చంద్రబాబు రాజకీయం కోసం కలియుగ దైవాన్ని కూడా వదిపెట్టడు

ఆధ్యాత్మికత, పవిత్రతపై చంద్రబాబుకు నమ్మకం లేదు

శ్రీవారి సమక్షంలోనే పచ్చి అబద్దాలను అలవోకగా మాట్లాడారు

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్

శ్రీవాణి ట్రస్ట్‌పై విషం చిమ్మిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ

అక్రమాలు జరగలేదని తేలడంతో తమ తప్పును కప్పిపుచ్చుకునే యత్నం

ఆలయాల నిర్మాణంకు కొత్తగా మరో ట్రస్ట్‌ అంటున్న చంద్రబాబుది ద్వంద విధానం

మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజం

తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని సైతం వాడుకునే దౌర్భాగ్యం చంద్రబాబు సొంతమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ పరమ పావనమైన శ్రీవారి వారి క్షేత్రంలోనూ పచ్చి అబద్దాలను అలవోకగా చెప్పే చంద్రబాబుకు ఆధ్యాత్మికత, పవిత్రతపై ఎటువంటి నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా చెప్పుకుంటూ రాజకీయమే పరమావధిగా సనాతన ధర్మాన్ని, స్వామివారి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం చంద్రబాబు నైజమని ధ్వజమెత్తారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...

దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా తిరుమల అన్నదానానికి చంద్రబాబు విరాళం ఇచ్చారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ.. పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతంలో ఆరోపణలు చేసిన శ్రీవాణి ట్రస్ట్‌ను కొనసాగిస్తామని ప్రకటించారు. వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్ అనేది ప్రారంభమైందే టీడీపీ ప్రభుత్వంలో. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైయస్‌ఆర్‌సీపీ ఈ ట్రస్ట్‌ను సమర్థంగా నిర్వహించడం వల్ల దేశ వ్యాప్తంగా 3600 ఆలయాలను ఈ ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులతో నిర్మించడం జరిగింది. అటువంటి ట్రస్ట్‌పైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనేక తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనతో పాటు పవన్ కల్యాణ్ ఇదే తరహాలో అభాండాలు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై విజిలెన్స్‌ విచారణ వేసి, ఇప్పటి వరకు ఒక్క చిన్న తప్పును కూడా నిరూపించలేకపోయారు. శ్రీవాణిని రద్దు చేస్తామన్న టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఈ ట్రస్ట్ గొప్పతనంను గుర్తించి, ట్రస్ట్ ద్వారా విక్రయిస్తున్న టిక్కెట్ల సంఖ్యను కూడా పెంచారు. తాము శ్రీవాణి ట్రస్ట్‌ విషయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారు. శ్రీవాణి ట్రస్ట్‌ను కొనసాగిస్తూనే ఆలయాల నిర్మాణానికి మరో ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది చంద్రబాబు ద్వంద విధానాలకు నిదర్శనం.

శ్రీవారిని అరకు కాఫీతో ఎలా పోలుస్తారు?

తిరుమల వెంకటేశ్వరస్వామి, అరకు కాఫీ, కూచిపూడి నృత్యం ఏపీ వారసత్వ సంపద అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. కలియుగ దైవాన్ని అరకు కాఫీతో ఎలా పోలుస్తారు? ఇదేనా స్వామివారి పట్ల చంద్రబాబుకు ఉన్న భక్తితత్వం? గతంలో తిరుమలలో నీటి ఎద్దడి వల్ల శ్రీవారి ఆలయాన్ని మూడు నెలల పాటు మూసివేయాలని అధికారులు తనకు సూచించారని, తాను వ్యతిరేకించడంతో పాటు తొంబై రోజుల్లో నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించకపోతే ఆ అధికారులను అరెస్ట్ చేస్తానని హెచ్చరించినట్లు చంద్రబాబు చెప్పుకున్నారు. ఆలయాన్ని మూసేయాలన్న ఆ అధికారులు ఎవరో చంద్రబాబు బయటపెట్టాలి. ఏ అధికారంతో వారిని అరెస్ట్ చేస్తానని చంద్రబాబు హెచ్చరించారో కూడా వివరించాలి. లేని దానిని ఉన్నట్లుగా సృష్టించి, గొప్పలు చెప్పుకోవడం చంద్రబాబుకు మాత్రమే తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రక్షాళనతోనే పాలన ప్రారంభించామని, అందుకే ఈఓగా శ్యామలరావును నియమించామని చంద్రబాబు చెప్పుకున్నారు. శ్యామలరావుతో ప్రక్షాళన ప్రారంభమయ్యిందని అనుకుంటే ఆయనతో సమానస్థాయి ఉన్న అధికారులకు ఎవరికీ కూడా సమర్థత లేదని చంద్రబాబు అంగీకరించినట్లే కదా? ఇదే శ్యామలరావు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని కూడా ప్రకటించారు. ఆయన సమర్థతను చూసిన సీఎం చంద్రబాబు శ్యామలరావు చేసిన ప్రకటనకు భిన్నంగా లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటన చేశారు. ఇదేనా శ్యామలరావుపై మీకున్న నమ్మకం? 

