గుంటూరు: శాసనసభ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. 16 రోజులపాటు శాసనసభలో ప్రతిపక్షం లేని సమావేశాలను టీవీల్లో చూడటానికి ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో చాలా చప్పగా జరిగాయి. వైయస్ఆర్‌సీపీ సభ్యులు సభకు హాజరైతే సమాధానాలు చెప్పాల్సి వస్తుందని, తద్వారా వారి తప్పులు ప్రజలకు తెలుస్తాయని కూటమి ప్రభుత్వం భయపడింది. మా పార్టీ సభ్యులు సభకు రాకూడదనే ప్రభుత్వం కోరుకుంటోంది కాబట్టే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండలిలో ప్రధాన పాత్ర పోషించాం అదే సమయంలో మండలిలో ప్రధానపాత్ర పోషించాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాం. మండలి సమావేశాలకు మా పార్టీ సభ్యులు హాజరుకావడంతో మండలిపై ప్రజల్లో ఆసక్తి కనిపించింది. మా పార్టీ సభ్యుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసింది. అప్పులపై అధికార పార్టీ అబద్ధాలు బట్టబయలు - ఇన్నాళ్లు బురదజల్లే కార్యక్రమాలు చేసిన కూటమి నాయకుల గుట్టు శాసనమండలి సమావేశాల ద్వారా బహిర్గతమైంది. రాష్ట్ర అప్పుల విషయంలో చేసిన ప్రచారమంతా అబద్ధమేనని మరోసారి తేటతెల్లమైంది. - జూలై 10న ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రివ్యూలో రూ. 14 లక్షల కోట్ల అప్పులున్నాయని లీకులిచ్చి ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేయించాడు. వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని దుష్రచారం చేశారు. జూలై 22న గవర్నర్ ప్రసంగంలో అప్పులు రూ. 10 లక్షల కోట్లని చెప్పించారు. నాలుగు రోజుల తర్వాత జూలై 26న రాష్ట్రం అప్పులు రూ. 12,93,261 కోట్లని ప్రభుత్వమే ప్రకటించింది. - రాష్ట్రం అప్పులపై వైయస్ఆర్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ రూ. 4,91,734 కోట్లని, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ.1,54,797 కోట్లని, మొత్తం కలిపితే రూ. 6.46 లక్షల కోట్లని రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఎట్టకేలకు తాము చెప్పినవన్నీ అబద్ధాలేనని పరోక్షంగానైనా ఒప్పుకోక తప్పలేదు. - అప్పులపై ప్రజలకు నిజాలు తెలుస్తామయనే భయంతనే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. - జగన్ ఇష్టారాజ్యంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశాడని నమ్మించడం ద్వారా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాలనేది చంద్రబాబు వ్యూహం. అందులో భాగంగానే లేని అప్పులు ఉన్నట్టు, లేని తప్పులు చేసినట్టు శాసనసభ బయట ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారం చేశారు. - దౌర్భాగ్యంగా నిర్వహిస్తున్న ఉచిత ఇసుక విధానం, మిర్చి రైతుల సమస్యలు, పంటలకు మద్ధతు ధరలు, రైతుల కష్టాలపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలవరం ఎత్తు తగ్గించి ప్రాజెక్టును బ్యారేజీగా మార్చడంపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు. పింఛన్ల తొలగింపు, పథకాలకు బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు, బెల్ట్ షాపుల ద్వారా ఊరూరా మద్యం ఏరులై పారుతున్న విధానంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. - నంద్యాల, విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం మెడికల్ కాలేజీలను ప్రారంభించి అదనంగా వైయస్ జగన్ ప్రభుత్వం 750 సీట్లు రాష్ట్రానికి తీసుకొచ్చిన విషయాన్ని శాసనసభలో కూటమి ప్రభుత్వం ఒప్పుకోకతప్పని పరిస్థితి ఏర్పడింది. - మార్కాపురం, పాడేరు, పులివెందుల, మదనపల్లి, ఆదోని కాలేజీలను 2025లో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించినా పీపీపీ విధానం తీసుకొచ్చి సేఫ్ క్లోజ్ చేసిన అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాము. చంద్రబాబు ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాం. - పెట్టుబడుల విషయంలో చేసిన ప్రచారాన్ని కూడా తిప్పికొట్టాం. వైయస్ జగన్ హయాంలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్, దావోస్‌లో జరిగిన ఒప్పందాల కారణంగా అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. గ్రీన్ ఎనర్జీలో దేశానికే ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం నిలబడింది అంటే ఐదేళ్లలో జగన్ చేసిన కృషికి నిదర్శనమేనని అంగీకరించక తప్పలేదు. - ఆడుదాం ఆంధ్ర పేరుతో కోటాను కోట్లు కాజేశారని ఇన్నాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడిన నాయకులు, అదంతా ఉత్తుదేనని మంత్రి చెప్పిన సమాధానంతో నోర్లు మూతబడ్డాయి. - సెకీ ఒప్పందంపై కూటమి నాయకులు, ఎల్లో మీడియా చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. మార్చి 13న జరిగిన శాసనసభ సమావేశాల్లో సెకీ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. మేమొచ్చాక పాత పేర్లు తీసుకొస్తాం - వైయస్ఆర్ పేర్లు తొలగించి చంద్రబాబు శునకానందం పొందుతున్నారు. వైయస్ఆర్ తన స్నేహితుడు అంటూనే తన బుద్ధి ప్రదర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పాత పేర్లను కొనసాగిస్తాం. - పేర్లు మార్చితే కాదు, పథకాలు అమలు చేస్తే మంచి పేరొస్తుందని చంద్రబాబు గుర్తించాలి. మా ప్రభుత్వంలో కృష్టా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం జరిగింది. చంద్రబాబుకి దమ్ముంటే ఆ పేరును తొలగించగలరా? - ప్రజా ప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఆడటం మంచి సాంప్రదాయమే. కాకపోతే అందులోనూ వారు వైయస్ జగన్ పేరును చెప్పుకుని వికృతానందం పొందడం హేయమని అంబటి రాంబాబు అన్నారు.