కాకినాడ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారంటూ, సాక్షి దిన పత్రికపై కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు . ఇది పత్రికా స్వేచ్ఛపైనే దాడి. రోజురోజుకీ గతి తప్పి వ్యవహరిస్తున్న ప్రభుత్వం, ఒక నియంతలా మారుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యను కన్నబాబు తీవ్రంగా ఖండించారు. విజయవాడను ముంచెత్తిన వరదల తర్వాత, సహాయ పనుల్లో రూ.534 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాలను అధికారులు స్వయంగా సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. అందులో అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, భోజనాలు, నీళ్ల బాటిల్స్ కోసం ఖర్చు చేసినట్లు చూపిన మొత్తం.. ఆ గణాంకాలు వాస్తవాలకు పూర్తి విరుద్ధంగా ఉండడంతో, దాన్ని ప్రస్తావిస్తూ, వాస్తవంగా అయ్యే ఖర్చును వివరిస్తూ.. వరద సహాయ పనుల్లో జరిగిన అవినీతిని ప్రశ్నిస్తూ రాయడం తప్పా? నిజానికి అది మీడియా బాధ్యత. అదే పని ‘సాక్షి’ చేసింది. ప్రభుత్వం చెప్పిన లెక్కలనే చూపుతూ.. వరద సహాయ పనుల్లో చోటు చేసుకున్న అంతులేని అవినీతిని ఎండగట్టింది. దీంతో సాక్షి పత్రికపై కక్ష కట్టిన టీడీపీ ప్రభుత్వం, మరింత దిగజారి ఏకంగా కేసు నమోదు చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇప్పటికే కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి, బెదిరించి సాక్షి ఛానల్ ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు పత్రికపైనా కత్తి కట్టారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సాక్షి పత్రికపై కేసు ఉపసంహరించాలని మాజీ మంత్రి కన్నబాబు డిమాండు చేశారు.