పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే శాపం

ఆయన అవగాహనలేని వల్లే పనుల్లో జాప్యం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

పోలవరం సందర్శనలో చంద్రబాబు పచ్చి అబద్దాలు

పోలవరం ఎత్తు 41.15 మీ.కే పరిమితం చేసే కుట్ర

ఈ కుట్రలో ప్రధాన భాగస్వామి సీఎం చంద్రబాబు

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

రెండో దశ కింద 45.72 మీ. నిర్మాణానికి మంగళం

బడ్జెట్‌లోనూ దానిపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు

ప్రాజెక్టు ఎత్తు తగ్గితే పోలవరం బ్యారేజ్‌గా మారుతుంది

చంద్రబాబు అవినీతి, అసమర్థతే దీనికి కారణం

తేల్చి చెప్పిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

2018నాటికే ప్రాజెక్టు పూర్తి చేస్తామని నాడు ప్రకటించారు

ఆ తర్వాతే 2019 ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు చెప్పారు

ఇప్పుడు 2027 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు

ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రూ.12,150 కోట్ల అడ్వాన్స్‌

ఈ నిధులను సీఎం చంద్రబాబు దారి మళ్లించారు

డయాఫ్రం వాల్‌ దెబ్బ తినడానికి చంద్రబాబే కారణం

ఆయన అవినీతి వల్లే అది దెబ్బతిందన్నది ముమ్మాటికి నిజం

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు స్పష్టీకరణ

గుంటూరు: కూటమి ప్రభుత్వంలో సీఎంగా రెండోసారి పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శించిన చంద్రబాబు, ఆ పనులపై నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు చెప్పారని వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు తమ ప్రభుత్వం అమర్చిందని, తమ హయాంలోనే ప్రాజెక్టులో 72శాతం పనులు పూర్తయ్యాయని చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

పోలవరం–చంద్రబాబు–పచ్చి అబద్ధాలు:
    పోలవరం ప్రాజెక్టు పనులకు చంద్రబాబు అబద్దాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత, ఆయన మీడియా ముందు అసత్యాలతో కూడిన ప్రకటనలు చేశారు. 2014–19 మధ్య పోలవరం ప్రాజెక్ట్‌ కోసం రాత్రింబవళ్ళు పని చేశానని చెప్పుకున్నారు. నిజానికి ఆ ప్రాజెక్టును తామే కడతామని కేంద్రం ప్రకటించినా, కమిషన్లకు కక్కుర్తి పడిన చంద్రబాబు ఆ బాధ్యత తీసుకున్నారు. అది ఒక తప్పిదం కాగా, 2013–14 రేట్లకే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ 2016లో అంగీకరించడం మరో తప్పిదం. 
    ఇక ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు డ్రామాలు సరేసరి. ప్రతి సోమవారం పోలవరం అంటూ నానా హంగామా. స్పిల్‌ వే నిర్మాణం కొద్దిగా పైకి రాగానే దాన్ని పూర్తి చేయకుండానే దానిపై ఒక పెద్ద రేకును పెట్టి ఇదిగో గేటు పెట్టాం. పనులు పూర్తి చేసేశాం అంటూ భజన. అలా పచ్చి అబద్దాలు చెబుతూ, తన అనుకూల ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకున్నారు.
    పోలవరం కోసం తెలంగాణ నుంచి ఏడు గ్రామాలను తన వల్లే ఆంధ్రలో కలిపారని, అసలు ఆ ప్రాజెక్టును తానే తీసుకువచ్చానని, దాంతో స్వర్గీయ వైయ‌స్ఆర్ కి ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. 

బాబు నిర్వాకమే అందుకు కారణం:
    చంద్రబాబు నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్నది. అయినా జగన్‌గారి ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చేయడం వల్లే డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయిందని చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత అమెరికా, కెనడా నుంచి నలుగురు ఇరిగేషన్‌ నిపుణులు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు 2014–19 మధ్య జరిగిన తప్పిదల వల్లే పోలవరంకు నష్టం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫ్రం వాల్‌ నిర్మించే ముందు గోదావరిలో ప్రవాహాన్ని మళ్ళించి, రెండు కాఫర్‌ డ్యాంలను నిర్మించాల్సి ఉంది. కానీ చంద్రబాబు ఆనాడు కాఫర్‌ డ్యాంలను నిర్మించకుండానే హడావుడిగా డయాఫ్రం వాల్‌ నిర్మించడం వల్ల, గోదావరి వరదకు అది దెబ్బతిన్నది అనేది వాస్తవం. నిపుణులు సైతం దాన్నే ధృవీకరించారు.

రూ.900 కోట్ల అదనపు భారం:
    చంద్రబాబు అవినీతి, అనుభవ రాహిత్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. అయినా దాన్ని కప్పి పుచ్చుకుంటూ గత మా ప్రభుత్వ పాలనలో పోలవరం దెబ్బతిన్నదంటూ చంద్రబాబు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాడు. మళ్ళీ ఈరోజు కాఫర్‌ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఇంకా డయాఫ్రం వాల్‌ నిర్మాణం అంటున్నారు. చంద్రబాబు అవినీతి, అసమర్థత వల్ల రెండోసారి రూ.900 కోట్లతో డయాఫ్రం వాల్‌ నిర్మించాల్సి వస్తోంది. 

