విజయనగరం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదని విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్(చిన్న శ్రీను) మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు కొత్తవి కాదన్నారు. స్పౌజ్ పెన్షన్ల కోసం రూ. 36 కోట్లు భారం అంటున్నారు, ప్రభుత్వం పై కొత్తగా ఒక్క రూపాయి కూడా భారం లేదని తెలిపారు. శనివారం చిన్న శ్రీను మీడియాతో మాట్లాడుతూ..గతంలో పెన్షన్ తీసుకున్న వారు మరణిస్తే వారి భార్యలకు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారని, కొత్తగా వితంతు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కంటే ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు తక్కువే అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, లేనిపోని ఆరోపణలతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో మూతపడ్డ పరిశ్రమలు తెరిపించాలని మజ్జి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.