దివ్యాంగుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తున్న కూటమి సర్కార్‌

2 ల‌క్ష‌ల దివ్యాంగుల పింఛ‌న్లు తొల‌గించే కుట్ర‌

రీవెరిఫికేష‌న్ పేరుతో కూట‌మి ప్ర‌భుత్వం వేధింపులు

వైయ‌స్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు బందెల కిర‌ణ్ రాజ్‌

తాడేప‌ల్లి పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు బందెల కిర‌ణ్ రాజ్‌

తాడేపల్లి: రాష్ట్రంలో దివ్యాంగుల పట్ల రాక్షసంగా వ్యవహరిస్తూ పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్య‌క్షులు బందెల కిర‌ణ్ రాజ్‌ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దాదాపు రెండు లక్షల పెన్షన్లను తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగ పెన్షనర్లపై వేధింపులు ప్రారంభించారని అన్నారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...

గత వైయస్ జగన్‌గారి ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా దివ్యాంగులకు పెన్షన్లు మంజూరు చేసి వారిని ఆదుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే రాజకీయాలతో దివ్యాంగ పెన్షన్లను ముడిపెడుతూ పెద్ద ఎత్తున పెన్షన్లను తొలగించే ప్రయత్నం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8.25 ల‌క్ష‌ల మంది దివ్యాంగులు పింఛ‌న్లు పొందుతున్నారు. పాక్షిక వైక‌ల్యంతో రూ. 6 వేల పింఛ‌న్లు పొందుతున్న‌వారు సుమారు 8 ల‌క్ష‌ల మంది ఉండ‌గా వైక‌ల్య శాతం పునఃప‌రిశీలన పేరుతో దాదాపు 2 ల‌క్ష‌ల మందిని ప‌రీక్షించి 1.50 ల‌క్ష‌ల మంది వివ‌రాల‌ను ఆన్‌లైన్లో పొందుపరిచారు. మిగిలిన వారి పింఛ‌న్ల‌ను హోల్డ్‌లో పెట్టారు. మొద‌టి ద‌శ‌లో రూ. 15 వేలు పింఛ‌న్ తీసుకునే మంచానికి ప‌రిమిత‌మైన సుమారు 25 వేల మంది ఇంటికి వెళ్లి వైక‌ల్య శాతం పునఃప‌రిశీలన చేశారు. ప్ర‌భుత్వం టెస్టులు చేసి 20 వేల మందినే అర్హులుగా గుర్తించి మ‌రో 5 వేల మందిని పాక్షిక వైక‌ల్యం ఉన్న‌వారిగా నిర్ధారించారు. ఈ మేర‌కు వారి వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో పొందుప‌రిచారు. మొత్తం పెన్షన్లలో మిగ‌తా 6 ల‌క్ష‌ల మందిని కూడా ఇలాగే ప‌రీక్షించి దాదాపు  2 ల‌క్ష‌ల పింఛ‌న్లకుపైగా తొల‌గించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిస్థితిని చూసి దివ్యాంగులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పింఛ‌న్లనే న‌మ్ముకున్న దివ్యాంగులు ఆక‌లితో అల‌మ‌టించే రోజులు రాబోతున్నాయా అనే అనుమానం క‌లుగుతోంది. 

కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా... ఉన్నవి కూడా తొలగిస్తున్నారు

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్క కొత్త దివ్యాంగుల పింఛ‌న్ అయినా మంజూరు చేయక పోగా, ఉన్నవాటిని కూడా తొలగిస్తున్నారు. స‌ద‌రం క్యాంపుల వ‌ద్ద క‌నీస వ‌స‌తులు కూడా క‌ల్పించ‌కుండా వేధిస్తున్నారు. ఏలూరులో దివ్యాంగుల‌తో జ‌న‌సేనాని అని  కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి దివ్యాంగుల‌కు రూ. 10 వేలు పింఛ‌న్ ఇస్తామ‌ని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారు. ఆయ‌న మాట‌లు నిజ‌మేన‌ని దివ్యాంగులు న‌మ్మారు. కానీ కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక రీవెరిఫికేష‌న్ పేరుతో గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన పింఛ‌న్లు లాగేసుకోవ‌డం ధ‌ర్మమా అని ఆలోచించాలి. ఎన్నిక‌ల‌కు ముందు అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌క్ష‌ణం స్పందించాలి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అర్హులుగా క‌నిపించిన దివ్యాంగులు ఇప్పుడు అన‌ర్హులు ఎలా అయ్యారో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలి?  దాదాపు 15-20 ఏళ్లుగా నుంచి పింఛ‌న్లు అందుకుంటున్న వారికి రీవెరిఫికేష‌న్ పేరుతో వైక‌ల్య ప‌రీక్ష‌లు చేయ‌డం ధ‌ర్మమేనా?  వైక‌ల్య నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో దివ్యాంగులు ఫెయిలైతే వారికి సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్ట‌ర్ల మీద కూడా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌దా? 2016 దివ్యాంగుల హ‌క్కుల చ‌ట్టం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించి అందరికీ న్యాయం చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ సీఎంగా దివ్యాంగుల‌కు ఇళ్ల స్థ‌లాల కేటాయింపుల్లో 5 శాతం వాటా ఇచ్చారు. అన్ని సంక్షేమ ప‌థ‌కాల్లోనూ 5 శాతం దివ్యాంగులకు అవ‌కాశం ఇచ్చారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ఏ ప‌థ‌కంలోనూ దివ్యాంగుల‌కు వాటా లేదు. ఇచ్చిన పింఛ‌న్ల‌నే తొల‌గింపు ప్ర‌క్రియకు శ్రీకారం చుట్టారు. ఏ విష‌యంలోనూ దివ్యాంగుల‌కు రాయితీ ఇవ్వ‌డం లేదు. దివ్యాంగుల హ‌క్కుల ర‌క్ష‌ణ కోసం, వారికి అండ‌గా నిల‌బ‌డి వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది. పింఛ‌న్ల తొల‌గింపు పేరుతో చేస్తున్న వేధింపుల‌ను త‌క్ష‌ణ‌మే ఆపాలి. వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో ట్రాన్స్‌జెండ‌ర్ ప్రొటెక్ష‌న్ సెల్ ఏర్పాటు చేసి ర‌క్ష‌ణ క‌ల్పిస్తే, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక అన‌కాప‌ల్లిలో ట్రాన్స్‌జెండ‌ర్ ను న‌రికి చంపితే ఈ ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్ట‌యినా లేదు.
 

Back to Top