పోలవరం ప్రాజెక్టును భూస్థాపితం చేసే కుట్ర 

ప్రత్యేక హోదాకు పట్టిన గతే పోలవరంకూ పట్టిస్తున్నారు

ప్రభుత్వ కుట్రలతో బ్యారేజ్‌ స్థాయికి పోలవరం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.57 మీటర్లు ఉండాలి

రెండు దశల్లో ఆ పనులకు మా ప్రభుత్వం చొరవ

అందుకు పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డునూ ఒప్పించాం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటన

టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో ప్రాజెక్టుపై నీలినీడలు

కూటమి ప్రభుత్వ ఏర్పాటు పోలవరం ప్రాజెక్టుకు శాపం

ప్రాజెక్టును 41.15 మీటర్లకు కుదించేలా ప్రభుత్వం ఒప్పందం

రూ.2348 కోట్ల అడ్వాన్స్‌ పేమెంట్‌నూ దారి మళ్లించారు

మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడి

ప్రాజెక్టు పూరై్తతే జగన్‌గారికి పేరొస్తుందని చంద్రబాబు కుట్ర

అందుకే నాడు కేంద్ర కేబినెట్‌ ఆమోదించకుండా అడ్డుకున్నారు

మంత్రి రామానాయుడు ప్రాజెక్టుపై అవగాహన తెచ్చుకోవాలి

మీ కూటమి ప్రభుత్వ తప్పులను మా పార్టీపై నెట్టడం సరికాదు

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు స్పష్టీకరణ

గుంటూరు: పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించడానికి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం దగ్గర అంగీకారం తెలపడమే కాకుండా ఆ నిందను తమ పార్టీపై రుద్దడానికి కుట్ర చేస్తున్నారని, ప్రత్యేక హోదా మాదిరిగా పోలవరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేందుకు ఒప్పందం జరిగిందని వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టను రెండు దశల్లో 45.57 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని పబ్లిక్‌ ఇన్వెస్టిమెంట్‌ బోర్డు (పీఐబీ) ఆమోదించిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన చదివి వినిపించారు. ఏపీ ప్రజల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు కుదించి బ్యారేజీగా మార్చాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆక్షేపించారు. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

    పోలవరం ప్రాజెక్టును 45.57 మీటర్లకు పెంచి పూర్తి చేస్తామని ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు చెబితే సరిపోదని, ఇదే విషయాన్ని ప్రధాని మోదీ లేదా కేంద్ర జల శక్తి మంత్రితో చెప్పించే దమ్ముందా? అని మాజీ మంత్రి సవాల్‌ చేశారు.

ఎత్తు కుదిస్తే.. అది బ్యారేజీనే:
    తమ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును 45.57 మీటర్ల ఎత్తుతో రెండు విడతల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేశామని మాజీ మంత్రి వెల్లడించారు. మొదటి దశలో 41.15 మీటర్ల ఎత్తులో 115.44 టీఎంసీలు, రెండో దశలో 45.57 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీల నీరు నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నిలిపితేనే ప్రయోజనమని, దాని ఎత్తు 41.15 మీటర్లకు కుదిస్తే కేవలం బ్యారేజీగానే మిగిలిపోతుందని చెప్పారు.
    పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొన్నా, కమిషన్లకు కక్కుర్తి పడిన చంద్రబాబు, ఆ పనులు చేపట్టి.. ప్రొటోకాల్‌ ప్రకారం అవి చేయలేదని.. ఆనాడు డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో చేసిన తప్పిదం వల్లే, తాము ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయామని అంబటి రాంబాబు వివరించారు. చంద్రబాబు తప్పిదాన్ని అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా తేల్చి చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మంత్రి ప్రాజెక్ట్‌ మాన్యువల్‌ చదవాలి:
    ప్రతి విషయంలో గత మా ప్రభుత్వపైనే నిందలు వేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్న మాజీ మంత్రి, పోలవరం ప్రాజెక్టు పనులపైనా అదే మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఏ ప్రాజెక్టయినా దశల వారీగానే పూర్తవుతుందని ప్రస్తావించారు. అందుకే మంత్రి ప్రాజెక్ట్‌ మాన్యువల్‌ చదువుకోవాలని చురకలంటించారు.
    ప్రాజెక్టు పనుల కోసం అక్టోబరు 9న, కేంద్రం ఇచ్చిన అడ్వాన్స్‌ పేమెంట్‌ రూ.2348 కోట్ల వ్యయంపై పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) నుంచి రాష్ట్రానికి రోజూ ఫోన్లు వస్తున్నా ఎందుకు స్పందించడం లేదని అంబటి ప్రశ్నించారు. ఆ నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు.  

చంద్రుబాబు కుట్ర... అందుకే అడ్డుకున్నారు:
    ఏ ప్రాజెక్టు అయినా పబ్లిక్‌ ఇన్వెస్టిమెంట్‌ బోర్డు (పీఐబీ) ఆమోదం పొందాకే, కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి వెళ్తుందని మాజీ మంత్రి తెలిపారు. ఆ ప్రకారం కేంద్ర కేబినెట్‌కి వెళ్లిన నోట్‌లో పోలవరం ప్రాజెక్టును 45.57 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయడానికి పీఐబీ ఆమోదించిన విషయాన్ని ఆయన చదివి వినిపించారు.
    అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు తర్వాత పోలవరం ప్రాజెక్టుపై కుట్ర చేసిన చంద్రబాబు, గత మార్చి 6న జరిగిన కేంద్ర కేబినెట్‌ ముందు పోలవరం ప్రాజెక్టు అంశాన్ని పెట్టకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభిస్తే.. వైయ‌స్‌ జగన్‌గారికి, వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి పేరొస్తుందన్న దుర్భుద్ధితో చంద్రబాబు ఆ పని చేశారని అన్నారు.
    ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో, ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించేలా ఒప్పందం చేసుకున్న చంద్రబాబు, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని తెలిపారు. ఆ ఒప్పందం తర్వాతే కేంద్రం రూ.12,157 కోట్ల నిధులు ఇచ్చిందని చెప్పారు. 
    కోట్లాది రైతాంగం కల నెరవేర్చడానికి దివంగత మహానేత వైయస్ఆర్ ప్రాజెక్టును ప్రారంభిస్తే చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను భ్రష్టు పట్టించినట్టుగానే, పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు భూస్థాపితం చేస్తున్నారని, దీనికి తమ పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

Back to Top