ తర్వాత కేవలం 40 రోజుల్లోనే అంత విలువైన భూమిని అంత తక్కువకు ఇచ్చారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గుర్తు చేశారు.

 పుత్తా శివశంకర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

స్కీముల్లేవు.. అన్నీ స్కాములే:
    కూటమి పాలనలో ప్రజలకు ఇస్తామన్న స్కీములు అమలవడం లేదు కానీ.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌తో పాటు, రాజధాని అమరావతి పనుల్లో మాత్రం స్కాములు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు వారి సన్నిహితులకు టీ కప్పు రేటు కన్నా తక్కువకి భూములు అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో హైటెక్‌సిటీ చుట్టుపక్కల భూములను తన వారికి రాసిచ్చినట్టుగానే ఏపీలో అదే విధంగా దోచేయాలని పథక రచన చేశారు. అమరావతిలో కేవలం అయిదు జీ ప్లస్‌ వన్‌ బిల్డింగు కాంట్రాక్టులు కట్టబెట్టి తద్వారా కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకుని, హైదరాబాద్‌లో ఇంద్ర భవనం, మంగళగిరిలో పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. 

‘ఉర్సా’కు భూకేటాయింపు. ఇదీ క్రమం:
    ఉర్సా కంపెనీ తొలుత గత ఏడాది సెప్టెంబరు 27న అమెరికాలో  రిజిస్టర్‌ అయింది. అక్టోబరు 25న మంత్రి నారా లోకేష్‌ అమెరికాకు పయనమయ్యారు. అమెరికాలో మంత్రి లోకేష్‌ను ఉర్సా ప్రతినిధులు కలిశారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లో ఉర్సా ప్రారంభం కాగా, వారం రోజుల తర్వాత.. అంటే ఫిబ్రవరి 19న ఉర్సా ఇండియా విభాగం రిజిస్టర్‌ అయింది. అనంతరం ఈనెల 10వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం జరిగింది. అందులో ఉర్సా కంపెనీకి భూకేటాయింపుపై చర్చ జరగ్గా, 5 రోజుల తర్వాత.. అంటే ఈనెల 15న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉర్సాకు భూకేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఎకరా కేవలం 99 పైసల చొప్పున, మొత్తం రూ.3 వేల కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని విశాఖలో ఉర్సా కంపెనీకి ఇవ్వాలని క్యాబినెట్‌ తీర్మానించింది. కాగా, నాలుగు రోజుల తర్వాత.. అంటే ఈనెల 19న ఈ అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రూ.10 లక్షల పెట్టుబడి. రూ.3 వేల కోట్ల భూమి:
    ఉర్సా కంపెనీని ఈ ఏడాది ఫిబ్రవరి 12, హైదరాబాద్‌లో ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లో మొదలుపెట్టారు. చివరకు ఈ కంపెనీ కరెంట్‌ కనెక్షన్‌ కూడా డొమిస్టిక్‌ పర్పస్‌ మీదనే తీసుకున్నారు. సతీష్‌ అబ్బూరి, కౌషిక్‌ అనే వ్యక్తులు పార్టనర్స్‌గా కేవలం 10 లక్షల పెట్టబుడితో ఈ కంపెనీని మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి అర సెంట్‌ భూమి కూడా పొందే అర్హత లేని కంపెనీకి చంద్రబాబు ఏకంగా రూ.3 వేల కోట్ల విలువైన 60 ఎకరాల భూమి కట్టబెట్టారు.

మెరుపు వేగంతో అన్నీ..:
    ఎక్కడైనా కంపెనీలకు భూములు కేటాయించాలంటే, వాటికి ఆ అర్హత ఉందా? అనే విషయాన్ని డీపీఆర్‌ ద్వారా ఎస్‌ఐపీబీ, ఎస్‌ఐపీసీ సమీక్షిస్తాయి. అలాగే ఆ కంపెనీ చరిత్రను పరిశీలిస్తారు. కానీ, ఇక్కడ అవేవీ జరగలేదు. కంపెనీ రిజిస్టర్‌ అయిన 40 రోజుల్లోనే విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన 59.65 ఎకరాల భూమిని, ఎకరం కేవలం 99 పైసల చొప్పున కట్టబెట్టాలని నిర్ణయించారు. అంటే దీని వెనక మతలబు ఏమై ఉంటుందనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామంటే భూములు ఇచ్చేశారట!. ఇక్కడ మరో దారుణ విషయం ఏమిటంటే, ఈ కంపెనీకి ఇప్పటివరకు ఏ ప్రాజెక్టులు చేసిన చరిత్ర లేదు.

నోరెందుకు మెదపడం లేదు?:
    ఉర్సా కంపెనీ ప్రారంభించిన సతీష్‌ అబ్బూరి అనే వ్యక్తి ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ అనే కంపెనీ పేరుతో చాలా మంది వద్ద రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వసూలు చేసి మోసగించిన నేర చరిత్ర కలిగి ఉన్నాడు. ఉర్సా కంపెనీ పేరుతో కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దానిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోం మంత్రి, మంత్రి లోకేష్‌ సహా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. కంపెనీ ప్రతినిధులు మాత్రం 3.5 ఎకరాలు కోటి రూపాయలకు, 56.5 ఎకరాలు రూ.50 లక్షలకు కొనుగోలు చేశామని చెబుతున్నారు. అయితే ఆ వివరాలు కూడా తమ సొంత సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా ప్రకటించకుండా, టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేయడం చూస్తుంటే భూ కుంభకోణంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

విచారణ జరిపించాలి:
    ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి కేటాయింపుపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులకు సంబంధించి జరిగిన ఎస్‌ఐపీబీ, ఎస్‌ఐపీసీ మీటింగ్‌ మినిట్స్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలి. 

కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ ప్రైవేటు వశమే: 
    వైయస్ఆర్‌సీపీ హయాంలో మెడికల్‌ కాలేజీలు, పోర్టుల నిర్మాణం చేపట్టి వేగవంతంగా పనులు జరిగేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. గత వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా నిరంతరాయంగా ఇంటర్నెట్, ఛానల్స్‌ ప్రసారం జరిగేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏపీ ఫైబర్‌నెట్‌ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. దాన్ని ప్రైవేటుపరం చేయడానికి కనెక్షన్లు తగ్గించుకుంటూ వస్తున్నారు. 
    ఏపీఎండీసీకి భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని చూపించి రాజ్యాంగ విరుద్ధంగా రూ.9,500 కోట్ల రుణాన్ని తీసుకుని ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్నారు. రోడ్లను కూడా ప్రైవేటుపరం చేసి టోల్‌ వసూలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని సీఎం చంద్రబాబే చెప్పారు. ఈ 10 నెలల కాలంలో దాదాపు రూ.1.51 లక్షల కోట్లు అప్పులు చేసి కూడా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల్లో బ్రహ్మాండమైన ప్యాలెస్‌ను నిర్మించుకుంటున్నారని పుత్తా శివశంకర్‌రెడ్డి గుర్తు చేశారు.

Back to Top