తాడేపల్లి: ప్రజలతో నేరుగా సామాజిక మాధ్యమాల ద్వారా మమేకం అయ్యే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వాట్సాప్ చానల్‌లో చేరారు. ఇక నుంచి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరు మీద ఉన్న ఈ వాట్సాప్ చానల్ ద్వారా ప్రజలకు మరింత చేరువకానున్నారు. డిజిటల్ మీడియా వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా ఈ విధంగా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇక నుంచి మీతో సన్నిహితంగా ఉంటానంటూ ముఖ్యమంత్రి ప్రారంభ సందేశంలో పేర్కొన్నారు. ఈ డైరెక్ట్ చానల్ ప్రభుత్వం – ప్రజల మధ్య అవినాభావ సంబంధాన్ని పెంచడంతోపాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, విధాన ప్రకటనలు ఇతర సంబంధిత సమాచారాలను ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని సీఎంవో గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా వస్తున్న సమాచార సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకోవడం ద్వారా మరింత పారదర్శక పరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి నిబద్ధతను ఇది తెలియచేస్తోంది. దిగువ పేర్కొన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా సీఎం వాట్సాప్ చానల్‌ను ఫాలో కావచ్చు. https://whatsapp.com/channel/0029Va4JGNi42DccmaxNjf0q ఇలా చూడొచ్చు.. సామాజిక మాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్ ఇటీవల చానల్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే సీఎం వైయస్ జగన్ వాట్సాప్ చానల్ ప్రారంభించారు. ఒక్కసారి లింక్ ఓపెన్ చేసి ఫాలో అయితే చాలు. వాట్సాప్ స్టేటస్‌లోకి వెళ్లి చూస్తే సీఎం పోస్ట్ చేసిన ప్రతి సమాచారం మనకు కనిపిస్తుంది.