వైయస్‌ఆర్ హయాం నుంచే శ్రీవారి కొండపై అందరికీ అన్నదానం

శ్రీవారి దర్శనంకు వచ్చిన వారికే కాదు, కొండపైకి వచ్చిన ప్రతి భక్తుడికి అన్నప్రసాదాన్ని అందించాలనే నిర్ణయం జరిగిందే స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో. అలాగే హిందువులు మాత్రమే స్వామివారి దేవస్థానంలో పనిచేయాలనే నిర్ణయం కూడా వైయస్‌ఆర్ హయాంలోనే తీసుకున్నారు. ఇప్పుడు తామే అన్నప్రసాద విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు, హిందువేతరులకు స్థానం ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు లేని ఘనతను చాటుకుంటున్నారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ది ఉంటే స్విమ్స్‌కు టీటీడీ నుంచి అందుతున్న నిధులను నిలిపేయాలనే ట్రస్ట్ బోర్ట్ పెద్దల అభిప్రాయాలను ఎందుకు వ్యతిరేకించడం లేదు? వైద్యసేవ అంటే చంద్రబాబుకు గౌరవం లేదా? 

టీడీపీ హయాంలోనే హోటళ్ళ నిర్మాణానికి అనుమతులు

తిరుమలలో ఓబెరాయ్‌ సంస్థకు హోటల్, దేవలోక్‌ నిర్మాణాలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే అనుమతులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? సాధుపుంగవులు ఈ నిర్మాణాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో భయపడిన కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ఈ నిర్మాణాలకు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే అనుమతించిందని మాపైన నిందలు మోపుతున్నారు. ఎక్కడైనా దీనిని నిరూపించేందుకు సిద్దం. తిరుమల ఈఓగా ఉన్న ఐఆర్‌ఎస్ అధికారి కొండపై రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. తిరుమలలోని నిర్వాసితులను మీరంతా వైయస్‌ఆర్‌సీపీకి అనుకూలమైన వారు, మీ షాప్‌లను మూసేయిస్తాను అని బెదిరిస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ ఆలయాలను అభివృద్ది చేసి, టూరిస్ట్‌ లకు అనుకూలంగా మారుస్తామని ప్రకటించడం దారుణం. ఆలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువచ్చి, భక్తులు ఆలయాలను చేరువ చేయాల్సింది పోయి పర్యాటక కేంద్రాలుగా మారుస్తానని చెప్పడం దుర్మార్గం. సామాన్య భక్తులకే శ్రీవారి దర్శనానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన చంద్రబాబు దానికి భిన్నంగా రోజుకు ఎనిమిది వేల బ్రేక్ దర్శనాలను వీఐపీలకు ఇస్తున్నారు. సీఎంఓ నుంచే వీఐపీలకు రాచమార్గంలో దర్శనాలను కల్పిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు సామాన్యులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి కల్పించారు. 

సంప్రదాయాలపై చంద్రబాబు ద్వందవైఖరి

వైయస్‌ఆర్‌సీపీ హయాంలో ఈఓ థర్మారెడ్డి కుమారుడు అకాల మరణం సందర్భంగా కర్మకాండలు, దశదిన కార్యక్రమాలు పూర్తయిన తరువాత ఈఓగా ఆయన శ్రీవారి ఆలయానికి వెళ్తే  ఇదే చంద్రబాబు పెద్ద ఎత్తున ఆక్షేపణ చెప్పారు. ఏడాది పాటు ఆయన ఆలయానికి రాకూడదు, ఈ గుడిని ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పదేపదే మాట్లాడారు. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు చనిపోయి రెండు నెలలు కాలేదు. ఏడాది పాటు ఆలయానికి వెళ్ళకూడదనే నిబంధనలు చంద్రబాబుకు వర్తించవా? రాజకీయాల కోసం సంప్రదాయాలను, ఆచారాలను కూడా అడ్డంగా వాడుకునే మనస్తత్వం చంద్రబాబుది. ప్రత్యర్ధులపై దాడి చేసేందుకు చివరికి శ్రీవారిని సైతం వాడుకుంటారు. ఆయన రాజకీయ దాడిలో దేవుళ్ళను కూడా పావులుగా వాడుకుంటారు.
 

Back to Top