గోదావరి ప్రవాహం మళ్లించకుండా..:
    గోదావరి ప్రవాహంను మళ్ళించకుండా డయాఫ్రం వాల్‌ నిర్మిస్తారా? నలబై ఏళ్ళ సీనియర్‌ అనిచెప్పుకునే చంద్రబాబు అసమర్థత కాకపోతే గోదావరి నదిని మళ్ళించకుండా ఎవరైనా డయాఫ్రం వాల్‌ నిర్మిస్తారా? అదే ఇతర దేశాల్లో చేస్తే విచారణ చేస్తారు. అవసరమైతే ఉరి కూడా వేస్తారు. పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆనాడు సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అటువంటి చంద్రబాబు ఈరోజు గత మా ప్రభుత్వంపైనా, జగన్‌గారిపైనా బురద చల్లుతున్నారు. 

ఆ నిధులు మా చొరవ వల్లే..:
    ఈరోజు కేంద్రం రూ.12,150 కోట్లకు గానూ మొదటిదశ కింద రూ.2300 కోట్లు విడుదల చేసింది అంటే దానికి కారణం ఆనాడు సీఎంగా వైయస్‌ జగన్‌ గారు చూపిన చొరవ. ఎన్నికలకు ముందు ఫైలు కేంద్ర కేబినెట్‌కు వెళితే, దాన్ని ఆమోదిస్తే, జగన్‌గారికి పేరు వస్తుందనే దురుద్దేశంతో, అప్పటికే బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ ఫైల్‌ను కేబినెట్‌ లో ఆమోదించవద్దని వత్తిడి చేయడం వాస్తవం కాదా? ఈ నిధులు జగన్‌గారి హయాంలో విడుదల అయితే ఆయనకు మంచి పేరు వస్తుందని, ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా ఓట్లు వస్తాయని కుట్రతోనే దానిని అడ్డుకోలేదా? ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఆ నిధులు విడుదలయ్యాయి. అయినా ఆ నిధులు ప్రాజెక్టు కోసం కాకుండా, దారి మళ్లించడం వాస్తవం కాదా?.

కేంద్రం రీయింబర్స్‌ చేస్తుంది:
    గతంలో ఇలా అడ్వాన్స్‌గా కేంద్రం నుంచి ఎప్పుడూ నిధులు రాలేదు. నాడు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం పోలవరం కోసం రాష్ట్ర నిధులు వ్యయం చేస్తే, ఆ తర్వాత కేంద్రం ఆ మొత్తం రీయింబర్స్‌ చేసేది. ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లులు కేంద్రానికి పంపితే, వాటిని పరిశీలించి నిధులు విడుదల చేసే వారు. దాన్ని వక్రీకరిస్తూ ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. పోలవరం నిధులను మా ప్రభుత్వం డైవర్ట్‌ చేసిందని విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును కేంద్రం విడుదల (రీయింబర్స్‌) చేసేది.
    నిజానికి పోలవరం ప్రాజెక్టు నిధులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం డైవర్ట్‌ చేస్తోంది. మరోవైపు లోయర్, అప్పర్‌ కాఫర్‌ డ్యాంలు, స్పిల్‌ వే కట్టింది తామే అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. వరల్డ్‌ రికార్డ్‌ అంటూ స్పిల్‌ వే ముందు కాంక్రీట్‌ వేసి, హడావుడిగా బిల్లులు తీసుకుని, రామోజీరావు బంధువు కంపెనీ నవయుగతో షేర్‌ కలుపుకున్నారు.  

అందుకే పోలవరం ఎత్తు తగ్గింపు. కుట్ర:
    నిర్వాసితుల పునరావాస భారం తప్పించుకునేందుకే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. అలా పోలవరంను బ్యారేజీగా మార్చేలా చంద్రబాబు పని చేస్తున్నారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసే కుట్రలో సీఎం చంద్రబాబు భాగస్వామిగా మారాడు. రెండో దశలో నిర్మించాల్సిన 45.72 మీటర్ల ఎత్తుకు కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఇప్పుడు కేంద్రం నుంచి రూ.12,150 కోట్లు మంజూరు చేసిన సందర్భంలో కేంద్రంతో చంద్రబాబు ఏం మాట్లాడాడో తెలియదు. మొదటి దశ నిధులు విడుదల కాగానే ఎత్తు మొదటి దశకే పరిమితం చేస్తున్నారు.
    నిర్వాసితుల పునరావాసానికి ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్లు ఇవ్వకుండా తప్పించుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు సహకరిస్తున్నాడు. తద్వారా భవిష్యత్తులో పోలవరం ఒక బ్యారేజీగానే మిగిలి పోవాల్సిన పరిస్థితి తీసుకువస్తున్నారని అంబటి రాంబాబు ఆక్షేపించారు.

Back to Top